“అర్బ న్ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పోలింగ్ సమయానికి ఓటర్లు ఎటువైపు మరలుతారో అంచనా వేయలేం. గ్రామీణ ప్రాంతాల ఓటర్లే వైసీపీకి పాజిటివ్‌గా ఓటేసే అవకాశముంది. ప్రభుత్వాలు విధించిన భారాలతో సతమతమవుతున్నా.. సంక్షేమ పథకాలతో లబ్ది చేకూర్చారనే భావన ఉన్నా..లేకున్నా సరే. ఇరు పార్టీలు ఓటర్లకు తాయిలాలు పంచుతాయి. ఏ పార్టీ ఇస్తున్నా వద్దంటే వాళ్లకు వ్యతిరేకమనుకుంటారు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు ! అందుకే ఇరు పార్టీలు ఇచ్చిన తాయిలాలు తీసుకుంటారు. పార్టీల వారీ బయటపడని ఓటర్లు చెరొక ఓటు వేసి న్యాయం చేశామనుకుంటారు.” అంటూ ఒంగోలుకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలవర్తిపాటి వాచస్పతి వెల్లడించారు.
ప్రధానంగా గ్రామీణ ఓటర్లు రెండు లేదా మూడు గ్రూపులుగా ఉంటారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు రేపు ఎన్నికల్లో తలపడనున్నాయి. పోలింగ్ నాటికి వైసీపీ, టీడీపీ భారీగా తాయిలాలు పంచే అవకాశాలున్నాయి. ఎవరి గ్రూపులకు వాళ్లు పంచుకుంటారు. రాజకీయ ముద్ర వేసుకోని పేదలు మాత్రం తాయిలాలు అందుకొని చెరొక ఓటు వేస్తే పోతుందనే భావన ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత ఒకవైపుకే మరలితే వైసీపీ ఆశలు అడియాశలైనట్లే.
అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి చిరు వ్యాపారులు, చిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఆస్తి పన్ను, ధరలు, చార్జీల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. బహుజన, దళిత వర్గాల సంక్షేమ బడ్జెట్‌ను ఇతర పథకాలకు మళ్లించారనే ఆక్రోశం నెలకొంది. యువత స్వయం ఉపాధి పథకాలను రద్దు చేశారన్న ఆగ్రహం నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కౌలు రైతుల దాకా ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. మద్యం ధరలు పెంచి తమ కాపురాలు గుల్ల చేశారని పేద మహిళలు వాపోతున్నారు. మూడేళ్ల క్రితం నాటి నిత్యావసరాల ధరలతో పోల్చుకుంటూ ఇంతింత పన్నులేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇవన్నీ వైసీపీ సర్కారుకు భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపించొచ్చు. ప్రధానంగా పేద మధ్య తరగతి వర్గాల్లో నెలకొన్న ఈ వ్యతిరేకత ఎటువైపు మరలుతుందో !