“అమరావతి రాజధానిని ప్రజలు అంతగా సొంతం చేసుకోలేదు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని భుజానికెత్తుకుంటే అటు ఉత్తరాంధ్రలో.. ఇటు రాయలసీమలో పార్టీ బలాన్ని గట్టిగా నిలబెట్టుకోవచ్చు. టీడీపీతో సహా విపక్షాలు అమరావతి రాజధానికే మద్దతునిస్తున్నాయి. అందువల్ల ఉత్తరాంధ్ర, సీమలో ఇరుకున పెట్టొచ్చు” సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుంది. ప్రభుత్వ వ్యతిరేకతను భావోద్వేగాల వైపు మళ్లించాలనే ఎత్తుగడ కావొచ్చు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా సరే. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం అందులో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లింది. శాసన వ్యవస్థ హక్కులకు భంగం కలిగించడమేనంటూ సుప్రీం కోర్టుకు అప్పీలు సమర్పించింది. అమరావతి రాజధానిపై న్యాయస్థానాల తీర్పులు ఏమైనా ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర, సీమలో ప్రజల్లో భావోద్వేగాలు రగిలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలుతుందా !
ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదేస్తున్న పన్నులతో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికార పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలనే కసితో ప్రజలున్నారు. ప్రభుత్వాలు విధిస్తోన్న భారాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నందుకు ఎస్సీలు, ముస్లింలు కొరకొరలాడుతున్నారు.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కౌలు రైతుల దాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలకు ఇస్తోన్న సంక్షేమ పథకాలు ఆయా వర్గాల్లోని పేదలకు అందడం లేదనే అక్కసు నెలకొంది. ఇంకోవైపు అధికార వైసీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తప్పదనే సంకేతాలు ఇవ్వడంతో వీటికి మరింత ఆజ్యం పోసినట్లయింది. వీటన్నింటితో ఉక్కిరి బిక్కిరవుతున్న వైసీపీ అధిష్టానానికి అమరావతి రైతుల మహాపాదయాత్ర వరంలా కనిపించింది.
అమరావతి రైతుల మహా పాదయాత్ర వరమైందా !
అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ సీఐడీ కొంతమందిని అరెస్టు చేసినా న్యాయస్థానాలు మొట్టికాయలు వేసింది. అది మహాయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై దండయాత్ర అని ఎలుగెత్తి చాటినా అంతగా ప్రజల్లో స్పందన కానరాలేదు. అమరావతి ఏకైక రాజధానిపై ఎప్పుడో హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇంతవరకు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంలో అప్పీలుకు వెళ్లింది. రేపోమాపో విశాఖ నుంచి కార్య నిర్వాహక పాలన మొదలవుతుందన్నట్లు హడావిడి మొదలు పెట్టింది.
మూడు రాజధానుల ప్రచారంతో విశాఖ స్టీలు ప్లాంట్ విక్రయంపై ప్రజల దృష్టి మరలుతుందనుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో పోలవరం గురించి మర్చిపోయి విశాఖ రాజధాని కావాలనే ఆందోళన ముందుకొస్తుందని భావిస్తున్నట్లుంది. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమలో మూడు రాజధానుల కోసం ప్రజల భావోద్వేగాలు ప్రధానంగా ముందుకు తేవడం ద్వారా ఎన్నికలను గట్టెక్కాలనే వైసీపీ ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.