“ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయింది. విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను రెండుగా చీల్చే మత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కార్పొరేట్ శక్తుల అండదండలతో రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా కదులుదాం ! దేశాన్ని కాపాడుకుందాం!” అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆయన చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఎక్కడికక్కడ సంఘీభావంగా రాహుల్‌తో కలిసి అడుగులో అడుగేస్తున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అవలంభిస్తున్న అరాచక విధానాలతో దేశం అతలాకుతలమవుతోంది. సగటు ప్రజలపై పెద్ద ఎత్తున విధిస్తోన్న భారాలకు జనం విలవిల్లాడుతున్నారు. ప్రజలమూలిగలు పీల్చి కొద్ది మంది తాబేదారులను ప్రపంచస్థాయి కుబేరుల సరసన చేర్చింది మోడీ సర్కారు. కార్పొరేట్ శక్తుల అంటకాగుతూ తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తోంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. ఇలాంటి విపత్కర స్థితిలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకోవాల్సిన ఆవశ్యకత ముందుకొచ్చింది.
అవకాశవాద రాజకీయ నేతలతో ఇప్పటిదాకా కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ నవతరంతో జవసత్వాలు సమకూర్చే బాధ్యతను రాహుల్ గాంధీ భుజానికెత్తుకున్నారు. మోడీషాల విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే మొట్టమొదటగా సీఎం ఎంకే స్టాలిన్ తమిళనాడులో స్వాగతం పలికారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కోలేవని స్టాలిన్ గ్రహించారు.
మరోవైపు అహ్మద్ పటేల్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాధినేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రత్యేక తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తానన్న సంగతిని గుర్తు చేశారు. పార్టీలో విలీనం చేయకున్నా కలిసి ముందుకు సాగొచ్చు కదా అని సీఎం కేసీఆర్‌కు సూచించారు.
అలాగే సీఎం జగన్‌పై మా పార్టీ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు. జగన్‌పై కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టడం వల్లే ఆయన పార్టీని విభేదించారు. అంతే తప్ప కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించలేదని అహ్మద్ పటేల్ వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలు వివిధ ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌కు దగ్గర చేసే ప్రయత్నాల్లో భాగమేనని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ ఇస్తున్న హామీలతో పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. రైతులకు రూ. 3 లక్షలదాకా రుణ మాఫీతోపాటు ఉచిత విద్యుత్, 300 యూనిట్లలోపు పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తామని రాహుల్ హామీనిచ్చారు. కాంగ్రెస్ అధికారానికి వస్తే వంట గ్యాస్‌ను రూ.500కే ఇస్తామని ప్రకటించారు.
రాహుల్ పాదయాత్రపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ విధ్యంసకర పాలనతో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవాళ్లు సైతం మళ్లీ కాంగ్రెస్ రావాలని ఆశిస్తున్నారు. దీంతో తెలుగు ప్రజల్లో కాంగ్రెస్‌కు మద్దతు పెరిగే అవకాశాలున్నాయి.