బీజేపీ.. జనసేనతో కలిసి టీడీపీ 2024 ఎన్నికలను గెలవడం అంత ఈజీ కాదు. 2014 ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గడచిన మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగటు ప్రజల మూలిగలు పీల్చేశాయి. అనేక విభజన హామీలను తుంగలో తొక్కేశాయి. మరెన్నో సమస్యలను ప్రజల తలకు చుట్టాయి. వీటికి సమాధానం చెప్పగలిగే స్థితిలో అధికారంలో కొనసాగుతున్న పార్టీల్లేవు. అందుకే ఎన్టీయే భాగస్వామ్యంలోని ప్రాంతీయ పార్టీలు కటీఫ్ చెప్పి పక్కకు వైదొలిగాయి. నిన్నమొన్న మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో గద్దెనెక్కిన షిండేకు సైతం కమలనాధులతో పొసగడం లేదు. ఇన్ని తెలిసీ బీజేపీతో కలవాలనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమే.
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించడానికి సగం కారణాలు కేంద్ర విధి విధానాలను అమలు చేయడం వల్లేనని స్పష్టమవుతోంది. కేంద్ర విద్యుత్ సంస్కరణలను తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్దమైంది. అందులో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తోంది. క్రాస్ సబ్సిడీలు ఎత్తివేసి కాస్ట్ టు సర్వ్ పద్దతిలో విద్యుత్ పంపిణీలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశమివ్వాలని సంస్కరణలు నిర్దేశిస్తున్నాయి.
వినాశకర కేంద్ర విద్యుత్ సంస్కరణల భారాన్ని ప్రజలనెత్తికెత్తి ఓట్లు ఎలా అడుగుతారు ?
ఇదే జరిగితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని భరించాలి. కరెంటు చార్జీలను ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారీతిన నిర్ణయిస్తాయి. పారిశ్రామిక వినియోగదారులు భరిస్తారు. మరి సగటు వినియోగదారుల పరిస్థితేంటీ ! ఇప్పటిదాకా పారిశ్రామిక వినియోగదారులపై కొంచెం ధరలు పెంచగా వచ్చిన దాంతో గృహ వినియోగదారులకు తగ్గిస్తోంది. ఈ క్రాస్ సబ్సిడీలు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ భారమంతా భరించగలదా ! దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెప్పి ఓట్లు అడుగుతారు ?
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పరిమితిని మించి అప్పులకు అనుమతి కోరితే కేంద్రం అర్బన్ సంస్కరణలను అమలు చేసే షరతు పెట్టింది. అందులో భాగంగానే ఆస్తి పన్ను పెరిగింది. యూజర్ చార్జీలు బాదేస్తున్నారు. చెత్తపై పన్ను వేస్తున్నారు. ఇంకా అనేక రకాల పన్నులు, సెస్‌లను విధిస్తున్నారు. వీటిపై ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు ! ఓట్లు ఎలా వేస్తారు !
సీపీఎస్ రద్దు చేయకపోవడానికి కేంద్రం షరతులే కారణం కాదా !
అంతెందుకు ! ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేయకపోవడానికి కేంద్రం విధించిన షరతులు కారణం కాదా ! ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పకనే చెప్పేశారు. అలాంటి కేంద్ర సర్కారులోని బీజేపీతో కలిసి ఉద్యోగుల ఓట్లు అడగగలరా ! ఒక్క ఉద్యోగి ఓటు పొందగలరా !
నిత్యావసరాలపై జీఎస్టీ బాదుడు ఎవరి పాపం !
సగటు ప్రజలు వినియోగించే పాలు, పెరుగు, బియ్యంపై కూడా జీఎస్టీ పన్నులను కేంద్రం బాదేస్తోంది. అసలే పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి కూడా క్షీణించింది. కేవలం నిత్యావసరాల కొనుగోలుకే పరిమితమయ్యారు. ఇలాంటి దుస్థితిలో కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి ! వీటన్నింటికీ కారణం కేంద్ర ప్రభుత్వం కాదా ! బీజేపీతో కలిసి వెళ్లి ఓట్లు అడిగే దమ్ముందా !
విశాఖ ఉక్కును అమ్మేసే పార్టీతో కలిసి ఓట్లు అడిగే దమ్ముందా !
విశాఖ స్టీల్ అమ్మకంపై ఉత్తరాంధ్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీయలేని ప్రధాన పక్షాలను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించలేని పార్టీలు అక్కడ ప్రజల నుంచి ఎలా ఓట్లు వేయించుకోగలరా? బీజేపీతో పొత్తు పెట్టుకొని విశాఖ ప్రాంతం నుంచి ఒక్క ఓటు పొందగలరా !
పోలవరానికి కొర్రీలు వేస్తున్న కేంద్ర సర్కారులోని పార్టీతో గోదావరి ప్రజల మద్దతు పొందగలరా !
పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం 95 శాతం పెండింగులో ఉంది. ఇందుకోసం సుమారు రూ.30 వేల కోట్లు కావాలి. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే నిధులు ఇవ్వాలి. ఇప్పటికీ ప్రాజెక్టు అంచనాలపై కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఈ సంగతి గోదావరి పరివాహక ప్రజలందరికీ తెలుసు. అయినా ఏ ధైర్యంతో గోదావరి జిల్లాల ప్రజల ఓట్లు అడుగుతారు ?
రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు దగాపై బీజేపీతో కలిసి సమాధానం చెబుతారా !
విభజన చట్టంలోని అంశాల ప్రకారం రామాయపట్నం మేజర్ పోర్టును కేంద్రం నిర్మించాలి. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ తాబేదారు సంస్థతో కలిసి మైనర్ పోర్టు నిర్మాణానికి పూనుకుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీని కూడా కేంద్రమే నెలకొల్పాలి. ఇక్కడ కూడా రాష్ట్ర సర్కారు ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించడానికి సిద్ధమైంది.
కేంద్ర నిధులతో భారీ ప్రాజెక్టులుగా వీటిని చేపట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కుదించింది ? కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు ! ఇది ఈ ప్రాంత ప్రజలను ద్రోహం చేయడం కాదా ! ఏ మొహం పెట్టుకొని వాళ్లను ఓట్లు వేయమని అడుగుతారు !
అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలనేవి ఏవీ ప్రభావితం చూపకపోవచ్చు. సగటు ప్రజల కష్టాల కన్నీళ్లు ముందు ఏ భావోద్వేగాలు పనిచేయకపోవచ్చు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కొన్ని పార్టీలు నామరూపాల్లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏ పార్టీ అయినా ఆచితూచి అడుగేయకుంటే కోలుకోలేని దెబ్బ పడడం ఖాయం.