ఇప్పటిదాకా పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు వికేంద్రీకరణ డిమాండ్ తరచూ వినిపిస్తుండేది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా దఖలు పడిన 29 అంశాలకు సంబంధించిన అధికారాలు, విధులు, నిధులను క్షేత్రస్థాయి ప్రజా ప్రభుత్వాలకు బదలాయించాలని పంచాయతీలు, స్థానిక సంస్థలు కోరుతున్నాయి. నేటిదాకా వికేంద్రీకరణ అంటే ఇదేనేమో అనుకున్నాం. తాజాగా అసెంబ్లీలో సీఎం జగన్ వికేంద్రీకరణ అంటే ఏమిటో విపులంగా వెల్లడించారు. క్యా బాత్ హై అంటూ కొందరు.. అసలు అర్థం ఇదా అంటూ మరికొందరు నోటిపై వేలేసుకుంటున్నారు.
సీఎం జగన్ వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు చేపట్టామన్నారు. అందులో భాగంగా మూడు రాజధానులు తెస్తామన్నారు. బియ్యం, కందిపప్పు, బంగాళా దుంపలతోపాటు ఇతర నిత్యావసర సరకులను ఇంటింటికీ చేరవేస్తున్నట్లు తెలిపారు. సామాజిక పించన్లను నేరుగా లబ్దిదారుల చేతికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గల్లా పెట్టె సీఎం వద్దే కేంద్రీకృతం.. పదవులే వికేంద్రీకరణ
సంక్షేమ పథకాల నగదును డీబీటీ ద్వారా లబ్దిదారులకు ఇస్తున్నట్లు వెల్లడించారు. వలంటీర్లు, సచివాలయాల ఏర్పాటుద్వారా ఇది సాధ్యమైనట్లు సీఎం వివరించారు. ఈ అన్నింటిలో పాలన ఎక్కడుందో తెలీదు? పరిపాలనా నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు.
గడచిన మూడేళ్ల నుంచి ఒక రోడ్డు వేయాలన్నా.. డ్రైనేజీ, మంచినీటి సరఫరాకు సంబంధించి నిధులు మంజూరు చేసే అధికారం మంత్రులు, ఎమ్మెల్యేలకే లేదు. గల్లా పెట్టె మొత్తం సీఎం జగన్ దగ్గర ఉంటుంది. నిధులు విడుదల చేసే బటన్ కూడా సీఎం వద్దనే ఉంది. మిగతా ప్రజాప్రతినిధులంతా ఉత్స విగ్రహాలే.
సంక్షేమ శాఖలకు కేటాయించిన బడ్జెట్ నిధులూ పుస్తకాల్లో సర్దుబాటు చేసినట్లు కనిపిస్తాయి. రోడ్లు, ప్రాజెక్టుల మరమ్మతులకు కేటాయించిన నిధులూ దారి మళ్లాయి. కేవలం సీఎం బటన్ నొక్కి విడుదల చేసే సంక్షేమ పథకాలకు తప్ప మరే ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టినట్లు కనిపించదు.
వికేంద్రీకరణ పేరుతో అధికారాలు, నిధులు కేంద్రీకృతం
గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి పాలనే కనిపిస్తుంది. వలంటీర్లు, సచివాలయాల స్థానంలో జన్మభూమి కమిటీలు, నోడల్ అధికారుల వ్యవస్థ కొనసాగింది. గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు అధికారపార్టీ నాయకులతో ఏర్పాటైన అభివృద్ధి కమిటీల పెత్తనమే కొనసాగింది. ఎక్కడ రోడ్డు వేయాలన్నా, మురుగు కాల్వలు నిర్మించాలన్నా, చెరువులు, కాలువల మరమ్మతులు ఈ కమిటీల ద్వారా సాగేవి.
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలను నిర్వీర్యం చేశారు. మండల, జిల్లా పరిషత్లూ నిస్తేజమయ్యాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలు నామ్ కే వాస్తేగా మారిపోయాయి. అంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కనుసన్నల్లోనే నిధుల వినియోగం నడిచింది.ఈ రెండు ప్రభుత్వాల తీరు కూడా వికేంద్రీకరణ మాటున అధికారాలు, నిధులు కేంద్రీకృతమయ్యాయి.
వికేంద్రీకరణంటే ఇదే !
రాజ్యాంగబద్దంగా స్థానిక ప్రభుత్వాలకు తాగునీటి సరఫరా, పారిశుద్యం, అంతర్గత రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, అనుబంధ శాఖలతోపాటు సాగునీటి సరఫరాతో సహా పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్తుల పాలన కిందకు తీసుకురావాలి. అలాగే అర్బన్ పరిధిలోని స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి.
వార్డు కమిటీ తీర్మానం మేరకు నిధులు వెచ్చించాలి. వార్డు కమిటీ ప్రతిపాదనలను పంచాయతీ పాలకవర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇదే తరహాలో మండల, జిల్లా ప్రజా పరిషత్ స్థాయిలో స్థానిక ప్రభుత్వాల పాలన పరిధిలోకి మొత్తం 29 అంశాలకు సంబంధించిన అధికారాలు, నిధులు తీసుకురావాలి.
ఇప్పటిదాకా ఒక్క కేరళలో తప్ప దేశంలో మరెక్కడా రాష్ట్ర ప్రభుత్వాలు కిందిస్థాయికి అధికారాలు, నిధులను బదలాయించలేదు. పాలనా వ్యవహారాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సహకరించలేదు. బహుశా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు వికేంద్రీకరణంటే అర్థమై ఉండకపోవచ్చు. ప్రస్తుతం సీఎం జగన్ వికేంద్రీకరణంటే ఏమిటో స్పష్టం చేశాక.. దేశ వ్యాప్తంగా ఇదే తరహా వికేంద్రీకరణ అమలు చేసేందుకు పూనుకోవచ్చు.