ఈసారి ఎన్నికల్లో వారసులను దించొద్దని సీఎం జగన్ పార్టీ నేతలకు నిర్మొహమాటంగా చెప్పేశారు. 2024 ఎన్నికలను సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేతల వారసులకు అవకాశమిచ్చి ప్రయోగాలు చేయదల్చుకోలేదని కుండబద్దలు కొట్టేశారు. కొందరు నేతలు పదవులు చేపట్టినప్పటి నుంచి వాళ్ల వారసులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. సీఎం జగన్ ప్రకటనతో నేతల్లో ఆశలు ఆవిరయ్యాయి. వారసులు అయోమయంలో పడ్డారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీకి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పోటీ చేస్తారని మారుమోగింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని బాలినేని కూడా భావించారు. రాజకీయాల్లో తాను క్రియాశీలక పాత్ర పోషించే సమయంలోనే తనయుడు ప్రణీత్‌రెడ్డి రాజకీయంగా ఎదగాలని అనుకున్నారు. అసలు నియోజకవర్గంలో మీ పని తీరు బాగోలేదని సీఎం హెచ్చరించడం కొసమెరుపు. దీనికి తోడు వారసులకు అవకాశం లేదని ప్రకటించడం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోనని ఆ పార్టీ వర్గాల్లో గుబులు మొదలైంది.
బంధువులైనా అవకాశం లేనట్టే..
అదే సందర్భంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని రాజకీయ ఆరంగేట్రం చేయించాలని అనుచరులు పట్టుబడుతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీకి దించాలని అభిమానులు సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. సీఎం ప్రకటన వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానాన్ని సుబ్బారెడ్డి వదులుకోవాల్సి వచ్చింది. ఈ దఫా ఆయన కుమారుడికైనా అవకాశం దక్కుతుందనే దానికి గండి పడింది.
మాగుంట ఏం చేస్తారో !
మరోవైపు ఒంగోలు ఎంపీ స్థానానికి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఈపాటికే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అనేక వేదికలపై ప్రకటించారు. మరి ఇప్పుడు జగన్ నిర్ణయంతో రాఘవరెడ్డికి అవకాశం దక్కకపోవచ్చు. కనీసం ఎమ్మెల్యేగానైనా పోటీ చేయించాలని మాగుంట భావిస్తున్నారు. సీఎం నిర్ణయం ఆశానిపాతంలా మారింది. ఇదే జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ వారసుడు విశాల్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. సీఎం ప్రకటనతో సురేష్ కుమారుడూ అవకాశం కోల్పోయారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. నిరంతరం నియోజకవర్గ ప్రజలను కలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. వయో భారం రీత్యా ఈ దఫా అభినయ్‌రెడ్డిని రంగంలోకి దించాలని కరుణాకర్‌రెడ్డి భావించారు.
సీఎం జగన్ ప్రియ శిష్యులకూ శిరోభారమే !
అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండ్రి బాటలో నడిచి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. చివరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తనయ పవిత్రారెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీళ్లందరి ఆశలకు సీఎం జగన్ గండి కొట్టారు.
సీఎం జగన్ నిర్ణయంతో ఈసారికి వారసులు వెనక్కి తగ్గుతారా.. కెరీర్ కోసం తండ్రులతో కలిసి పార్టీనే వదిలేస్తారా అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నికలు సమీపించే సరికి నేతల భవితవ్యం ఏంటనేది ఓ కొలిక్కి రావొచ్చు. అప్పటికి సీఎం జగన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేకపోలేదని కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి సీఎం నిర్ణయంలో మార్పు రాకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.