జనాభాలో సగమైన మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ రాజకీయ పార్టీ మనగలగ లేదు. అలాగే యువత ఎక్కువగా ఏ పార్టీలో ఉంటుందో అది సజీవంగా ఉంటుంది. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలను పరిశీలిస్తే.. జనసేన పార్టీలోనే మహిళలు, యువత ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో జనసేన టీడీపీని వెనక్కి నెట్టేసింది. అందుకే అధికార వైసీపీ జన సైనికులను టార్గెట్ చేస్తోంది. జనసేన పార్టీ ఏ ఆందోళన చేపట్టినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. టీడీపీ విమర్శలకు ఎదురు దాడి చేస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే ఎన్నికల నాటికి వైసీపీకి జనసేనే ప్రత్యామ్నాయం కావొచ్చు.
టీడీపీకి గణనీయమైన ఓటింగ్ శాతం ఉన్నా ఆ పార్టీలో మహిళలు, యువత పెద్దగా కనిపించడం లేదు. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి యువత కనిపించడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే దిక్కు. అణగారిన వర్గాల నుంచి యువతను పార్టీలోకి ఆకర్షించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలూ అంతగా లేవు. పార్టీ నాయకత్వంలోనే దీనిపై చొరవ చూపిస్తున్నట్లు లేదు.
అదే జనసేన పార్టీలో కాపు సామాజిక వర్గాలతోపాటు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం పెరిగింది. ప్రత్యేకించి మహిళలు, యవత భాగస్వామ్యం మరింతగా పెరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తోంది. కౌలు రైతుల భరోసా యాత్ర నుంచి రోడ్ల మరమ్మతుల వరకూ జనసేన పార్టీ ప్రతిష్టను మరింత పెంచింది. జనవాణి పేరుతో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పూనుకోవడం కూడా పార్టీని బలోపేతం చేస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షేత్ర స్థాయి కార్యకర్తలను గాలికొదిలేసింది. సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసిన ఎందరినో పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల్లోనూ నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. పాలనలో పార్టీ యంత్రాంగానికి భాగస్వామ్యం లేకపోవడం కూడా వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది.
మూడేళ్ల తర్వాత దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఒక్కో నియోజకవర్గంలో 50 మంది క్రియాశీలక కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ సందర్శన భాగ్యం కల్పించారు. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది.
అందుకే ఇప్పుడు వేగంగా దూసుకొస్తున్న జనసేనను అడ్డుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. ఈపాటికే జనసేన పార్టీ బీజేపీ పొత్తులో ఉంది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగితే కేంద్ర పెద్దలు ఆలోచనలో పడొచ్చు. అందువల్ల జనసేన పెరుగుదలను అడ్డుకోవడంపైనే వైసీపీ నాయకత్వం దృష్టి పెడుతోంది.
కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్‌కే లోపాయికారి మద్దతు ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఎన్నికల నాటికి అప్పటి బలాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అందుకే ఎలాగైనా జనసేనను వెనక్కి కొట్టాలని వైసీపీ భావిస్తోంది. ఆచరణలో ఎవరు బలపడతారు.. మరెవరు బలహీనపడతారనేది ప్రభుత్వ నిర్ణయాలు.. సమస్యలపై విపక్షాల పోరాటాన్ని బట్టి ఉంటుంది.