ఏపీలో జన సైనికులు మూడో ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతున్నామంటున్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటున్నారు. అంతా బాగానే ఉంది. అనేక కీలక అంశాలపై ప్రజలకు స్పష్టతనివ్వడంలో లోపం కనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ సొంత డబ్బులిచ్చి ఆదుకున్నారు. తాము అధికారినికొస్తే కౌల్దారీ చట్టాన్ని ఎలా రూపొందిస్తారో చెప్పడం లేదు. యువత ఉపాధి కోసం నిరుద్యోగులకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. వాటితో ఎలా ఉపాధి కల్పిస్తారో సెలవియ్యలేదు. అసలు ఎలా అభివృద్ధి చేస్తారో.. వాటి ప్రణాళికలేమిటో వివరించలేదు. ఇంత అస్పష్టంగా ఉంటే జనసేనానికి ఒక్క అవకాశం ఎలా ఇస్తారు ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల మరమ్మతులపై చేపట్టిన ఆందోళనలు, జనవాణి పేరుతో చేపట్టిన గ్రీవెన్స్ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. జనంలో పవన్ గ్రాఫ్ పెరిగింది. బలవన్మరణానికి పాల్పడిన ఒక్కో కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించారు. కౌలు రైతుల సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి కౌల్దారీ చట్టాన్ని ఇలా రూపొందిస్తామని ఇప్పటికీ ప్రకటించలేదు. కౌలు రైతులకు నికరాదాయం రావడానికి ఎలాంటి అంశాలను చట్టంలో పొందుపరుస్తున్నారనేది వెల్లడించలేదు.
రాష్ట్ర ప్రజల్లో 60 శాతానికిపైగా వ్యవసాయమే ఆధారం. ఇంకా పారిశ్రామికంగా ఎదిగేందుకు సరైన అడుగులు పడలేదు. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిన దుస్థితి దాపురించింది. ఇలాంటి సమయంలో ప్రైవేటు పెట్టుబడులతో పరిశ్రమలు రావడం సాధ్యం కాదు. సుస్థిర అభివృద్దికి బాటలు పడాలేంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు వీలుంటుంది.
పన్నెండో తరగతి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎక్కడికక్కడ ఉపాధి కల్పించే పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలి. అప్పుడే వలసలను నిరోధించగలం. ఉన్నత విద్య గతి ఎటువైపు అనేది కూడా నిర్దేశించుకోవాలి. విద్య, వైద్యం ఉచితంగా అందించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది పారిశ్రామిక రంగానికి ఊతంగా నిలుస్తుంది. మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడానికి సరైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
ఇలా చెప్పుకుంటూపోతే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు జనసేన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో ఇప్పటికీ వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో జనసేన వైఖరి ఏంటీ.. ఏఏ పార్టీలతో కలిసి ముందుకు సాగుతుంది.. దానికున్న ప్రాతిపదిక ఏంటీ.. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచౌకగా కుబేరులకు కట్టబెట్టడంపై జనసేన విధానమేంటనేది స్పష్టతనివ్వాలి. ఇవన్నీ స్పష్టం చేయకుండా ఒక్కసారి అవకాశం ఎలా ఇస్తారు జనసేనానీ !