ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు తలపడేవి. అధికార ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను అంతగా ప్రాధాన్యమిచ్చేది కాదు. వామపక్షాలకు చెందిన ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం నుంచి ఎన్నికవుతుంటారు. ఈసారి అధికార వైసీపీ దక్కించుకోవడానికి పట్టుదలగా ఉంది. అదే స్థాయిలో ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రయత్నిస్తోంది. వామపక్షాల నుంచి ఒకరు బరిలో ఉంటారు. వీళ్లతోపాటు ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీల సహకారంతో మరో అభ్యర్థి రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ నుంచి పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా రంగంలోకి దిగుతున్నారు. ఈపాటికే సీఎం జగన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శ్యాంప్రసాదరెడ్డి ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తున్నారు. గెలుపు కోసం కృషి చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్దిపొందుతున్న యువతపై దృష్టిసారిస్తున్నారు. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు ఇవ్వాలనే నిర్ణయం నిరుద్యోగ గ్రాడ్యుయేట్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతపైనే టీడీపీ ఆశలు..
ఇక ప్రతిపక్ష టీడీపీ నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్ చౌదరి పోటీపడుతున్నారు. ఆయన గతంలో జడ్పీటీసీగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ప్రస్తుతం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులతో ఆయన రంగంలోకి దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాల వల్ల నిరుద్యోగం మరింతగా ప్రబలుతుందనే ప్రచారంతో ముందుకెళ్తున్నారు. గతంలో యువత స్వయం ఉపాధికి ఊతమిచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల యువత తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉందంటున్నారు. రాష్ట్రం పారిశ్రామిక తిరోగమనంలో ఉందనే ప్రచారంతో శ్రీకాంత్ చౌదరి దూసుకెళ్తున్నారు.
ఇక ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీల సహకారంతో పర్యావరణ ఉద్యమకారుడు, సర్పంచుల సంఘం ప్రకాశం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, గ్రామ స్వరాజ్య సాధన సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జీ వీరభద్రాచారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మడమ వెనక్కి తిప్పేశారని ఆయన విమర్శిస్తున్నారు.
జనాభాలోని 90 శాతం అణగారిన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎప్పుడు ?
చట్ట సభలకు నేరుగా ఎన్నిక కాలేని ఏడెనిమిది అల్పసంఖ్యాక బీసీ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీని సీఎం జగన్ తుంగలో తొక్కారని వీరభద్రాచారి దుయ్యబడుతున్నారు. అధికార ప్రతిపక్షాలు వాళ్ల సామాజిక వర్గాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. జనాభాలో 90 శాతం ఉన్న ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలకు చట్టసభల్లో ఎప్పటికి ప్రాతినిధ్యం లభిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలోని అణగారిన వర్గాల్లో కొత్త ఆలోచనలకు పురుడు పోస్తుందని వీరభద్రాచారి చెబుతున్నారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల తరపున శాసన మండలిలో గొంతు విప్పుతామంటున్నారు. అధికార వైసీపీ అమలు చేస్తున్న విధానాలు ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా బానిసత్వంలోకి నెడుతున్నాయని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలతో ఒక్క గ్రాడ్యుయేట్ నైనా దారిద్య్రం నుంచి బయటపడేయగలిగారా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రభుత్వ హయాంలోనే అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయని నిప్పులు చెరుగుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మండలిలో అణగారిన వర్గాల స్వరం వినిపిస్తామని ఢంకా బజాయిస్తున్నారు. ఇంతకీ ఈ మూడు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం గడతారనేది వేచి చూడాల్సిందే.