మరుగేలరా ఓ రాఘవా !
మరుగేలరా చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేలరా ఓ రాఘవా!!
అన్నీ నీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదికి తెలుసుకుంటినయ్యా !! అన్ని!!
నిన్నెగాని మాది నేనెన్నజాల నోరుల !! నిన్నెగాని!!
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత
!! మరుగేలరా !!
సప్తపది సినిమా చూస్తున్నంత సేపూ ఈ పాటే మదిలో మెదులుతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దుస్థితికి ఇది అద్దం పడుతోంది. వేరెవర్నో ప్రేమించిన కథానాయికను మరెవరో పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. ఆ యువతి శిరమెత్తిన అమ్మవారిలా అతనికి కనిపిస్తోంది. దడుసుకుంటాడు. రాష్ట్ర పీఠమెక్కిన నేతకు జనం కళ్లురుముతున్న అమ్మవారిలా దర్శనమిచ్చినట్టుంది. ఏం చేయాలో దిక్కుతోచక ప్రజలను దారి మళ్లించడానికి ఓ కుక్క మూతి పిందెను పట్టుకొని ఊరేగుతున్నాడు. దాంతో ప్రయోజనం లేదని తెలిసే సరికి పుణ్యకాలం ముగిసిపోతుంది.
అయినా సరే.. ఇప్పటిదాకా తానేం చేశాడు.. ప్రజలెందుకు చిర్రుబుర్రులాడుతున్నారనేది గ్రహించలేదు. మూర్ఖులంతే. మునిగిపోయేదాకా ఏదీ గమనించలేరు. దింపుడు కళ్లం ఆశలాగా ఇప్పుడు మూడు రాజధానులంటూ లంఘించుకున్నాడు. ఇది కూడా తుస్సు మంటే ఏం చేస్తాడు ! ఇది తెలియని భజంత్రీలంతా కడపటిదాకా సమ్మగా వాయిస్తారు. కిందపడ్డోడు లేచి చూసే సరికి ఈ భజనలన్నీ ఓ భ్రమని అవగతమవుతుంది. ఆ సరికే కథ కంచికి చేరుతుంది.
ఎలాగూ బురదలో మునిగాం. బయటకొచ్చి కడుక్కునేందుకు ప్రయత్నిస్తే మార్పు చోటుచేసుకోవచ్చు. అదే బురదను అందరికీ అంటించాలనుకునే వాళ్లను ఏమంటారో తెలీదు. ఇదే ప్రక్రియ ప్రారంభమైంది. ఇలాంటివి విజయవంతమైనట్లు చరిత్రలో ఎక్కడా లేదు. మరి బురద నుంచి ఎంత మంది బయటపడతారో.. ఎంత మంది మునుగుతారో తెలీదు. కాలమే నిర్ణయించాలి. రాష్ట్ర రాజకీయాలకు.. ప్రజలకు ఇదో పెద్ద గుణపాఠం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
మరుగేలరా .. ఓ రాఘవా !