నేడు రాజధాని ప్రాంతంలో వైసీపీకి ఒక్క ఓటు పడే స్థితి కనిపించడం లేదు. దీనికితోడు నాయకుల మధ్య కుంపట్లు.. వెరసి ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత. వీటన్నింటినీ సరిచేయడానికి సీఎం జగన్ వేసిన స్కెచ్ అదుర్స్ అనిపిస్తోంది. రాజధానిలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందువల్ల ప్రభుత్వంపై సానుకూలత వచ్చేస్తుంది. ఇవ్వొద్దని విపక్షాలు నోరెత్తలేవు. అడ్డుపడితే న్యాయస్థానాలపై నెపం నెట్టి సానుభూతి పొందొచ్చు. వారెవ్వా ! సీఎం జగన్ ఎత్తుగడకు రాజకీయ విశ్లేషకులు సైతం ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం తాడికొండ, మంగళగిరి, విజయవాడ నగర పరిధిలో అధికార పార్టీపై వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. తాడికొండలో ఇన్చార్జి మార్పుతో ఏదైనా ఫలితం ఉంటుందని ఆశించారు. అది రివర్స్ కొట్టింది. ఇక్కడ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయింది. మంగళగిరిలో టీడీపీకి చెందిన నేతను పార్టీలో చేర్చుకున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరేట్లు కనిపించడం లేదు. ఇక విజయవాడ ఈస్ట్, వెస్ట్లోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ రంగంలోకి దూకారు. రాజధానిలో పేదల గృహ నిర్మాణాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.
సీఆర్డీఏ చట్టంలోని బలహీన వర్గాల గృహ నిర్మాణం అనే అంశానికి నిన్నటి కేబినెట్ మీటింగ్లో సవరణ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ నివసించే పేదలకైనా సరే సీఆర్డీఏ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణ పథకాలను అమలు చేయవచ్చని సవరించారు.
పేదలకు ఇళ్ల స్థలాలు దక్కినా.. దక్కకపోయినా వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది
2020లోనే తాడికొండ, మంగళగిరి, విజయవాడ నగర పరిధిలోని సుమారు 54 వేల మంది పేదలకు 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జీవో నంబరు 107 జారీ చేశారు. దీనిపై రాజధానికి భూములు ఇచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. నాడు ధర్మాసనం ఈ జీవోను సస్పెండ్ చేసింది.
ఇప్పుడు మళ్లీ సీఆర్డీఏ చట్టంలో కొత్తగా సెక్షన్ 53(1)ని చేర్చింది. దీని ప్రకారం కేవలం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోని పేదలే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకూ రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చని పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పు ధిక్కారానికి ప్రభుత్వం పాల్పడుతుందంటూ రాజధాని రైతులు మళ్లీ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసే అవకాశముంది.
అమరావతిలోనే ఒకే రాజధానిని కొనసాగించాలని దాదాపు రెండేళ్ల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు త్వరలో మహాపాదయాత్రను తలపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని పేదలందరికీ రాజధానిలో ఇళ్లు ఇస్తామంటే వీళ్లు అడ్డుపడుతున్నారనే ప్రచారం రైతులను ఇబ్బంది పెట్టొచ్చు.
ఒంగోలులోనూ ఇదే రాజకీయ క్రీనీడ కొనసాగుతోంది !
గతంలో ఒంగోలు నగరంలోనూ ఇదే రాజకీయ క్రీనీడను దిగ్విజయంగా అమలు చేశారు. అక్కడ సుమారు 24 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూమి వివాదాస్పదమైంది. ఇనుప ఖనిజం తవ్వకం కోసం కేటాయించిన భూమిలో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ఓ టీడీపీ కార్యకర్త హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇళ్ల పట్టాల పంపిణీ నిల్చిపోయింది.
మైనింగ్ అనుమతి పొందిన ఖుద్రేముఖ్ కంపెనీ లాభదాయకం కాదని ఆ భూమిని వదిలేసింది. మైనింగ్ చేయనందున ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొని ఇళ్ల పట్టాలు ఇవ్వొచ్చని అప్పటి కలెక్టరు పోలా భాస్కర్ హైకోర్టులో అఫిడవిట్ సమర్పిస్తే సరిపోయేది.
ఇప్పటివరకు సదరు భూమిని వివాదాస్పదంగానే చూపుతున్నారు. పేదలకిచ్చే ఇళ్ల పట్టాలకు టీడీపీ అడ్డుపుల్ల వేసిందని సీఎం జగన్ దగ్గర నుంచి వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీన్ని చివరకు రాజకీయంగా ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే ఆయుధంగా అట్టి పెట్టుకోవాలనేమో.
ఇప్పటిదాకా ఒంగోలు నగరంలోని పేదలకు ఇళ్ల పట్టాలు దక్కలేదు. గృహ నిర్మాణం మొదలు కాలేదు. ఎన్నికల దాకా దీన్ని ఇలాగే సాగదీసే అవకాశాలున్నాయి. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో రాష్ట్రంలోని పేదలకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నిర్ణయం కూడా ఇలాంటిదేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.