ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికి వైసీపీ సర్కారు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్లు, కాలువలు, పారిశుద్యం, మంచినీటి సరఫరాలాంటి మౌలిక సదుపాయాల సమస్యను అధిగమిస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు వెచ్చిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు నేరుగా ప్రజలను కలుసుకొని సమస్యల పరిష్కారానికి పూనుకోవడం కొంతమేర సత్ఫలితాలను ఇస్తోంది. అదే సమయంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్, మద్యం, నిత్యావసరాల ధరలతోపాటు కరెంటు, రవాణా చార్జీల పెంపుతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతకు స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోంది.
గడచిన మూడు నెలల కాల వ్యవధిలో పీకే టీమ్ సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో 38, కోస్తాలో 26, ఉభయ గోదావరి జిల్లాల్లో 12, ఉత్తరాంధ్రలో 17 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు పీకే టీమ్ నివేదికను సమర్పించింది. గతంలో 60 మంది ఎమ్మెల్యేలు లేదా ఇన్చార్జులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం ద్వారా ఈ సంఖ్య 45కు తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. సీఎం జగన్ గ్రాఫ్ పెరిగినట్లు సర్వే రిపోర్టులో పీకే టీమ్ వెల్లడించింది.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకతంటే ప్రభుత్వంపై వ్యతిరేకత కాదా !
పీకే టీమ్ సర్వే ప్రకారం ఎమ్మెల్యేల ప్రజల వ్యతిరేకతకు కారణమేంటో స్పష్టం చేసినట్లు లేదు. సీఎం జగన్ తీరు వల్లే ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఆయన బటన్ నొక్కి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. మా దగ్గర అలాంటి బటన్లు లేనందున ప్రజలు మమ్మల్ని చులకనగా చూసే పరిస్థితి తలెత్తినట్లు కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానించారు.
కార్యకర్తలు చేసిన పనులకు మూడేళ్లవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎమ్మెల్యేలు దూరమయ్యారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగింది. చివరకు ఇది ముఠా కుమ్ములాటలకు దారితీసింది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేల వల్ల ఏ పనీ కాదనే భావన ప్రజల్లో నెలకొనడంతో ప్రజాప్రతినిధులు జనానికి మొహం చూపించలేకపోయారు.
ఇలాంటివన్నీ పరిష్కరించకుంటే ఎన్నికల్లో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఎన్నికల ముందు వరకు పార్టీని నమ్ముకొని ఆర్థికంగా చితికిపోయిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సమయం వచ్చినప్పుడు తడాఖా చూపిస్తామంటున్నారు. మమ్మల్ని చూసి అయినా ఇప్పుడు జెండాలు మోస్తున్న నాయకులు కళ్లు తెరవాలని సూచిస్తున్నారు.
మా దగ్గర గుంజుతున్నది ఎంత.. మాకిస్తున్నదెంత !
మరోవైపు పేద, మధ్య తరగతి ప్రజల్లో ధరల పెరుగుదల, స్వయం ఉపాధి లేమి వల్ల ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ది చేకూరిందో వివరిస్తున్నారు. దీంతో జనం చిర్రెత్తుకొచ్చి మా దగ్గర పన్నులు, చార్జీల రూపంలో నొక్కేస్తుంది ఎంత.. మీరు పథకాల ద్వారా ఇస్తున్నదెంతో చెప్పాలని నిలదీస్తున్నారు.
ఇలాంటి పోలిక గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ముందుకు రాలేదు. ఇలా ప్రజలు లెక్కలేసుకొని పోల్చడం వాళ్లలో పెరిగిన చైతన్యానికి నిదర్శనం. ఈ వ్యతిరేకతను జగన్ సర్కారు ఎలా తగ్గిస్తుందో వేచి చూడాల్సిందే.