మళ్లీ సీఎం జగన్ నోట అదే మాట. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు మారకుంటే మార్చేస్తా. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో సీఎం మరోమారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొందరు సరిగ్గా పాల్లొనడం లేదని సీఎం హెచ్చరించారు. ప్రజల్లో వాళ్ల గ్రాఫ్ పెరగడం లేదనేదే అసలు విషయం. ఒక్కో సచివాలయం పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20 లక్షలు కేటాయించారు. అయినా ఎమ్మెల్యేలు, ఇన్చార్జులపై ప్రజల్లో అనుకున్న మైలేజీ రావడం లేదని పీకే టీం నివేదించింది. వీళ్లు గడప గడపకూ వెళ్లకపోవడమే లోపమని సీఎం భావిస్తున్నారు. అసలు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతుందనే కోణంలో ఆలోచించరా !
గడప గడపకూ వెళ్లి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ది చేకూరిందో లెక్కలేసి చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకుంటుందనేది వైసీపీ భావన. గడచిన మూడేళ్లలో రూ.1.71 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారులకు అందించిన ఘనత తమదేనని చెప్పినా ప్రజల్లో ఆశించిన సానుకూలత రావడం లేదు. నాడు–నేడు కింద వేల కోట్లు వెచ్చించి స్కూళ్లు, ఆస్పత్రులు మెరుగుపరుస్తున్నా ప్రజల్లో అసంతృప్తి తగ్గడం లేదు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇంటి పట్టా ఇస్తున్నామని ఎలుగెత్తి చాటినా సరైన స్పందన రావడం లేదు. ఎందువల్లనేది పార్టీ అధిష్టానం లోతుగా అధ్యయనం చేసిందో లేదో మరి.
ఆర్థిక సంక్షోభంతో అల్లాడే ప్రజలపై అలవికాని భారాలే ప్రభుత్వానికి శాపాలు
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే వైసీపీ అధిష్టానం జీర్ణించుకోలేని కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది సగటు కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇది డామినేట్ చేస్తోంది. గడచిన మూడేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు 50 శాతం పెరిగాయి. నిత్యావసరాలతోపాటు అన్ని వస్తువులు, సేవలపై వీటి ప్రభావం చూపుతోంది. దీనికితోడు నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు పెరిగాయి. ఆస్తి పన్నుతో ఇంటి అద్దెలు పెరిగాయి. రవాణా, కరెంటు చార్జీలు మరింత భారమయ్యాయి.
గత ప్రభుత్వ హయాం నాటికి ఇప్పటికీ పోల్చుకుంటే సగటు కుటుంబ జీవన వ్యయం 35 శాతం పెరిగినట్లు అంచనా. అదే సమయంలో ప్రజల ఆదాయాలు ఒక్క శాతం కూడా పెరగలేదు. ఆశించిన రీతిలో ఉపాధి అవకాశాలు పుంజుకోలేదు. దీంతో అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతున్న కుటుంబాలు ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదనే అసంతృప్తికి దారితీస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. పెట్రోలు, డీజిల్‌తోపాటు నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆక్రోశం నెలకొంది.
ఉపాధి లేమితో యువతలో ఆక్రోశం
ప్రధానంగా యువతలో ప్రభుత్వం పట్ల సానుకూల ధృక్పథం లేదు. యువతను నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. ఆశించిన రీతిలో ఉపాధిని పెంచే పరిశ్రమలు రాలేదు. గతంలో ఉన్న స్వయం ఉపాధి పథకాలను రద్దు చేశారు. అసంఘటిత రంగంలో వేతనాలు పెరగలేదు. ద్రవ్యోల్పణంతో నిజ వేతనాలు పడిపోతున్నాయి. సచివాలయాల్లో ఉద్యోగాలు, వలంటీర్ల నియామకం తప్ప ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంతగా చేపట్టడం లేదు. వీటన్నింటి ప్రభావంతో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది.
ఇళ్ల పట్టాలు ఇచ్చినా సానుకూలత లేదు
ఇక అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇస్తున్నామనేది కూడా పేదల్లో ఆశించిన సానుకూలత కనిపించడం లేదు. సెంటు, సెంటున్నర స్థలంలో ఇల్లేంటనేది ముందుకొస్తోంది. పల్లెటూళ్లో గొడ్డూగోదా ఉంటే ఎలా సరిపోతుందనే అసంతృప్తి చోటుచేసుకుంది. ఇచ్చిన స్థలాలు సగానికిపైగా నివాస యోగ్యానికి అనువుగా లేవు. కొన్నిచోట్ల నగరాలు, టౌన్లకు చాలా దూరంగా ఉన్నాయి. రోజూ టౌనుకొచ్చి పనిచేసుకొని తిరిగి ఇంటికి చేరాలంటే కష్టం.
ఒకవేళ ఇల్లు కట్టుకుందామంటే నిర్మాణ సామగ్రి ధరలు చుక్కలు చూస్తున్నాయి. మూడేళ్ల కాలంలోనే సిమెంటు, ఇసుక, ఇనుము ధరలు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేలు పునాదులకే సరిపోవు. కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.10 లక్షలు కావాలి. ఆర్థిక స్థితి కలిగిన వాళ్లు ఇల్లు కడదామన్నా సరైన మౌలిక సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలైతే ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని అడుగుతున్నారు. అందువల్ల ఈ పథకంపై కూడా లబ్దిదారుల్లో సంతృప్తి లేదు.
నాడు–నేడు కింద వేల కోట్లు వెచ్చించినా ప్రజలకు ఒరిగిందేంటీ !
నాడు– నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేస్తున్నామని చెబుతున్నారు. వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడుతుంది. గతేడాదితో పోలిస్తే ఈఏడు ప్రభుత్వ బడుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. పాఠశాలల విలీనం ప్రభావం కూడా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు ఇంకా మెరుగుపడలేదు.
భవనాలు కట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రజలకు అందాల్సిన సేవల్లో నాణ్యత రావాలి. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులపై ఈపాటికే పిచ్చి కుక్క ముద్ర పడి ఉంది. దాన్ని తొలగించేట్లు ప్రభుత్వ చర్యలు ఉండాలి. అప్పుడే సగటు ప్రజలు ఈ సేవలను వినియోగించుకోగలుగుతారు. ఆ దిశగా ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలేవీ కనిపించడం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఆశించిన మైలేజీ రావడం లేదు.
ప్రజల కష్టాలకు ఉపశమనం కల్పించకుండా ఎన్ని చేసినా ప్రయోజనమేంటీ !
లోపాలన్నీ ప్రభుత్వ నిర్ణయాల్లో ఉంటే ఎమ్మెల్యేలను, ఇన్చార్జులను నిందించి ఏం ప్రయోజనం ! వీళ్లంతా ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములే కదా ! ప్రస్తుతం సీరియల్ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్లు ఎక్కడ ఆపేస్తారోనని నోరు మెదపకపోవచ్చు. వాళ్లలో పెరుగుతున్న ఆక్రోశాన్ని తగ్గించలేవు. గడప గడపకూ నాయకులు వెళ్లి మొండి కేసి కూర్చున్నా ప్రయోజనం లేదు. సగటు జనం ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యకైనా పరిష్కారం చూపినప్పుడే మళ్లీ అధికారం దక్కుతుంది. 175 స్థానాలూ గెలవాలనే కోరిక సహజం. అందుకోసం చేపడుతున్న కార్యాచరణ ఏంటనేదే ప్రధానం. ఆలోచించండి సార్ !