కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై అనేక విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఊహాగానాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి ఇదంతా బీజేపీ ఎత్తుగడలో భాగమే. తమకు అన్ని విధాలా సహకరించే మిత్రులున్న చోట కూడా బీజేపీ బలపడాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయనే సర్వేలు వస్తున్నాయి. దీనికి తోడు బీహార్ పరిణామాలతో బీజేపీ సొంతంగా బలోపేతం కావడానికి పావులు కదుపుతోంది. అందులో భాగంగానే సినిమా స్టార్లకు వల విసురుతోంది. వాళ్ల ఇమేజ్ను వాడుకొని బలపడాలని భావిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జూనియర్‌తో అమిత్‌షా మంతనాలు జరిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకవేళ వచ్చినా బీజేపీలో చేరకపోవచ్చని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీలోకి మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబమంతా పట్టుబడితే టీడీపీలో ప్రధాన పాత్ర పోషించడానికి ఆమోదించవచ్చు.
ప్రస్తుతానికి ఫాంలో ఉన్నట్లు కనిపిస్తున్న వైసీపీ నుంచి బీజేపీకి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. టీడీపీ కూడా బీజేపీని వ్యతిరేకించడం లేదు. పవన్ కల్యాణ్ ఈపాటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయినా ఏపీలో బీజేపీ బలపడాలనే ఎత్తుగడతో పావులు కదుపుతోంది.
ఇటీవల పవన్ కల్యాణ్ తిరుపతిలో మాట్లాడుతూ జనసేన పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్నికలకు పోతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేయడమే జనసేన వూహ్యమని తెలిపారు.
పవన్ వ్యాఖ్యలను బట్టి రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలవడానికి బీజేపీ అంగీకరించకుంటే కటీఫ్ చెప్పే అవకాశాలున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలోనూ పవన్ మాటను కేంద్రం పట్టించుకోలేదు. విశాఖ ఉక్కు అమ్మకాన్ని పవన్ వ్యతిరేకిస్తూ ఆందోళనకూ దిగారు. ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పవన్ పోటీ చేయబోమని ప్రకటిస్తే.. బీజేపీ పోటీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేన కార్యకర్తలు కలిసి పని చేసిన దాఖలాల్లేవు.
కేవలం పొత్తు ఉందని రెండు పార్టీలు చెప్పుకోవడమే తప్ప కింది నుంచి పైదాకా ఉమ్మడిగా పనిచేసినట్లు కనిపించదు. పవన్‌ను రెండు పార్టీల సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేసీ ససేమిరా అని చెప్పేసింది. వీటన్నింటి దృష్ట్యా బీజేపీ, జనసేన సఖ్యత ఎన్నాళ్లుంటుందో చెప్పలేం. వరుస పరిణామాలను పరిశీలిస్తే.. పవన్ లేకుంటే మాకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు అమిత్ షాతో భేటీ ఉద్దేశమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడేదాకా ఈ దాగుడు మూతల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి.