దర్శి మాజీ ఎమ్మెల్యే దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కనిపించలేదు. స్వయంగా సీఎం జగన్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాత్రం తన నియోజవర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో నిమగ్నమయ్యారు. కావాలనే ఆయన్ని దూరంగా పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇది జిల్లా వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల పార్టీ జిల్లా ప్లీనరీలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నిర్మొహమాటంగా మాట్లాడారు. “సీఎం జగన్ బటన్ నొక్కితే ఆయనకు పేరొస్తుంది. మరి ఎమ్మెల్యేల పరిస్థితేంటీ ! ఎమ్మెల్యేలు డ్రెయినేజీ, సిమెంటు రోడ్లన్నా వేస్తే అంతోఇంతో పేరొస్తుంది. ఇప్పటిదాకా చేసిన పనులకు ఒక్క బిల్లు చెల్లించలేదు. కార్యకర్తలు అప్పులపాలైపోయారు. కనీసం మొహం చూపించలేక గడప గడపకూ రాలేకపోతున్నారు. తక్షణమే జిల్లా నాయకత్వం స్పందించి బిల్లులు ఇప్పించాలి !” అంటూ మద్ది శెట్టి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
అంతకముందే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో మద్దిశెట్టికి సత్సంబంధాల్లేవు. రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకానొక దశలో ఇరువర్గాలకు సీఎం జగన్ వద్దనే పంచాయితీ చేయాల్సి వస్తోంది. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల్లో దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకోవడం వెనుక వీళ్ల ముఠా కుమ్ములాటలే కారణమని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ కారణాలన్నింటి రీత్యా ఎమ్మెల్యే మద్దిశెట్టికి ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఎమ్మెల్యే మద్దిశెట్టి పార్టీ వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈపాటికే ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. జిల్లాకు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. వెలుగొండ మొదటి సొరంగం పనులు 90 శాతం పూర్తయినా నీళ్లివ్వలేని దుస్థితి. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి నీళ్లిచ్చిన తర్వాతనే తాము ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు అధికారం చేపట్టిన ఏడాదిలోపు ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తామన్న హామీ నెరవేరలేదు.
చీమకుర్తి ప్రాంతంలో మైనింగ్ యూనివర్శిటీ పెడతామన్న హామీ గడప దాటలేదు. పామూరు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాతీయ వస్తూత్పత్తి మండలి (నిమ్జ్) ఊసెత్తడం లేదు. రామాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకు పోవడంతో ప్రకాశం జిల్లా ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి కూడా దూరమైతే పార్టీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.