“ పేదరికం వల్ల మావాళ్లు ఆడ పిల్లలను చదివించలేక పోతున్నారు. చిన్నప్పటి నుంచో ఏదో ఒకపని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటారు. మగపిల్లలైతే పదో ఏటనే మెకానిక్ షెడ్లలో పని నేర్చుకోవడానికి వెళ్తారు. ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో పిల్లలను చదివించుకుంటారు. షాదీ తోఫాకు పదో తరగతి పాసవ్వాలనే నిబంధన పెట్టడం సరికాదు. దీని వల్ల పేద ముస్లిం కుటుంబాలు పథకాన్ని పొందలేవు” అంటూ ఒంగోలుకు చెందిన సయ్యద్ మున్నా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పదో తరగతి పాస్ నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు.
అక్టోబరు 1 నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు సర్కారు అమలు చేసిన పథకాన్ని తామెందుకు కొనసాగించాలనుకున్నారో.. ఏమో. అధికారానికి రాగానే వైసీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ఎత్తేసింది.
ఈపథకం కింద పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపేసింది. కొన్నాళ్లకు ప్రోత్సాహక నగదును పెంచుతూ వైఎస్సార్ పెళ్లి కానుక పేరుతో అమలు చేస్తామని ప్రకటించింది. అయినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పేర్లతో పథకాన్ని అమలు చేసేందుకు పూనుకుంది.
ఎస్సీఎస్టీలకు రూ. లక్ష ఇస్తారు. అందులో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.1.20 లక్షలు ప్రకటించారు. బీసీలకు రూ.50 వేలు, ఇందులో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు రూ.75 వేలు ఇస్తామన్నారు. ముస్లిం మైనార్టీస్కు రూ. లక్ష, విభిన్న ప్రతిభావంతులకు రూ. లక్షన్నర ఇవ్వనున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెళ్లయిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ మూడు నెలలకోసారి అప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ప్రోత్సాహక నగదును విడుదల చేస్తారు.
ఎస్సీఎస్టీలకన్నా దారుణమైన పేదరికంలో ముస్లింలు
వైఎస్సార్ షాదీ తోఫా పథకానికి పదో తరగతి పాస్ నిబంధన పేద ముస్లిం కుటుంబాలకు ఆశానిపాతమైంది. కేవలం ఆర్థిక వెసులు బాటు ఉండి పిల్లలను చదివించుకున్న వాళ్లకు మాత్రమే పథకం వర్తిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు ఎస్సీ ఎస్టీలకన్నా దారుణమైన పేదరికంలో మగ్గిపోతున్నట్లు గతంలో సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది.
అప్పటి నుంచి నేటిదాకా ముస్లింల అభివృద్ధికి ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేవు. కనీసం ఈ ఒక్క పథకమైనా పేద ముస్లిం కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందనుకుంటే పది పాస్ నిబంధన అడ్డుపడుతోంది. ఇంకా ఎస్టీల్లోని యానాదులకు, కొన్ని సంచార జాతులకు పథకం వర్తించే అవకాశం లేదు.
మూడేళ్ల నుంచి పెళ్లి చేసుకున్న ఎస్సీఎస్టీ జంటలకూ పథకాన్ని వర్తింపజేయాలి
“మూడేళ్ల నుంచి పెళ్లిళ్లు చేసుకున్న జంటలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలి. వీళ్లకు ఐదు వాయిదాల్లో చెల్లిస్తే న్యాయం చేసినట్లవుతుంది. గత ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకానికి నగదు పెంచినా వైసీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు. దీనివల్ల పేద ఎస్సీఎస్టీ కుటుంబాలు లబ్ది పొందలేకపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మూడేళ్ల నుంచి వివాహం చేసుకున్న జంటలకూ పథకాన్ని వర్తింపజేయాలి” అని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన సామాజిక, రాజకీయ కార్యకర్త నలతోటి కోటేశ్వరరావు ప్రభుత్వానికి సూచించారు. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలను సవరించడంపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు.