వాణిజ్య పన్నుల శాఖలో ఏదైనా సాధ్యమే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఫోకల్ పోస్టుల్లో నియమిస్తారు. ముడుపులు కొడితే ఎవరిని ఎక్కడకైనా బదిలీ చేస్తుంటారు. ఇటీవల ఈ శాఖలో బదిలీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. అయినా ఉన్నతాధికారుల తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు సొంత జిల్లా పరిధిలో ఓ అధికారిని కొనసాగించడం వాణిజ్య పన్నుల శాఖలో చర్చనీయాంశమైంది.
ప్రకాశం జిల్లా వేటపాలేనికి చెందిన డీ నాగజ్యోతి 2007లో గ్రూప్1 పరీక్ష పాసై సిటీఓగా సత్తెనపల్లిలో చేరారు. ఆ తర్వాత 2014లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని నెల్లూరు డివిజన్‌కు డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతిపై వెళ్లారు.. నిబంధనల ప్రకారం సొంత జిల్లా పరిధిలో పోస్టింగ్ ఇవ్వకూడదు. అయినా ఇచ్చారు. తర్వాత 2019 జులైలో నెల్లూరు నుంచి డిప్యూటీ కమిషనర్‌గా గుంటూరు బదిలీ అయ్యారు. అనంతరం 2021లో జాయింట్ కమిషనర్ గా పదోన్నతి కల్పించి గుంటూర్లోనే కొనసాగించారు.
ఇటీవల డిపార్టుమెంటులోని వివిధ సర్కిళ్లను కుదించారు. కొన్నింటిని విలీనం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు సర్కిల్‌ను రద్దు చేసి చీరాల, బాపట్లలో కలిపేశారు. చీరాల, వేటపాలెం ప్రాంతాలు నేడు బాపట్ల జిల్లా పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం గుంటూరు 2లో నాగజ్యోతి జాయింట్ కమిషనర్ గా కొనసాగడమంటే మళ్లీ సొంత జిల్లా పరిధిలోకి వెళ్లినట్లే.
వాణిజ్య పన్నుల శాఖలోని పలు సర్కిళ్ల విలీనంతో గుంటూరు –2 పరిధిలోకి గుంటూరు, పల్నాడు జిల్లాలతోపాటు బాపట్ల జిల్లా కూడా చేరింది. ఆమె భర్త ప్రభుత్వ విప్ దగ్గర పీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో చక్రం తిప్పారు. నిబంధనలను అతిక్రమించి సొంత జిల్లా పరిధిలోకి ఆమెను కొనసాగేట్లు చేశారు.
ఇదే అంశం ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఇలాగైతే ఎవరి సొంత జిల్లాలో వాళ్లకు పోస్టింగులు ఇవ్వొచ్చు కదా అంటూ నోటిమీద వేలేసుకుంటున్నారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.