‘‘పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల మూలిగలు పీల్చేస్తున్నారు. ఇవిగాక నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు బాదేసి నిలువునా దోచేస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దేశ వ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. అలాంటి బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి వైసీపీనే అంగీకరించలేదు. వాళ్ల అవసరాల కోసం కేంద్రంతో లాలూచీ పడొచ్చుగాక. కమలనాధులతో ఎన్నికల పొత్తు అంటే ఎలా ఉంటుందో అన్ని ప్రాంతీయ పార్టీలకు తెలిసొచ్చింది. అయినా ఇప్పుడు టీడీపీకి బీజేపీ పొత్తు వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ” అంటూ టీడీపీ సానుభూతిపరుడు ఒకరు పెదవి విరిచారు.
బీజేపీతో టీడీపీ చెలిమికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయంటూ నిన్నంతా సామాజిక మాధ్యమాల్లో హోరెత్తింది. పక్షం రోజుల కిందట నారా లోకేష్ అమిత్‌షాను కలిశారని ఒకట్రెండు ఇంగ్లిష్ పత్రికల్లో కథనాలు వచ్చినట్లు పోస్టింగులు పెట్టారు. ఢిల్లీకి చెందిన కొందరు జర్నలిస్టులు ఈ వార్తా కథనాలు రాసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోడీని చంద్రబాబు కలిసి మాట్లాడారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీకి బీజేపీ స్నేహహస్తం చాస్తున్నట్లు పుంఖానుపుంఖాలుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.
రానున్న ఎన్నికల నాటికి ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరినా ఆ పార్టీకి ఉన్న ఒక్క శాతం ఓట్లతో టీడీపీకి ఒరిగేదేమీ లేదు. ముస్లిం మైనార్టీలు దూరమవడం వల్ల కలిగే నష్టాన్ని బీజేపీ ఓటింగ్ పూడ్చలేదు. జనసేన ఓటింగ్ మాత్రమే టీడీపీకి ప్లస్ అవుతుంది. ప్రస్తుతం జనసేన బీజేపీ సంబంధాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్నాయి.
బీజేపీ వైపు నుంచి పొత్తుల ప్రయత్నం ఫలించేనా !
పవన్ కల్యాణ్‌ను పక్కన పెట్టి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారు. బీజేపీ చీఫ్ నడ్డా నితిన్ తో మాట్లాడారు. ఇక ప్రధాని మోడీ భీమవరం సభకు మెగాస్టార్‌ను ఆహ్వానించారు. ఇవన్నీ గమనించిన పవన్ జనసేన సొంతంగా బలపడే కార్యక్రమాలతో అక్టోబరు 5 నుంచి జనంలోకి దూసుకెళ్లే యోచనలో ఉన్నారు. వీళ్ల సంబంధాలు ఇలా ఉంటే టీడీపీ పొత్తు కోసం బీజేపీ వైపు నుంచి ప్రయత్నించడం ఏమేరకు ప్రయోజనమో ఆ పార్టీకే తెలియాలి.
కేంద్రం భారాలతో గాయపరుస్తుంటే.. రాష్ట్ర సర్కారు మందు రాస్తోంది
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బాగా తెలుసు. ముస్లిం మైనార్టీలు, ఎస్సీలు దూరమయ్యే ప్రమాదం ఉంటుందని ఎప్పుడో గ్రహించారు. అందుకే తోలు కత్తులతో వైసీపీ, బీజేపీ నేతలు యుద్దం చేస్తుంటారు. కేంద్రం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు పెంచి జనాన్ని గాయపరుస్తోంది. కేంద్రం పెంచితే మాకేం సంబంధమంటూనే బటన్ నొక్కుడుతో రాష్ట్ర ప్రభుత్వం ఆ గాయాలకు ఆయింట్మెంటు రాస్తుంది. ఇలా టచ్ మీ నాట్లాగా వైసీపీ వ్యవహరిస్తూ పనులు చక్కబెట్టుకుంటోంది.
ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా పులి నోట్లో తల పెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయినా కేంద్ర విధానాలను తూచా తప్పకుండా అమలు చేస్తోన్న జగన్ సర్కారు ఉండగా బీజేపీకి కొత్త స్నేహితుడు అవసరం లేదు. వైసీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించినప్పుడు టీడీపీకి స్నేహ హస్తం అందించవచ్చు. అందుకే కమలనాధులు ఒకర్ని కౌగలించుకొని మరొకరికి కన్నుగీటుతుంటారు. అంతిమంగా బీజేపీకి ఏది ప్రయోజనమనుకుంటే అటువైపు మొగ్గు చూపుతుంది. అప్పటిదాకా టీడీపీ ఎంత అర్రులు చాచినా ప్రయోజనం లేదు.