“ అవతలివాళ్ల అభిప్రాయాలు నచ్చకుంటే బూతులు తిడతారా ! వ్యక్తిగత జీవితంలోని లోపాలను పెద్దవి చేస్తారా ! వాళ్ల కుటుంబాల్లోని మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తారా ! వాళ్ల క్యారెక్టర్‌పై అసత్యాలు.. అర్ధసత్యాలు ప్రచారం చేస్తారా !” ప్రస్తుత అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఐటీ సెల్స్ ఇవే చేస్తున్నాయి. ఎవరేమైనా అనుకోనివ్వండి. సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద జల్లుకుంటాం. మీరెవరు మధ్యలో మాట్లాడడానికి అంటున్నారు. ఈ రాష్ట్రం ఏమన్నా మీ తాత జాగీరా.. వాళ్ల అయ్య ఆస్తి అనుకుంటున్నారా! ప్రజలు కళ్లు తెరిస్తే నామరూపాల్లేకుండా పోవడం ఖాయమంటూ అనేక విశ్లేషణలు ముందుకొస్తున్నాయి.
ఏపీలో ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ సామెతయ్యింది. ఐదేళ్లపాటు టీడీపీ పాలనలో వేగలేక వైసీపీకి కసిగా ఓటేశారు. తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేసింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడంపైనే ధ్యాస పెట్టింది. దీనికి అనుగుణంగా సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకులు సృష్టించుకోవాలని ఆశ పడింది. కులాలను రెచ్చగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించింది. ఇలాంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో భాగంగా వ్యవస్థలోని లోపాలను సవరించడానికి బదులు మరింత సమస్యాత్మకం చేసింది.
వైసీపీ సర్కారు అరాచకత్వానికి పరాకాష్ట
వైసీపీ సర్కారు ఆర్థిక అరాచకత్వానికి తెర లేపింది. ఖజానాను గుప్పెట పట్టింది. తాబేదారులకు బిల్లులు చెల్లిస్తారు. కూటికి జరగని చిరుద్యోగుల వేతనాలు ఆపేస్తారు. ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపుతున్నారు. పేద ధనిక తారతమ్మం లేకుండా పన్నులు బాదేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బహిరంగ నిలువు దోపిడీ. ఓ చేత్తో గుంజుకొని మరో చేత్తో ఎంగిలి మెతుకులు విదిల్చే విధానాలను అమలు చేస్తున్నారు.
నవరత్నాల పేరుతో ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నారు. ఎవరి సొమ్ము ఎవరికిస్తున్నారు ! మీ తాత ముత్తాతల సొత్తు ఇస్తున్నారా .. ప్రజల మూలిగలు పీల్చిన దాంట్లో నుంచి ఇస్తున్నారా ! ఇప్పుడు జనం ఇదే ఆలోచనలో పడ్డారు. ఎప్పటి నుంచో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను పెంచుతున్నారు..
అసమానతలను తగ్గించడానికి ధనికులపై పన్నులేయడం ద్వారా వచ్చిన సొమ్మును పేదల సంక్షేమానికి వినియోగించేది. ఇప్పుడు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మధ్యతరగతిని కూడా పీల్చి పిప్పి చేసి కొద్దిపాటి కుబేరులను పెంచుతున్నారు. మిగతా జనాన్ని బానిసలుగా మార్చేస్తున్నారు. ఇందుకోసమేనా ప్రజలు భారీగా ఓట్లేసి గెలిపించిందీ !
ప్రతిపక్ష టీడీపీలో ఆత్మ పరిశీలన కొరవడి ఉక్రోషం పెరిగింది. అధికార వైసీపీలో లెక్కలేని తనం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రానున్న ఎన్నికలు రెఫరెండం కానున్నాయి. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలకనుంది. అధికార ప్రతిపక్షాల నీచ ఎత్తుగడలను ప్రజలు తుత్తునియలు చేయడానికి సిద్దమవుతున్నారు. అప్పటిదాకా వీళ్ల విన్యాసాలను ప్రజలు బలవంతంగానైనా భరించక తప్పదు మరి.