“ నానాటికీ వ్యవస్థలో నేను.. నాది అనే పోకడలు పెచ్చరిల్లుతున్నాయి. మనిషి అసలు ఒంటరిగా బతగ్గలడా ! అందరూ బావుండాలి. అందులో ఒకరిగా జీవించాలనే తత్వం ప్రోదికావాలి. వ్యవస్థలో 80 శాతంగా ఉన్న ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు కునారిల్లుతుంటే 20 శాతం మిగతా ప్రజలు సుఖంగా మనగలగలేరు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు తగ్గితేనే సమాజం ముందుడుగు వేస్తుంది. ఇలాంటి లక్ష్యంతో బడుగుల అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నా” అంటూ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిల్చిన జీ వీరభద్రాచారి ‘తెలుగిల్లు’కు తమ అభిప్రాయాలు వెల్లడించారు. శనివారం ఓటరు నమోదు చైతన్య యాత్రను ఒంగోలులో చేపడుతున్నట్లు వివరించారు.
నేడు చట్టసభల్లో సంపన్నులు, మందీమార్బలం ఉన్నవాళ్లే ప్రవేశించగలుగుతున్నారు. దీన్ని తుత్తునియలు చేస్తూ దేశ రాజధాని నుంచి ఎందరో మేథావులు, యువకులు ఎన్నికల్లో పెద్దగా ఖర్చు పెట్టకుండానే విజయం సాధిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందుతున్నారు. విద్యా ప్రమాణాలు బాగా ఉన్న రాష్ట్రాల్లో ఇది సాధ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఒరవడికి నాంది పలకాలి.
కులమతాల కుమ్మలాటల నుంచి రాజకీయాలు మారాలి
కులమతాల కుమ్ములాటలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న ఏపీ రాజకీయాలు మారాలి. డబ్బు సంచులతో గెలవగలమనే ధోరణులకు చెక్ పెట్టాలి. ప్రాంతీయ భేదాలకు అతీతంగా సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగలరని నిరూపించాలి. అలాంటి లక్ష్యంతోనే ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీల ప్రతినిధిగా శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.
వాస్తవానికి పెద్దల సభకు వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రజారంగంలో విశేష కృషి చేసిన వాళ్లను పంపాలి. ప్రస్తుతం పెద్దల సభ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రమైంది. అధికార ప్రతిపక్షాల రాజకీయ అవసరాలు తీర్చే వేదికయింది. శాసన మండలిలో వివిధ రంగాల ఉన్నతి కోసం లోతైన చర్చలు జరగాలి. అక్కడ చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు విధి విధానాల రూప కల్పనకు కృషి జరగాలి.
దీనికి భిన్నంగా మండలికి సభ్యులను పంపుతున్నారు. చర్చలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దుస్సంప్రదాయం మారాలి. అందుకే సమకాలీన వ్యవస్థలో అసమానతలను దునుమాడడం కోసం అధిక సంఖ్యలో ఉన్న బడుగులు ముందడుగు వేయాలి. పెద్దల సభ గౌరవాన్ని ఇనుమడింపజేయాలి.
ప్రతీ ఒక్కరికీ ఉపాధి గ్యారెంటీ చట్టాలు రావాలి..
ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధి విధానాల మూలంగా నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతోంది. నేతల స్వార్థపూరిత ఆలోచనల వల్ల ప్రజల మధ్య అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. ఉపాధి మిళితమైన అభివృద్ధి వైపు ఏపీ అడుగులు పడాలి. యువతకు దిశానిర్దేశం చేసే విధంగా చట్ట సభల్లో నిర్ణయాలు జరగాలి. కళాశాల నుంచి బయటకు వస్తూనే నిర్బంధ ఉపాధి పొందే హక్కును సాధించాలి. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఊపిరిపోయాలి.
ప్రతీ ఒక్కరికీ ఉచిత నిర్బంధ విద్య మాదిరిగా ఉపాధిని గ్యారెంటీ చేసే చట్టాలు కావాలి. ఆ దిశగా ప్రభుత్వ విధి విధానాలు చేపట్టేందుకు అసంఖ్యాక ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు ఏకతాటిపై నిలిచి చట్ట సభల్లో పోరాడాలి. ఇలాంటి బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు గ్రాడ్యుయేట్లలో అవగాహన పెరగాలి. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు చైతన్యవంతమైన తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని విన్నవిస్తున్నా.