“ఏ పత్రికలో రాయలన్నా.. ఏ టీవీలో చూపాలన్నా ఆయా సంస్థలకు కొన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలుంటాయి. వాటికి లోబడే వార్తలు, కథనాలుంటాయి. అందుకు సిద్దమయ్యే ఆ సంస్థల్లో పనిచేయాలి. మనకంటూ ఎలాంటి లక్ష్యాలు ఉండకూడదు. ఇలా ఎంతకాలం ! పాతికేళ్లు జర్నలిజంలో కొనసాగి చివరకు ఏం సాధించినట్లు ? జ్ఞాపకాల్లో జీవిస్తే కుదరదు. ఆలోచనలు.. ఆచరణ నిరంతర ప్రవాహంలా కొనసాగాలి. అప్పుడే ఆ జీవితం సమాజ గతిలో సుసంపన్నమవుతుంది ’’
నా మాటలు మిత్రుడికి రుచించలేదు. రాజకీయ పార్టీల వారీ విడిపోయిన మీడియా రంగంలో అసమానతలపై యుద్ధం చేయాలనుకుంటున్నావు. అనేక ఒడిదుడుకులుంటాయి. కష్ట నష్టాలను భరించాలి. జీవితంలో మళ్లీ కోలుకోలేవు. ఇలాంటి ఆలోచనలు మానుకో. ఆశయాలు వినడానికి, రాయడానికి బావుంటాయి. ఆచరణ అంత తేలిక్కాదు. జీవన చివరాంకంలో ముళ్ల బాటను ఎంచుకుంటున్నావ్. మరోసారి ఆలోచించమని పదే పదే చెప్పాడు.
ఆశయాలే తప్ప ఆర్థిక వనరుల్లేవ్..
ఆశయాలే తప్ప ఆర్థిక వనరుల్లేవ్. సామాజిక బలగం లేదు. రాజకీయ అండదండల్లేవ్. అయినా మొండి ధైర్యం. పరిగెత్తలేకుంటే వేగంగా నడవాలి. నడవలేకపోతే పాకుతూనైనా ముందుకు సాగాలి. అంతే తప్ప నిశ్చలంగా ఒకే చోట ఆగిపోకూడదు. ఏమైనా కానీ. భౌతిక పరిస్థితులు అనుకూలించనీ లేకపోనీ. గెలుపోటములు అనేవీ ఏవీ లేవు. ప్రతీ అడుగు ముందుకు పడే కొద్దీ కింద పడినా ఎంతో నేర్చుకుంటాం. ప్రాణమున్నంత వరకూ నేర్చుకోవడమేనన్న సోక్రటీస్ మాటలు గుర్తొచ్చాయి. ఇక ఆగలేదు.
మీడియా రంగంలో సాంకేతిక మార్పులు వేగవంతమయ్యాయి. ప్రధాన పత్రికలు, టీవీ చానెళ్లు చేతిలో ఇమిడిపోయిన మొబైల్‌లోకి వచ్చేశాయి. డిజిటల్ వేదికపైకి మీడియా చేరింది. తొలుత యూట్యూబ్‌లోకి అడుగెయ్యాలనుకున్నా. అందుకు తగినంత మానవ వనరులను సమకూర్చుకునే శక్తి లేదు. అందుకే వెబ్సైట్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అలా ‘తెలుగిల్లు’కు అంకురార్పణ జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలపై అక్షర యుద్ధం చేయడంలోనే ఇప్పటిదాకా అనుభవం ఉంది. ఇక్కడ నుంచి వెబ్ పోస్టింగ్ సాంకేతిక మెళకువలను నేర్చుకోవాల్సి వచ్చింది.
ఏ నిర్ణయాల వెనుక ఏ వర్గ ప్రయోజనాలున్నాయో చెప్పడమే లక్ష్యం..
రోజువారీ సంఘటనలు, స్పాట్ న్యూస్ అందరికంటే వేగంగా అందించలేం. అంత నెట్ వర్క్ లేదు. నిర్దేశించుకున్న లక్ష్యానికి ఇలాంటి వార్తలు ఎంతమాత్రం దోహదపడవనిపించింది. క్షేత్రస్థాయి అధ్యయనంతో కథనాలు ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయాలు ఏ వర్గానికి ప్రయోజనం.. మరే వర్గానికి నష్టమనే కోణంలో విశ్లేషణాత్మక కథనాలే లక్ష్య సాధనకు తోడ్పడతాయి. ప్రధాన రాజకీయ పార్టీల ఎత్తుగడలు, కార్యాచరణ, విధి విధానాలు ఏ వర్గానికి కొమ్ముకాస్తున్నాయో ప్రజలకు వివరిస్తూ కథనాలు ఇవ్వాలని నిర్దేశించుకున్నా.
‘ది వైర్’ స్ఫూర్తితో ముందడుగు
రోజులు గడిచేకొద్దీ ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. కంటెంట్ రైటర్స్‌కు వేతనం ఇవ్వలేని దుస్థితిలోకి జారిపోయా. వ్యూయర్షిప్ పెరుగుతున్నా గూగుల్ యాడ్స్ నుంచి వచ్చే ఆదాయం ఎందుకూ కొరగావడం లేదు. అప్పుడు ‘ది వైర్’ ఇంగ్లిష్ వెబ్సైట్ గుర్తుకొచ్చింది. ఆ తరహాలో నడిపితే కొంచెం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్క వచ్చనిపించింది. వెంటనే ‘ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా ఫౌండేషన్’ పేరుతో ట్రస్టును ప్రారంభించా. ట్రస్టు ద్వారా పాఠకుల నుంచి విరాళాలు సేకరించాలనుకున్నా. దానికీ ఎన్నో అడ్డంకులు.
ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా ఫౌండేషన్‌కు ఆదాయశాఖ నుంచి 12ఏ, 80జీ అనుమతులు రావాలి. ఆదాయపన్ను నుంచి మినహాయింపునిచ్చే ఈ అనుమతులుంటేనే వెబ్‌సైట్‌కు విరాళాలు సేకరించే గేట్‌వే యాప్‌లు అంగీకరిస్తాయి. ఆదాయపన్ను మినహాయింపుల్లేకుండా డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై పాఠకుల నుంచి విరాళాలు సేకరించడం కుదరదని తేలిపోయింది. ఇప్పుడు వాటిని పొందేందుకు కసరత్తు జరుగుతోంది. తెలుగు మీడియాలో వార్తా కథనాలు చదివి ఆ జర్నలిస్టు కష్టానికి ఎంతోకొంత ఇవ్వాలనే అలవాటు పాఠకుల్లో అంతగా ప్రోది కాలేదు. నిష్పక్షపాతంగా ఆలోచించే వాళ్లూ తగ్గిపోతున్న రోజులు ఇవి. అయినా వెనుకంజ వేయలేదు.
ఇన్ని ఒడిదుడుకుల మధ్య ‘తెలుగిల్లు’ మీడియా హౌస్ ప్రారంభమై ఈ దసరాకు ఏడాది పూర్తికావొస్తోంది. ఈనెల 15న ఒంగోలులో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తోంది. ఈసందర్భంగా తెలుగిల్లు శ్రేయోభిలాషులు, అభిమానుల మధ్య మరొక్కసారి తెలుగిల్లు లక్ష్యాలేమిటో స్పష్టం చేసేందుకు వార్షికోత్సవ సదస్సు వేదిక కానుంది. ఎప్పటిలా మీ ఆదరాభిమానాలు కొనసాగిస్తారని ఆశిస్తూ..
– సీహెచ్. కాశీ విశ్వనాథ్
చైర్మన్, ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా ఫౌండేషన్