భజన.. ఉక్రోషం.. రెండూ అత్యంత ప్రమాదకరమైనవే. ఇవి వాస్తవ పరిస్థితులను కనపడకుండా చేస్తాయి. ప్రస్తుత తెలుగు దేశం పార్టీ నేతల స్థితి అదే. ఒకప్పుడు భజనకు అలవాటు పడిన నేతలు ఇప్పుడు కూడా మీడియా భజనకే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోయామన్న ఉక్రోషం సహనాన్ని నశింపజేస్తోంది. కట్టలు తెంచుకునే ఆవేశం మాటున ఆలోచనలకు పదును పెట్టలేకపోతున్నారు. స్వభావరీత్యా ఆ పార్టీ నేతలు వీటి నుంచి బయటపడలేకపోవడమే వైసీపీ అధినేత జగన్ బలం. ఎత్తుగడల పరంగా టీడీపీ కన్నా వైసీపీ చాలా ముందంజను చాటుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీకి సుమారు 51 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ 40 శాతం సాధించుకుంది. గడచిన మూడేళ్లలో టీడీపీ బలం అలాగే లేదు. స్థానిక ఎన్నికల నాటికి దాదాపు పది శాతం తగ్గింది. ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశముంది. అదే సందర్భంలో అధికార వైసీపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. పెరిగిన వ్యతిరేకత అంతా గంపగుత్తగా ఓట్ల రూపంలో టీడీపీకి మరలుతుందన్న గ్యారెంటీ లేదు. ఇక్కడ నుంచి నష్ట నివారణ చర్యలు చేపడితే మళ్లీ వైసీపీ పుంజుకోవచ్చు. లేకుంటే వ్యతిరేక ఓటును చీల్చే ఎత్తుగడలను వైసీపీ అవలంభించవచ్చు. ఏది జరిగినా టీడీపీ ఆశలు అడియాశలైనట్లే.
వైసీపీ ట్రాప్లో టీడీపీ నేతలు..
వైసీపీ వెనుక ఉన్న సగం మంది ఓటర్లలో కనీసం ఓ పదిశాతం మందిని ఎలా తనవైపు తిప్పుకోవాలనే ఆలోచన టీడీపీ వర్గాల్లో కనిపించడం లేదు. దానికి తగ్గ కార్యాచరణ ఏదైనా అమలు చేస్తున్న దాఖలాలు కూడా లేవు. వైసీపీ సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. లేకుంటే చౌకబారు విమర్శలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిస్తూ కవ్విస్తున్నారు. వాళ్ల ట్రాప్లో పడి విపక్ష టీడీపీ నేతలు కొట్టుకుపోతున్నారు.
పథకాల లబ్దిదారులూ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు..
సంక్షేమ పథకాలు అందుకుంటున్నవాళ్లూ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పేదల గృహ నిర్మాణానికి సంబంధించి సెంటు, సెంటున్నర స్థలం ఇవ్వడంపై కొంత అసంతృప్తి ఉంది. ఆ స్థలాలు కూడా నగరాలు, పట్టణాలకు దూరంగా ఇచ్చారు. కనీస సదుపాయాల్లేకుండా అక్కడ ఇల్లు కట్టుకోవడం పేదలకు సాధ్యం కాదు. టౌన్లో బతికే చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్లు, చిరుద్యోగులు, ఇతర కార్మికులు అంత దూరాన ఇల్లు కట్టుకున్నా అందులో ఉండలేరు.
మొదటి, రెండు ఆప్షన్లలో ఇల్లు కట్టుకుంటున్నవాళ్లలో 60 శాతం ఆర్థికంగా వెసులుబాటు ఉన్నోళ్లే. ఏ ప్రభుత్వం వచ్చినా నోరుగలిగినోళ్లు కాబట్టి లబ్దిపొందుతారు. మిగతా 40 శాతం గుర్రపు నాడా దొరికిందని గుర్రాన్ని, గుర్రపు బండినీ కొనుక్కునే టైపు. మూడో ఆప్షన్ను ఎంచుకున్న ఇళ్ల లబ్దిదారులు మరీ నిరుపేదలు. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80వేలతో ఇల్లు కట్టడం సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వమే వాళ్లకు నిర్మించి ఇస్తోంది. వీళ్లందరి సమస్యలు ఒక్కటే కాదు. ప్రతీ లబ్దిదారుడ్ని కదిలిస్తే కన్నీళ్లు దోసిట పట్టాల్సిందే.
సంక్షేమ పథకాలకు దూరంగా నిరుపేదలు..
ఇంకా వాహన మిత్ర కింద పదివేల సాయం అందుకుంటున్నది ఆటో ఓనర్లు మాత్రమే. 90 శాతం మంది ఆటో డ్రైవర్లు అద్దెకు తీసుకునేవాళ్లే. లక్షల్లో పెట్టుబడులు పెట్టి క్షౌరశాలలు నిర్వహించే నాయీబ్రాహ్మణులకు మాత్రమే ప్రభుత్వం పదివేల సాయం ఇస్తోంది. వాటిల్లో పనిచేసే వాళ్లకు అందడం లేదు.
వేలవేల అద్దెలు చెల్లించి ఇస్త్రీ షాపులు పెట్టుకున్నవాళ్లకే ప్రభుత్వ సాయం. రోడ్డుపై తోపుడుబండిపై పెట్టుకున్నోళ్లు, ఇళ్లల్లో ఇస్త్రీ పెట్టెతో చెమటలు కక్కే వాళ్లకు సాయం లేదు. నేతన్న నేస్తం కింద రూ.24 వేల సాయం పొందుతున్నది మాస్టరు వీవర్లు మాత్రమే. మజూరీ చేసే పేద చేనేత కార్మికులకు అందడం లేదు.
పంటలు సాగు చేసే కౌలు రైతులకు భరోసా లేదు..
రైతు భరోసా నుంచి ఇన్పుట్ సబ్సిడీలు, వడ్డీలేని పంట రుణాల దాకా భూ యజమానులకే దక్కుతున్నాయి. వాస్తవంగా సాగు చేసే కౌలు రైతుకు అందడం లేదు. మొత్తం కౌలు రైతుల్లో ఒక్క శాతానికి మించి ప్రభుత్వ ప్రోత్సాహకాలు రావడం లేదు. పంట నష్ట పరిహారం సైతం అందక కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ నేతలు కౌలు రైతుల గురించి కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ పథకంలోనూ ఆర్థికంగా స్థిరపడి నోరుగలిగినోళ్లకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. వాస్తవంగా రెక్కలు ముక్కలు చేసుకొని జీవించే వాళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతకు నోచుకోలేదు. దీన్ని గమనించి ఆయా పథకాలు అందని నిరుపేదలను తమవైపు తిప్పుకునేందుకు విపక్ష టీడీపీ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే తమకు తప్ప ఇంకెవరికి వేస్తారనే ధీమానా ! ఇదే వాస్తవమైతే మబ్బులు చూసి భూమిలో విత్తనాలు వేసినట్లే.