“చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా రెచ్చిపోలేదు. వైసీపీ కార్యాలయాలపై దాడులు చేయలేదు. అన్న క్యాంటీన్లను అడ్డుకున్నా తిరగబడలేదు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయలేదు. చివరకు వాళ్ల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్శిటీకి పీకేసినా చడీ చప్పుడు లేదు. అసలు ఏం చేస్తే వీళ్లు రెచ్చిపోతారు !” సీఎం జగన్‌తోపాటు వైసీపీ అధిష్టానాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏదో రకంగా ఆ సామాజిక వర్గం చెలరేగిపోతే.. టీడీపీని ఆ కులానికే పరిమితం చేయాలనే ఎత్తుగడలు ఏవీ ఫలించడం లేదు. ఎందువల్లంటే..
ఇది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కాదు. ఎవరున్నా లేకున్నా అన్నపై అభిమానంతో ఉర్రూతలూగే పార్టీ అసలే కాదు. ప్రస్తుతం ఉన్నది ఫక్తు చంద్రబాబు పార్టీ. కేవలం వ్యాపారులతో నిండిపోయిన పార్టీ. అధికారం ఉంటే నాయకులుంటారు. లేకుంటే వాళ్ల వ్యాపారాలకే పరిమితమవుతారు. అంతకుమించి మరే విషయానికీ స్పందించరు.
ఇప్పుడు వైసీపీ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయే యంత్రాంగం టీడీపీలో అంతగా లేదు. దీనికితోడు ఒకప్పుడు టీడీపీకి సైన్యంలా పనిచేసిన బీసీ సామాజిక వర్గాలు బాగా తగ్గిపోయాయి. అందుకే పూర్వ వైభవం కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
ఎస్సీ బీసీలను కులాల నాయకత్వానికే పరిమితం చేయడం వల్లే మిలిటెన్సీ కొరవడింది..
ఎన్టీఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేసిన తెలుగు దేశం పార్టీ క్రమేణా వాళ్లను ఆయా కుల సంఘాలకు మాత్రమే పరిమితం చేస్తూ వచ్చింది. అంతకుమించి ఎదగడానికి అవకాశం లేకుండా చేశారు. యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్లు ఎదిగారంటే బీసీల్లో అత్యధిక ఓట్లు కలిగిన సామాజిక వర్గం కాబట్టే. 139 బీసీ కులాల్లో ఎంతమంది టీడీపీ నాయకులుగా గుర్తింపునకు నోచుకున్నారో గమనిస్తే వాస్తవ పరిస్థితులు బోధపడతాయి. ఎస్సీల్లో మాదిగలు కొద్దిమేర పార్టీకి అండగా ఉన్నారు. ఇక పార్టీలో మిలిటెన్సీ ఎక్కడ నుంచి వస్తుంది ?
ఆధిపత్య కులాలను ఆయా పార్టీలకు కన్సాలిడేట్ చేసే ఎత్తులు చిత్తవుతున్నాయి
గడచిన మూడేళ్లలో వైసీపీ కులాల కుంపట్లు రేపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతగా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు, సంస్థలకు మొత్తం జగన్, వైఎస్ పేర్లు పెట్టినా ప్రత్యర్థుల్లో ఆశించిన స్పందన లేదు. కీలక పదవులన్నింటినీ రెడ్లతో నింపినా పట్టించుకోలేదు. తద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా తమవైపు నిలుపుకోవచ్చని వైసీపీ భావించింది. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అది కూడా సాధ్యపడలేదు. ఆది నుంచి కమ్మ సామాజిక వర్గం రాజకీయ పునాదులు కమ్యూనిస్టు భావ జాలంతో నిండి ఉండేది.
రెడ్ల మాదిరిగా కాంగ్రెస్ తత్వం ఉండి ఉంటే ఈపాటికి రాష్ట్రం రావణకాష్టమయ్యేది. ఇవేవీ జరగలేదంటే కమ్మ సామాజిక వర్గం ఎంతటి పరిణతితో వ్యవహరిస్తుందో అవగతమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌లాంటి వాళ్లు పాము చావకుండా.. కర్ర విరగకుండా ఎంత బాగా స్పందించారో చూస్తేనే తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేసి పబ్బం గడుపుకునే రాజకీయాలు చెల్లవని.
జనసేనను వెనక్కి నెట్టాలనే ఆలోచన తుస్సుమంది..
ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్శిటీకి తొలగించడం ద్వారా తమ ప్రత్యర్థి కేవలం టీడీపీ మాత్రమేనని వైసీపీ చెప్పదల్చుకుంది. వాస్తవానికి వైసీపీని ఆందోళనకు గురి చేస్తోంది జన సైనికుడు పవన్ కల్యాణ్ మాత్రమే. ఆయనకున్న మిలిటెంట్ సైన్యమే వైసీపీ యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారం కోసం పోటీపడుతున్న రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలు ఆయా పార్టీలకు కన్సాలిడేట్ చేసి మిగతా బీసీఎస్సీఎస్టీ మైనార్టీలను తమ వైపు నిలబెట్టుకోవాలనే ఎత్తుగడతో వేసిన తారక మంత్రం తుస్సుమంది.
ఎన్టీఆర్ ఎపిసోడ్‌పై కమ్మ సామాజిక వర్గంలో అంతగా స్పందన లేకపోవడం వైసీపీ అధిష్టానానికి నిరుత్సాహాన్నే మిగిల్చింది. ఎన్టీఆర్‌ను రాముడిగానో.. కృష్ణుడి అవతారంలోనో చూసే సగటు జనానికి మరెక్కడో కాలింది. ఏదో ఆశించి మరేదో చేస్తే అది చివరకు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.