“ సమాజానికి మేథో సంపత్తిని అందించిన ఉత్పత్తి కులాలకు అధికారం ఉండాలని 1964లోనే రామ్ మనోహర్ లోహియా చెప్పారు. ఉత్పత్తి కులాలకు సమాజంలోని కష్టనష్టాలు తెలుస్తాయి. సమస్యలపై లోతైన అవగాహన ఉంటుంది. పరిష్కరించడానికి వాళ్ల చేతుల్లో అధికారం లేదు. మానవ నాగరికతకు ఊపిరులూదిన ఉత్పత్తి కులాలకు అధికారం దక్కాలనే పార్టీ పెట్టా. 2009లో ఓ ప్రయత్నం జరిగినా కొన్ని కారణాలరీత్యా ఫలించలేదు. మళ్లీ అదే తప్పు జరగదు. ఆ వర్గాలకు అధికారం దక్కాలనే లక్ష్యంగా పెట్టుకున్నా !” జనసేనాని పవన్ కల్యాణ్ నోటి నుంచి వెలువడిన తూటాల్లాంటి ఈ మాటలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జనసేన పార్టీ న్యాయవాదుల విభాగం సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఉత్పత్తి కులాల్లో ఆలోచనలు రగిలించింది. రాతిని దేవుడిగా మలిచిన విశ్వ కర్మల ఉనికిని ప్రశ్నిస్తోంది. చెట్టుకొమ్మను నాగలిగా చెక్కిన కంసాలి మేథస్సు ఏమైందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మానవ నాగరికతకు అంకురార్పణ చేసిన కుమ్మరి చక్రం ఇప్పుడు ఎక్కడ కునారిల్లుతుందనే భావన రేకెత్తిస్తోంది. లోహాలను పనిముట్లుగా మార్చిన కమ్మరి బతుకులు ఎక్కడ పొగచూరి పోతున్నాయంటూ ఆవేదనకు గురిచేస్తోంది.
మనిషి మాన మర్యాదలకు వస్త్రాన్ని అందించిన చేనేతల మేథో సంపత్తి ఏ పడుగుల్లో కృశించి పోతుందంటూ సమాజాన్ని నిగ్గదీస్తోంది. ప్రకృతి నుంచి అందమైన బుట్టలను అల్లిన మేదరుల జీవితాలు ఎలా కునారిల్లుతున్నాయని నిలదీస్తోంది. కొండలను పిండి చేసి ఆకాశహర్మ్యాలను నిర్మించిన వడ్డెరల బతుకులెట్లా ఛిద్రమవుతున్నాయో తేటతెల్లం చేస్తోంది. జంతు చర్మాల నుంచి పాద రక్షలను రూపొందించిన మాదిగ మేధావితనం ఎక్కడ ఆవిరైపోతుందంటూ ఆక్రోశిస్తోంది.
రాజ్యాధికారం కోసం ఆధిపత్య వర్గాలు పోటీపడుతున్న నేటి రాజకీయాల్లో ఉత్పత్తి కులాలకు అధికారం రావాలంటున్న పవన్ వ్యాఖ్యలు వివిధ రాజకీయ పార్టీల్లోని ఆయా వర్గాలను తాకింది. ఇన్నాళ్లూ దారుణమైన వివక్షను అనుభవిస్తున్న ఈ మేథస్సును పవన్ మాటలు తట్టి లేపాయి. ఉత్పత్తి కులాలకు అధికారం దక్కితే సమాజగతి ఏ తీరున ముందుకు సాగుతుందో వివరించాల్సిన ఆవశ్యకతను ఆయన వ్యాఖ్యలు వక్కాణిస్తున్నాయి.
‘‘2019లో జనసేన ఓటమిపాలైనప్పుడు ఎందరో పార్టీని వీడారు. కుంగిపోతాడనుకున్నారు. కానీ నేను బలమైన వృక్షాన్ని. పక్షులు ఎగిరిపోయినా చెట్టు ఎక్కడకూ పోదు. బలంగా వేళ్లతో భూమిని పట్టుకొని పైకి ఎదుగుతుంది. తుపాన్లు చుట్టుముట్టినా.. గ్రీష్మ రుతువులు మంటలు మండించినా ఆ వృక్షం ఎక్కడకూ వెళ్లదు. నేలతల్లికి అంకితమై మరింత ధృడంగా విస్తరిస్తుంది. సెంటు భూమి లేకున్నా దేశాన్ని అంటిపెట్టుకున్న కోట్లాదిమంది ప్రజల్లాగా నేను కూడా నా పార్టీని, ఈనేలను, సమాజాన్ని అంటిపెట్టుకునే ఉంటాను ! ” అంటూ పవన్ కల్యాణ్ గుంటూరు శేషేంద్ర శర్మ రచనలను ఉటకించడం రాజకీయాల్లో ఆయన నిబద్దతను చాటింది.