“అరె తింగరి వెధవా.. నెత్తి మీద ఆ బొచ్చేందీ ! అంత పొడుగు గెడ్డమేందీ ! ” అని మావాడ్ని చివాట్లు పెట్టా. అది లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పుకొచ్చాడు. ఇది కేవలం మగాళ్లకే కాదు. ఆడోళ్లు ఒకప్పుడు శుభ్రంగా జడ వేసుకునేది. అర్బన్ ప్రాంతాల్లో చదువుకున్న మహిళలు ఉద్యోగాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పోనీ టెయిల్ వచ్చేసింది. పూర్వం మహిళలు వెంట్రుకలు విరబోసుకునేది. అది నేడు ఫ్యాషన్ అయింది. జడ పోయింది. పోనీ టైల్ కూడా కనుమరుగవుతోంది. వీటన్నింటినీ కొంచెం లోతుగా పరిశీలిస్తే.. మనువాద స్టైల్ వైపు ప్రజలను మళ్లించే ఓ కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఒకప్పుడు బాగా చదువుకొని శాస్త్ర వేత్తలుగా ఎదిగిన వాళ్లకు క్షవరం చేయించుకునే తీరిక ఉండేది కాదు. ప్రయోగ శాలల్లో రోజుల తరబడి గడిపేది. దీంతో నెత్తిపై గంపలా వెంట్రుకలు పెరిగేవి. గడ్డం మూరెడు పొడవున కిందకు దిగేది. అయినా వాళ్లను చూస్తే చేతులెత్తి దణ్ణం పెట్టించుకునేంతగా తేజోమయంగా కనిపించేది. ఇప్పుడు మొదలెటో.. చివరెటో తెలియని సన్నాసులంతా అలాంటి గౌరవ మర్యాదలు పొందేందుకు నెత్తిమీద బొచ్చు.. గెడ్డం పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
క్రమశిక్షణతో జీవించే వాళ్లంతా రోజూనో.. రెండ్రోజులకోసారో.. అదీ కుదరకుంటే వారానికోసారి గెడ్డం చేసుకుంటారు. వీలుకాకుంటే బార్బర్ షాపుకు వెళ్లి చేయించుకునేది. కనీసం నెలకోసారో.. రెండు సార్లో క్షవరం చేయించుకునేది. దీనికి భిన్నంగా నేడు తాము మేథావులం.. గొప్పవాళ్లమనే కలరింగ్ కోసం వెంట్రుకలు పెంచుకునే పిచ్చి ఎక్కువైంది.
ఈ తిక్క ఒక్కసారిగా వచ్చింది కాదు. బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లు, క్రికెట్ స్టార్లు వ్యాప్తి చేశారు. ఒకప్పుడు మునులు, రుషులకు ఉన్నట్లు తల, గెడ్డం పెంచుకుంటే తాము కూడా వాళ్లంత గొప్పవాళ్లమనే భావనను చొప్పిస్తున్నారు.
అలాగే పుక్కిట పురాణాల్లో చెప్పినట్లు సీత, సావిత్రి, అనసూయలాంటి మహిళలు కురులను విరబోసుకునేది. దాన్ని ఇప్పటి తరానికి ఫ్యాషన్‌గా మలచడం వెనుక మనువాద సంస్కృతిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకేనని స్పష్టమవుతోంది. నేడు అదే ఫ్యాషన్‌గా ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. జనాన్ని రాతి యుగం నాటి ఆహార్యానికి దగ్గర చేయడం వెనుక మనువాదాన్ని మళ్లీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకేనని తెలుస్తోంది.
ఎక్కడైనా ప్రజలను తమ వైపు తిప్పుకోవాలంటే ముందుగా వాళ్ల సంస్కృతిని చంపెయ్యాలి. అప్పుడు వాళ్లు ఏ దుస్తులు ధరించాలి.. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి. ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఏం తినాలి.. ఇలా ఒకటేంటీ ! మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే దాకా ఎలా జీవించాలని శాసిస్తోంది కార్పొరేట్ ప్రపంచం. ప్రజలు పూర్తిగా కార్పొరేట్ కంపెనీల వినియోగదారులుగా మారిపోయారు.
అలాంటి కార్పొరేట్ శక్తులు నేడు మనువాదాన్ని ట్రెండింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాతిశిలా యుగం నాటి హావభావాలను చొప్పిస్తోంది. జనంలో సైంటిఫిక్ టెంపర్‌ను చిదిమేసి ఇలాంటి కాల్పనిక పురాణాల్లోకి లాక్కెళుతున్నట్లుంది. దీనికి ప్రజా చైతన్యమే అడ్డుకట్ట వేయాలి.