ఏపీ ప్రభుత్వంపై మూడేళ్లలోనే ఇంతగా ప్రజల వ్యతిరేకత పెరగడానికి కారణం వైసీపీ నిర్ణయాలు.. కేంద్ర విధి విధానాలను తూచా అమలు చేయడమే. అందుకే ఈ ఉపద్రవం నుంచి బయటపడడానికి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. మూడు రాజధానుల వ్యూహం వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉన్నట్లు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కులమతాల వైషమ్యాలకు తావులేదు. ఆలయాలపై దాడులకూ అంతగా స్పందన లేదు. అందుకే మూడు రాజధానుల అంశంతో ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోస్తున్నట్లు అవగతమవుతోంది.
రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది. రాజధాని ఎక్కడ పెడతారు.. ఎన్ని రాజధానులు పెట్టుకుంటారనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. దీనికీ కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని మొన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సెలవిచ్చారు.
దీనికి భిన్నంగా గతంలో అమిత్షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని మీరెందుకు ఉద్యమం చేయకూడదని అమిత్షా రాష్ట్ర కమలనాధులకు తలంటారు. దీంతో అమరావతి రాజధాని రైతులు చేపట్టిన తిరుపతి యాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఎందుకింత గందరగోళం !
మూడు రాజధానుల ఏర్పాటునకు సంబంధించి పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. అంటే దీనర్ధం ఏమిటి ! శాసన సభకు ఆ అధికారం లేదనా ? లేక హైకోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుందనా !
హైకోర్టు తీర్పులో అమరావతి రాజధానిగా శాసన సభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి కట్టుబడమనే ఉంది. సీఆర్డీఏతో భూములిచ్చిన రైతుల ఒప్పందానికి తూట్లు పొడవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నందున ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో బిల్లు పెడతామన్నారు. దీనికి బదులు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎందుకు వేసినట్లు ? ఎందుకింత గందరగోళం !
సెంటిమెంటు పేలుతుందో.. తుస్సుమంటుందో !
అమరావతి రాజధాని గురించి వైసీపీ తీరుపై బీజేపీ నేత వై సత్య కుమార్, ఎంపీ జీవీఎల్ విమర్శించినట్లు ఈ రోజు పత్రికల్లో కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించడానికే వైసీపీ మూడు రాజధానుల పేరిట భావోద్వేగాలను రెచ్చగొడుతున్నట్లు ఆయా నేతలు పేర్కొన్నారు.
ఇలా ఒక్కో నాయకుడు రోజుకో తీరున మాట్లాడుతుంటారు. ఆ పార్టీ ఢిల్లీ పెద్దలే వైసీపీతో ఈ వ్యూహాన్ని అమలు చేయిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేయడం విశేషం. ఇంతకీ మూడు రాజధానుల సెంటిమెంటు పేలుతుందో లేదో వేచి చూడాల్సిందే.