గడచిన మూడేళ్ల నుంచి వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించిదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారు వైఫల్యాలపై బీజేపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పోరు సభలు నిర్వహిస్తామన్నారు.
పోరు సభల్లో కేంద్రం ఏపీకి ఇచ్చిన సాయం గురించి ప్రచారం చేస్తామన్నారు. నేటికీ కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందకుంటే పూట గడవని రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ తమ సొంత నిధులుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెట్టుబడులకు సంబంధించి కేంద్రం సహకరిస్తున్నా అందిపుచ్చుకునే స్థాయిలో వైసీపీ సర్కారు లేదని విమర్శించారు. మూడేళ్ల వైసీపీ పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌కు మళ్లీ ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా ఉందని విష్ణువర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. ఈ ప్రభుత్వానికి దశ దిశ లేదు. కేవలం ప్రతినెలా బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడం కోసం కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే రాష్ట్ర ఆర్థిక దుస్థితి ప్రచారం చేయగలరా అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు. వైసీపీ సర్కారు చర్యలతో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని మంత్రుల కేబినెట్ నడపడం లేదు. కేవలం సలహాదారులే నడుపుతున్నట్లు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఓ రాజకీయ నిరుద్యోగికి దేవాదాయ శాఖ సలహాదారునిగా నియమించడం దారుణమని విమర్శించారు. ఏపీలో మంత్రులకు అసలు స్వతంత్రత లేదు. అంతా ఉత్సవ విగ్రహాలేనన్నారు. సీపీఎస్‌పై విద్యాశాఖ మంత్రి అర్థరహితంగా మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా హామీ ఇవ్వడమేంటని విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు.
ప్రజా సమస్యలపై ఎవరైనా నిలదీస్తే పోలీసులను ఉసిగొల్పుతున్నారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంతకన్నా అరాచకం ఏముంటుందని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రభుత్వ తీరును దునుమాడారు. పోలీసు రక్షణలో వైసీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడం సిగ్గనిపించడం లేదా అని విమర్శించారు. తాత్కాలిక పథకాలతో ఎన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసినవాళ్ల దగ్గర నుంచి కార్యకర్తలు, సానుభూతిపరులు సైతం ఇప్పుడు జగన్ సర్కారును ఛీ కొడుతూ ఎమ్మెల్యేలను నిలేస్తున్నట్లు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఓటమి లక్ష్యంగా బీజేపీ ఉద్యమానికి సిద్దమవుతున్నట్లు ఆయన వివరించారు.