జాతీయ స్థాయిలో చంద్రబాబు కు అండగా నిలిచే బీజేపీ నేత నితిన్ గడ్కరిని మోడీషా ద్వయం తప్పించింది. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను దువ్వారు. ఆంధ్రాలో రామోజీ చిట్ ఫండ్ కేసును సీఎం జగన్తో రీఓపెన్ చేయించారు. అదే సమయంలో అమిత్ షా రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇవన్నీ దేనికి సంకేతాలు ? ఇవన్నీ చంద్రబాబు మీద ప్రేమతో మోడీ-షా ఏమీ చేయడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో నేరుగా పొత్తులు పెట్టుకోవడం కూడా పార్టీకి నష్టం చేస్తుందని బీజేపీ థింక్ ట్యాంక్ యోచిస్తోంది. పరోక్షంగా టీడీపీ శ్రేణులు బీజేపీకి మద్దతిచ్చేట్లు చేయడం కోసమే గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో అయోమయం సృష్టించడమే రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లతో అమిత్ షా మంతనాల్లోని మర్మం. తాము ఏం చేయగలము ఎలా చేయగలమో చెప్పీ చెప్పకనే చెప్పడమే అమిత్ షా ఉద్దేశం. గత కొద్దిరోజులుగా యావత్ మీడియాలోనూ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ జరుగుతున్న చర్చలు, వెల్లువెత్తుతున్న భిన్నాభిప్రాయాలే అమిత్ షా మంత్రాంగం ఎంత బ్రహ్మాండంగా వర్కవుట్ అయిందో తెలియజేస్తున్నాయి.
టీడీపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించి తెలంగాణాలో తమవైపు తిప్పుకోవాలనా ?
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి కేవలం 25-30 నియోజకవర్గాలకు మించి గెలిచే బలంగాని, బలగం గానీ లేవు. ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొంత అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంది. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఆ స్థానాన్ని కొద్ది నెలల్లో బీజేపీకి కోల్పోవడం అనివార్యంగా కనిపిస్తోంది.
మోడీ- అమిత్ షా తెరమీద కనిపించే బీజేపీ మార్గదర్శకులైతే తెర వెనుక మరో ముగ్గురు వ్యూహకర్తలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై గత మూడు మాసాలుగా దృష్టి సారించారు. వారి ముగ్గురి మాటలే అమిత్ షాకు అసలు సిసలు గీటురాళ్లు. వారి వ్యూహాలను కాదని అమిత్ షా ముందుకెళ్లే పరిస్థితి లేదు.
ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతోనే కొన్ని అనూహ్య పరిణామాలు అతనికి అనుకూలంగా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొద్దిపాటి జరిమానాలతో తనను కేసుల నుంచి బయటపడేయాలని బీజేపీ అధినాయకత్వానికి పదేపదే మొరపెట్టుకుంటున్నారు. ఆయన కేసుల నుంచి పూర్తిగా బయటపడితే తమ చేయి దాటి పోతాడని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
తెర వెనుక మంత్రాంగం నడపడంలో వైసీపీ టీడీపీని మించిపోయింది
చంద్రబాబు నాయుడుతో పోలిస్తే తెరవెనుక వ్యవహారాల్లో సీఎం జగన్ బృందం రాటు తేలిపోయింది. కొద్ది రోజులు వెనక్కి వెళితే ఢిల్లీలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచే అతికొద్ది బీజేపీ నాయకుల్లో అగ్రగణ్యుడైన నితిన్ గడ్గరీని మోడీ పార్లమెంటరీ పార్టీ బోర్డు, అభ్యర్థుల ఎంపిక కమిటీల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అది ఆర్ఎస్ఎస్ ప్రస్తుత నేత పూర్తి ఆమోదంతోనే చేశారంటే మోడీ- అమిత్ షా రాజకీయాలు ఎంతగా పదును తేలాయో గమనించవచ్చు. అలాంటి ద్వయం చంద్రబాబు నాయుడును నెత్తిన పెట్టుకుంటారని భావించడం భ్రమే అవుతుంది.
ఉత్తరాదిలో నష్టాన్ని తెలుగు రాష్ట్రాల ద్వారా పూడ్చుకోవాలని..
బీజేపీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన మిత్రపక్షం ఒక్కటీ లేకుండా పోయింది. దాన్ని గుర్తించిన మీదటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన పడే గండిని పూడ్చుకోవాలంటే దక్షిణాదిలో తాము సొంతంగా కొన్ని లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీలో 5 నుంచి 8 లోక్ సభ స్థానాలు, తెలంగాణలో 8 నుంచి 10 లోక్ సభ స్థానాలపై గురి పెట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టినా తమ కోరిక నెరవేరే పరిస్థితి లేదని.. జగన్ పార్టీతో పొత్తు సాధ్యం కాదని బీజేపీ నేతలకు బాగా తెలుసు. తెలంగాణలో స్థిరపడిన లేదా వలస వచ్చిన ఆంధ్రులు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయరనే భయంతో యసెటిలర్లను పలు విధాలుగా దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే బీజేపీ నాయకుల పర్యటనలు, ర్యాలీలు, ఆలయాల సందర్శనలు, నటీనటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులతో సమావేశాలను మీడియాలో హైలైట్ అయ్యేలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది.
ప్రత్యర్థులను అయోమయంలో పడేయడానికే బీజేపీ చర్యలు
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాల ముందు బీజేపీ తెరవెనుక నడిపించే రాజకీయ ఎత్తుగడల ఆనవాళ్ల ఫలితాలు ప్రత్యర్థులకు చాలా ఆలస్యంగా గాని అర్థం కావు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న కార్పెట్ బాంబింగ్ రాజకీయం ఇప్పుడిప్పుడే కేసీఆర్ కు పూర్తిగా అర్థమవుతోంది.
ఓవైపు తెలుగుదేశం పార్టీని, మరోవైపు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేసినందుకు ప్రస్తుతం కేసీఆర్ చింతిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఉపయుక్తంగా ఉంటుందంటే తప్ప అటు పొత్తులు కానీ, ఇటు అవగాహనతో కానీ ముందుకు పోయే అవకాశాల్లేవు. ప్రస్తుతం నలుగుతున్న రాజకీయమంతా ప్రత్యర్థులను అయోమయానికి గురి చేయడం మాత్రమే. అంతకుమించి మరేమీ లేదు.
తెలుగుదేశం శ్రేణులు బీజేపీ స్నేహ హస్తంపై ఆశలు పెంచుకోవాల్సిన అవసరం లేనేలేదు. అవసరం తీరిన తర్వాత అందరిని తొక్కేయడమే బీజేపీ నైజం. కమలనాధుల దృష్టి అంతా ప్రస్తుతం తెలంగాణపై కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో బీజేపీ నిర్ణయిస్తుంది. అప్పటిదాకా తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బీజేపీ వ్యవహారాలను అతిగా ఊహించుకోవడం అనవసరం.
– దాసరి ఆంజనేయులు