‘‘జనసేన పార్టీ నాయకులంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. పవన్ ఏదైనా పిలుపునిస్తే వెంటనే స్పందిస్తుంటారు. ధర్నా చేయమంటే చేస్తారు. రోడ్ల గుంతలు పూడ్చమంటే పూడుస్తారు. రక్తదానం చేయమంటే ఉరుకుతారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తారు. ఇప్పటికీ జన సేవకులుగానే ఉన్నారు. ఇది చాలదు. క్షేత్రస్థాయిలో వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం మేమే అన్నట్లు ఎదిగితేనే ప్రజలు విశ్వసిస్తారు. అప్పుడు మాత్రమే ప్రజాభిమానం ఓట్ల రూపంలో పొందగలుగుతారు. ” అంటూ రాజకీయాలను నిశితంగా గమనించే ఓ న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇప్పటిదాకా గ్రామాల్లో రెండు గ్రూపులుండేవి. ఒకటి వైసీపీ అయితే మరొకొటి టీడీపీ. మూడో గ్రూపు ఏర్పాటు కావాలంటే అంత తేలిక్కాదు. రెండు ప్రధాన సామాజిక వర్గాల వద్దనే భూమితోపాటు గ్రామీణ ఆస్తులు పోగుపడి ఉంటాయి. వాళ్లను కాదని మరో గ్రూపు కడతామంటే ఆదిలోనే అనేక అవాంతరాలు సృష్టిస్తారు. అడుగడుగునా అడ్డుకుంటారు. అనేక వైపుల నుంచి ఎదురుదాడికి దిగుతారు. వీటన్నింటినీ తట్టుకొని జనసేన నాయకులుగా నిలిస్తేనే ప్రజలు నమ్ముతారు. ఆదరిస్తారు. అప్పుడే ఓట్ల రూపంలో మద్దతునిస్తారు.
ఇలా జన సైనికులను తిరుగులేని నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమంపై పార్టీ అధి నాయకత్వం దృష్టిసారించినట్లు కనిపించడం లేదు. జనసేన జెండాలు కట్టడం.. నాయకులు వచ్చినప్పుడు పూలతో స్వాగత సత్కారాలకే ఎక్కువగా పరిమితమవుతున్నారు. లేదా పవన్ కల్యాణ్ ఏదైనా పిలుపునిస్తే స్పందిస్తున్నారు. బలమైన రెండు సామాజికవర్గాల నాయకత్వంతో నడుస్తున్న వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ నిలవాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి.
వివిధ సామాజిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించాలి. చొరవతో దూసుకెళ్లాలి. వాళ్లలో ధైర్యాన్ని నింపాలి. రాజ్యాధికారం లేకుంటే అంతరించిపోతామనే వాస్తవాన్ని గుర్తించేట్లు చేయాలి. బలీయమైన శక్తుల ఎదురుదాడిని తిప్పికొట్టగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అందుకు చిత్తశుద్దితో కృషి జరగాలి.
ఈ కార్యాచరణపై పార్టీ అధినాయకత్వం నుంచి నిరంతర మార్గదర్శనం ఉండాలి. ఇచ్చిన కర్తవ్యాలపై పర్యవేక్షణ కొనసాగాలి. తర్వాత ఆత్మ పరిశీలనతో ముందుకడుగేయాలి. ఈ విధమైన పని పద్దతులు అమలు చేస్తేనే క్షేత్ర స్థాయిలో జనసేన ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతుంది. ఇవేవీ చేయకుంటే ఈసారి కూడా గత ఎన్నికల చేదు ఫలితాలు పునరావృతం కావొచ్చు. ఈ లోపాన్ని సవరించుకొని జన సైనికులను రాజకీయనేతలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జన్మ దిన శుభాకాంక్షలతో..