ప్రతిపక్ష టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్లను వైసీపీ అడ్డుకుంటోంది. మొన్న మంగళగిరిలో. ఇప్పుడు కుప్పంలో. ఎవరైనా అత్యంత తక్కువ ధరకు అన్నం పెడుతుంటే ప్రోత్సహించాలి. అందులో రాజకీయ ప్రయోజనం ఉందని భావిస్తే పోటీ పడాలి. టీడీపీ అన్నా క్యాంటీన్ పెడితే వైసీపీ రాజన్న క్యాంటీన్ పెట్టొచ్చు. వాళ్లు 5 రూపాయలకు పెడితే మీరు రెండు రూపాయలకు పెట్టండి. ఇది వదిలేసి రచ్చ చేస్తే ప్రజలు ఛీ కొట్టేది అధికార పార్టీనే. ఈ సంగతి ఎలా విస్మరించారు ?
అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున జనసైనికుడు పవన్ కల్యాణ్ అందిస్తున్నారు. ప్రభుత్వం కొద్ది మందికే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందించింది. ఎక్కువ మంది బాధితులకు రకరకాల కొర్రీలు వేసి ఎగనామం పెట్టింది. దాదాపు 3 వేల మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ప్రభుత్వ సాయం అందింది కేవలం 700 మందికే. ఈ వాస్తవాన్ని గుర్తించిన పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీన్ని సహించలేక ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం సినీ నటుడు సోనూసూద్ ఓ పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. అప్పుడు కూడా ఇంతే. సోనూసూద్ ఎవరు కొనివ్వడానికంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వస్తుందని వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా.. దారుణాలు చోటుచేసుకున్నా ప్రతిపక్షాలు వెళ్తాయి. బాధితులకు అండగా నిలుస్తాయి.
దీనికి భిన్నంగా ప్రతిపక్షాలను నిర్బంధించడం మరీ దారుణం. ఎక్కడైనా సీఎం వస్తున్నారంటే వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నాయకులు వస్తారు. అర్జీలు సమర్పిస్తారు. ఇప్పుడు సీఎం జగన్ ఎక్కడ పర్యటిస్తున్నా ముందుగా ప్రజా సంఘాలు, విపక్షాల నేతలను ఇళ్లలో నిర్బంధించడం విడ్డూరంగా ఉంది.
ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. ప్రజలకు పెట్టినా.. తిట్టినా మేమే అయి ఉండాలి. మరొకరు ఉండకూడదనే దుర్మార్గపు ఆలోచనలు పొడచూపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఓటమి భయమో లేక అధికారంతో కూడిన అహంభావమో అర్థం కావడం లేదు. ఇలాంటి నియంతృత్వ పోకడలు వైసీపీని పాతాళానికి నెట్టేస్తాయి. ఇవన్నీ సీఎం జగన్ ప్రోద్భలంతోనే చోటుచేసుకుంటున్నాయా లేక కార్యకర్తలు, పోలీసులు స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి చేస్తున్నారా అనేది వైసీపీ అధిష్టానం సమీక్షించుకోవాలి.