“రాష్ట్రంలోనే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. ఏపీలో కేవలం రెండు సామాజిక వర్గాలే ఇప్పటిదాకా పెత్తనం చేస్తూ వచ్చాయి. ఇలాగైతే మిగతా సామాజిక వర్గాలకు రాజకీయ సాధికారత ఎప్పుడొస్తుంది ? అణగారిన వర్గాలకు నిజమైన అధికారం దక్కాలని జనసేన కోరుకుంటోంది !” అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎవరికో కొమ్ముగాయడానిక్కాదు. రాష్ట్రంలో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు.
పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు రాయలసీమలో పర్యటించారు. కడప జిల్లాలోని సిద్దవటంలో పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రచ్చబండ నిర్వహించారు. తిరుపతిలో జనవాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు ఉత్తుత్తి పదవులు కట్టబెట్టడం కాదు. ప్రభుత్వంలో నిర్ణయాత్మక పాత్ర పోషించేట్లు చేయడమే జనసేన పార్టీ లక్ష్యంగా ప్రకటించారు.
ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆ దిశగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సెంటు భూమి లేని కౌలు రైతులు సుమారు 15 లక్షల మంది ఉన్నారు. వీళ్లలో 80 శాతం ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలే. ఆ వర్గాలకు జనసేన పార్టీ పెద్ద పీట వేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన 3 వేల మంది కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున సాయం చేస్తున్నారు. కౌలు రైతులను ఆదుకునే విధంగా చట్టాలను రూపొందిస్తామనే భరోసా ఇస్తున్నారు.
కులాల ఐక్యతే జనసేన లక్ష్యం
జనవాణి పేరుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమంలోనూ ఆయన ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత గురించి ప్రస్తావిస్తున్నారు. కులాల గురించి తాను మాట్లాడుతున్నది చిచ్చు పెట్టడానికి క్కాదు. ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారానికి వస్తామని ఢంకా బజాయించి చెబుతున్నారు. నిమ్న వర్గాలను ముందుకు కదిలించే బాధ్యతను జనసేన తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నారు.
అగ్రవర్ణాల్లో అభ్యుదయ భావాలున్న వాళ్లకు జనసేన స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి సారధ్యంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీని ఓ సామాజిక విప్లవానికి సంకేతంగా ప్రజలు భావించారు. నేడు జనసేన కూడా అలాంటి మార్పును కోరుకుంటుందని పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు.
ఇదే లక్ష్యంతో సాగితే వైసీపీ, టీడీపీల్లోని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలు ఖాళీ
ఇదే ఒరవడితో కొనసాగితే రానున్న ఎన్నికల నాటికి వైసీపీ, టీడీపీలోని ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ విభాగాలు ఖాళీ కావొచ్చు. జనసేనలో ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ విభాగాలు లేవు. ఇక్కడ అంతా జన సైనికులే. పార్టీ పదవులున్నా లేకున్నా సమానమే. అందుకే జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలను ఏకతాటిపై నడిపించాలనే లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది.
ఇప్పటిదాకా పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా, నియోజకవర్గ, పట్టణ, నగర, మండల స్థాయిలో కమిటీలు వేశారు. సామాజికవర్గాల వారీ విభాగాలు ఏర్పాటు చేయలేదు. పవన్ సామాజిక ఐక్యతను కోరుకుంటున్నందునే ఇలాంటి విభాగాలు ఏర్పాటు చేయలేదని జనసేన పార్టీ కార్యకర్త ఒకరు పేర్కొన్నారు.