వైసీపీ సోషల్ మీడియా బృందాలను చూస్తే అయ్యో పాపమనిపిస్తోంది. వాళ్లపై పార్టీ గురుతర బాధ్యతలను మోపింది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయనే ప్రచారం చేయాలని నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో వివిధ పథకాల లబ్దిదారులు ఎవరు ? వాళ్లు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారా ! అసలు వాస్తవంగా అర్హులకు పథకాలు అందుతున్నాయా అనే అంశాలు ప్రభుత్వ భావనకు విరుద్దంగా ఉన్నాయి. దీన్నిబట్టి వైసీపీ సోషల్ మీడియా బృందాల ప్రచార ప్రభావం ప్రజల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉదాహరణకు కొన్ని పథకాలు.. వాటి లబ్దిదారుల మనోగతాలను పరిశీలిస్తే..
రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల నష్ట పరిహారం చెల్లింపులన్నీ భూయజమానులకే చెందుతున్నాయి. వాస్తవంగా పంటలు సాగు చేస్తోంది 75 శాతం కౌలు రైతులే. మొత్తం కౌలు రైతుల్లో సెంటు భూమిలేని ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలే 80 శాతం ఉంటారు. ఈ పథకాలేవీ వీళ్లలో ఒక్క శాతానికి మించి అందడం లేదు. ఈపాటికే ప్రభుత్వం గుర్తించిన కౌలు రైతుల్లో 90 శాతం బోగస్ పేర్లే ఈ క్రాప్‌లో నమోదవుతున్నాయి. ఏపీ కౌల్దారీ చట్టంలోని లొసుగుల వల్లే ఇలా జరుగుతోంది. వీటిని సవరించకుండా కౌలు రైతుల దగ్గరకెళ్లి రైతు భరోసా, ఇతర ప్రోత్సాహకాల గురించి చెబితే ఎలా రియాక్ట్ అవుతారు ?
వాహన మిత్ర సాయం అందుతోంది 20 శాతానికే !
వాహనమిత్ర పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున ఆటోవాలాలకు అందిస్తోంది. సొంత ఆటో ఉన్నవాళ్లకే ఈ పథకం వరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఆటో ఉన్నవాళ్లకే ఎక్కువగా వర్తిస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో 90 శాతం బాడుగ ఆటోతో జీవించే వాళ్లే ఎక్కువ. వీళ్లకు పథకం వర్తించదు. దీంతో నాలుగు ఆటోలు బాడుగకు ఇచ్చుకునే వాళ్లకే వాహన మిత్ర పథకం అందుతోంది.
మొత్తం ఆటో, క్యాబ్ డ్రైవర్లలో 20 శాతానికే పథకం అందుతున్నట్లు తెలుస్తోంది. పోనీ పథకం అందుకుంటున్నవాళ్లు ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇక పథకం అందని వాళ్లు ఎలా స్పందిస్తారో ఊహించొచ్చు.
లక్షల పెట్టుబడితో నడిపే సెలూన్ల యజమాన్లకే రూ. పదివేలు
అలాగే నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం ఏటా పదివేలు అందిస్తోంది. నెలకు పదివేలు అద్దె చెల్లిస్తూ లక్షల పెట్టుబడితో షాపులు పెట్టుకున్నవాళ్లకే పథకం వర్తిస్తోంది. ఆ షాపుల్లో పనిచేసేవాళ్లకు దక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మందికి పథకం వర్తిస్తోంది. ఆయా షాపుల్లో పనిచేస్తున్న సుమారు 60 వేల మంది పేద కార్మికులకు పథకం అందడం లేదు. అంతంత పెట్టుబడులతో సెలూన్లు నడిపేవాళ్లకు పదివేల నగదు లెక్కలోది కాదు. అదే షాపుల్లో పనిచేస్తున్నవాళ్లకు పథకం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ ఐదుగురి చేనేతల్లో ఒకరికే ‘నేతన్న నేస్తం’
నేతన్న నేస్తం పథకం కూడా అంతే. ప్రతీ ఐదుగురి చేనేత కార్మికుల్లో ఒకరికి మాత్రమే ప్రభుత్వం అందించే రూ.24 వేలు దక్కుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు కేవలం మాస్టర్ వీవర్లకే అనుకూలంగా ఉన్నాయి. రోజువారీ కూలీకి పనిచేసే వాళ్లు నేతన్న నేస్తానికి దూరమయ్యారు.
ఇంకా రజకుల పరిస్థితి కూడా అంతే. సొంతంగా నెలకు ఐదారు వేలు అద్దెలు చెల్లించి షాపు పెట్టుకున్నవాళ్లకే పదివేల నగదు అందుతోంది. ఇళ్ల దగ్గర లేదా తోపుడు బండిపై ఇస్త్రీ పెట్టె పెట్టుకొని జీవించే పేదలకు పథకం వర్తించడం లేదు. ఇంకా అనేక పథకాలకు సంబంధించి లబ్దిదారుల సంఖ్య తగ్గించడం కోసం కఠిన నిబంధనలు విధించడం వల్ల పథకాలను అందుకోలేకపోతున్నారు. వీళ్లంతా ప్రభుత్వంపై సంతృప్తిగా ఉంటారా ! ప్రభుత్వానికి అనుకూలంగా మలచడం అంత సులువుకాదు. ఏమైనా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సవాలే !