ఏ ప్రజల కోసం పనిచేస్తామో.. ఆ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం సుసంపన్నమవుతుంది. అలాంటి పార్టీని ప్రజలు సొంతం చేసుకోగలుగుతారు. ఈ తరహా ఆలోచనలకు పురుడుపోసిన ఆప్ ఢిల్లీలో హేమాహేమీలను మట్టికరిపించింది. నేటికీ తిరుగులేదని భావిస్తున్న కాషాయ నేతల వెన్నులో చలి పుట్టిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ముందుకెళ్లాలని జనసేన భావిస్తుందా ? పవన్ అడుగులు ఒక్కొక్కటీ ఆ దిశగానే పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా జనసేన అభిమానులు, కార్యకర్తలతోపాటు ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు పవన్ పుట్టిన రోజును వేదికగా మలిచారు.
పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగులకు బదులు రక్తదానం చేయమంటున్నారు. వేడుకలకు పెట్టే ఖర్చును పార్టీకి విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘నా సేన కోసం నావంతు’ నినాదంతో జన సైనికులు పార్టీకి విరాళం ఇవ్వడం ద్వారా మరింతగా ఓన్ చేసుకునే అవకాశముంది.
దీన్ని విజయవంతం చేస్తే తదుపరి జనం వద్దకు వెళ్లాలని భావిస్తున్నట్లున్నారు. జనసేన పార్టీతో ప్రజలను మమేకం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. మరింత మంది జన సైనికులు తయారయ్యేందుకు అవకాశముంటుంది.
ఈపాటికే జనసేన పార్టీలో ఎస్సీఎస్టీ బీసీ, మైనార్టీ సెల్స్ అనేవి ఉండవని స్పష్టతనిచ్చారు. శక్తి సామర్థ్యాలు, అంకిత భావంతో కూడిన సేవను బట్టి వాళ్లు పార్టీలో ఎదిగేందుకు అవకాశముందనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు, కార్మికులు, వీర మహిళలు, విద్యార్థుల విభాగాలు మాత్రమే ఏర్పాటు చేశారు.
పార్టీ నిర్మాణంలో ఇంకా యువత పాత్రను మరింతగా పెంచేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. పార్టీలో అందరూ సమానమనే సంకేతాలిచ్చే విధంగా పార్టీ నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆప్ తరహాలో ఏపీలో జనసేన ప్రయోగం విజయం సాధిస్తే రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయమవుతుంది. కాకుంటే ఇక్కడ జనసేనకు ఏ విధంగానూ ప్రయోజనం లేని బీజేపీతోనే తంటాలున్నాయి. విశాఖ ఉక్కు అమ్మకం విషయంలో జనసేన మాటకు విలువనివ్వలేదు. పోలవరంపై కేంద్రం కప్పదాట్లు మరింత ఇరుకున పెడతాయి.
ఈ రెండింటితోపాటు రాష్ట్ర విభజన హామీల గురించి పవన్ సూచనలను కేంద్రం ఆమోదిస్తుందన్న విశ్వాసమూ లేదు. ఒకవేళ కాషాయపార్టీని వదిలించుకున్నా సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ లాంటి వాటితో కమలనాధులు పవన్ను పీకేదేమీ లేదు.
ఏవిధంగా చూసినా జనసేన బలోపేతంలో బీజేపీ పాత్ర ఏమీ ఉండదు. పైగా వైసీపీకి మేలు చేసేందుకు జనసేనను సంకలో ఇరికించుకోవాలనే దుగ్ద మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల కింది స్థాయిలో శ్రేణులు కలిసి పనిచేసిన దాఖలాల్లేవు. బీజేపీని వదిలించుకుంటేనే జనసేన ఆప్ తరహాలో ప్రయోగం చేయడానికి వీలవుతుంది.
ఈపాటికే బీజేపీ అగ్రనేతలు పవన్ను దూరం పెట్టి టాలీవుడ్ నటులకు గాలం వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏవిధంగా పీల్చిపిప్పి చేస్తున్నాయో ఎలుగెత్తి చాటే బాధ్యతను పవన్ తీసుకోవాలి. అప్పుడు కచ్చితంగా జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల చేతుల్లో ఆయుధమవుతుంది.
App కి జనసేనకి పోలిక ఎక్కడుందన్నా, ఆప్ బీజేపీ చేసే ప్రతి చెడ్డపనిని ఎండగడుతుంది. జనసేన ఒక వ్యక్తి మీద లేక ఒక పార్టీమీద పడి ఏడుస్తుంది. జనసేన ఒకప్పుడు ప్రజలకోసం పనిచేసే పార్టీ అయివుండవచ్చు. ఇప్పుడు ప్రతీకారం కోసమే పనిచేస్తుంది.