పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టారీతిన పెంచారు. మారుమాట్లాడలేదు. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నామంటే ఉత్తుత్తి అరుపులు అరిచారే తప్ప పార్లమెంటు ఉభయసభల్లో తిరగబడలేదు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కొర్రీలు వేస్తున్నామేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నారు. కడప ఉక్కుకు మంగళం పాడినా స్పందన లేదు. విభజన హామీలు నెరవేర్చకుంటే చొక్కా పట్టుకుంటామని మాటమాత్రం కూడా అనడం లేదు. అంతెందుకు ! వంట గ్యాస్ ధరలు రెండింతలు పెంచినా.. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు తెగ బాదేస్తున్నా.. ఇదేంటని అడగడానికి నోరు పెగల్లేదు. అయినా మీకు మళ్లీ అధికారం కట్టబెట్టడానికి ప్రజలేమైనా పిచ్చోళ్లా ?
ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదేనని ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. నాలుగింట మూడొంతుల ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయనేది సర్వే సారాంశం. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
సగటు ప్రజల ఆదాయాలు పెంచడానికి బదులు జీవన వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. మూడేళ్ల క్రితం నాటితో పోల్చుకుంటే ఒక్కో కుటుంబం నెలకు సుమారు రూ. 6 నుంచి 8 వేల దాకా అదనపు భారం భరించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు.
విశాఖ ఉక్కు అమ్మకాన్ని నిలువరించకుండా ప్రజల మద్దతు పొందగలరా !
విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకాన్ని నిలువరించకుండా విశాఖ ప్రజలను ఆకట్టుకోగలరా ! వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఇక్కడ రైతుల మద్దతు పొందగలరా !
ఉభయ గోదావరి జిల్లాల్లోని 80 శాతం మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు. అసలు ఈ క్రాప్‌లో వాళ్ల పేర్లే లేవు. వాళ్లను రైతులుగానే గుర్తించడం లేదు. వీళ్లంతా వైసీపీకి ఓటేస్తారా ! పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్రం పేచీలతో మోకాలడ్డుతుంటే ఏం చేశారు ! రాష్ట్రపతి ఎన్నికల్లో భేషరతు మద్దతు ఇచ్చారు. ఇలాంటి కుటిల రాజకీయాలు ప్రజలకు అర్థం కావనే ధీమానా ?
ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్న కేంద్రాన్ని నిలదీయకుండా ఓట్లు వేయించుకోగలరా !
టన్ను ఐదువేలకు దొరికే బొగ్గును అదానీ నుంచి రూ.30 వేలకు కొనుగోలు చేసి ప్రజల నెత్తిన అనేక రెట్లు విద్యుత్ భారాన్ని మోపుతున్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో మూలిగలు పీల్చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ సవరణ బిల్లుకు కళ్లు మూసుకొని ఆమోదం తెలుపుతున్నారా లేదా ! సదరు బిల్లులో వ్యవసాయానికిచ్చే ఉచిత కరెంటును మినహాయించాలని కోరాలనిపించలేదా ! ఓటు బ్యాంకుల కోసం పథకాలు సృష్టించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. అప్పుల కోసం దేబిరించినప్పుడల్లా కేంద్రం విధిస్తున్న షరతులతో ప్రజల రక్తం పీల్చేస్తారా !
మళ్లీ గెలుస్తామనే ధీమా వెనుక ఏం మాయాజాలం ఉందో !
ఇప్పటికే ద్రవ్యోల్బణం రెండంకెలు దాటి ఆందోళనకరస్థాయికి చేరింది. సగటు ప్రజలు నిత్యావసరాలే కొనుగోలు చేయలేక సతమతమవుతున్నారు. అయినా కార్పొరేట్ల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం ముందుకెళ్తోంది. బీజేపీ ఏం చేసినా దానికి ఇక్కడ ఊడేది లేదు..పోయేది లేదు. ఆ సెగ మాత్రం వైసీపీకి తగలక మానదు. కేంద్ర నిర్ణయాల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు మరింతగా దివాళా తీస్తున్నారు. ఇంతలా రాష్ట్ర ప్రజలను కేంద్రానికి తార్చి అన్నీ సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేయడం భేష్. దీని వెనుక ఏదో మాయాజాలం ఉండి ఉండాలి. జనానికి మండితే ఏ మాయోపాయాలు పనిచేయవు. అది వైసీపీ సర్కారుకు త్వరలోనే తెలిసి రావొచ్చు.