ఎక్కడో నూటికొక్కరు ఉంటారు. తొమ్మిది నెలలు అమ్మ గర్బం నుంచి నేల మీద పడతాం. అక్కడ నుంచి తోటి మనిషి కష్టాలను తనవిగా భావించే వాళ్లు కొందరుంటారు. బతకడమంటే మనం బతికితే కాదు. సాటి మనుషులకు సాయం చేస్తూ జీవించడమే పరమావధి అనుకునే వాళ్లు చాలా అరుదు. సమాజం మాకేమిచ్చిందని కాదు. అదే సమాజానికి మనమేం చేశామని భావించేవాళ్లు చుక్కాని వేసినా కనపడరు. అలాంటి మన వ్యవస్థలో తన సంపాదనను ఆపన్నుల కోసం వెచ్చిస్తోన్న గొల్లపూడి శ్రీహరి ముందుంటారు. ఆ శివుడే తనను ఇలా చేయాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు.
గొల్లపూడి శ్రీహరి సొంతూరు ప్రకాశం జిల్లా చీమకుర్తి. అక్కడే వ్యాపారాలున్నాయి. సహజంగా వ్యాపార మనస్తత్వం ఉన్న వాళ్లకు దానధర్మాలు.. పేదల కష్టాల గురించి పట్టించుకోవడమనేది ఉండదు. కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉంటుంది. దీనికి భిన్నంగా అతను బాధల్లో ఉన్నోళ్లకు ఆపద్బాంధవుడు అయ్యాడు. శివ భక్తుడు. భక్తితో ముక్తి ప్రాప్తించదు… తోటి మనిషికి సాయం చేయడమే ముక్తికి మార్గమని తలంచాడు. ఆ పరమేశ్వరుడు తనను అలా నిర్దేశించినట్లు చెబుతున్నారు. అనుకున్నదే తడవుగా శివం ఫౌండేషన్‌కు అంకురార్పణ చేశారు.
దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిగారే నాకు ఆదర్శం – శ్రీహరి
ఓ జర్నలిస్టుగా చేసిన అనుభవం శ్రీహరిని మరింత మానవతామూర్తిగా మలిచింది. దర్శి మాజీ ఎమ్మెల్యే దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డిది అదే ఊరు. ఆయన స్ఫూర్తితో తాను ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీహరి చెబుతున్నారు.

“ ఇక్కడ రాళ్లు రూపాయలను ఆర్జిస్తున్నాయి. అది భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నా. అందుకే రాళ్లు అమ్మగా వచ్చిన దాంట్లో కాస్త పేదలకు పంచుతున్నా. బతికినన్నాళ్లు నలుగురు మనుషులను సంపాదించుకోవాలి. రూపాయలను కాదు !” అనే సుబ్బారెడ్డిగారి తత్వం తనను పూర్తిగా మార్చేసిందని శ్రీహరి గుర్తు చేసుకున్నారు.
ఉచిత మంచినీటి సరఫరాతో మొదలై వృద్ధాశ్రమం నెలకొల్పేదాకా ..
మొట్టమొదట చీమకుర్తిలోని పలు ప్రాంతాల్లో ఫ్లోరిన్తో ప్రజల ఇబ్బందులను శ్రీహరి గమనించారు. వెంటనే మూడు ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు నెలకొల్పి మంచి నీటి సమస్యను తీర్చారు. అందుకోసం దాదాపు రూ. 6 లక్షలు వెచ్చించారు. ఐదేళ్ల నుంచి ఈ వాటర్ ప్లాంట్లను ఆయన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా మంచినీళ్లు అందిస్తున్నారు.
కొవిడ్ సమయంలో ఒంగోలు రిమ్స్‌కు రూ. 5 లక్షల వ్యయంతో 25 ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చారు. ఆపదలో రోగులను ఆదుకునేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. చీమకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో భోజనశాలను కట్టించారు. కరోనా లాక్ డౌన్ అప్పుడు రోగులకు మూడు పూటలా ఉచితంగా పౌష్టికాహారాన్ని సరఫరా చేశారు. పేదలకు నిత్యావసరాలను, మందులను ఇంటింటికీ తిరిగి అందించారు. కోవిడ్ వైరస్‌తో చనిపోయిన 60 మందికి తమ ఫౌండేషన్ ద్వారా కర్మకాండలు నిర్వహించారు.

అంతటితో శ్రీహరి వితరణ ఆగిపోలేదు. ఒంగోలు నగరంలో ఓ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఎలాంటి ఆసరా లేని వృద్ధులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అక్కడ నుంచే నిత్యం 200 మందికి భోజనం తయారు చేయించి నగరంలోని యాచకుల కడుపు నింపుతున్నారు. ఇదేకాదు. రోడ్డు ప్రమాదంలో కన్నవాళ్లను కోల్పోయిన బిడ్డలకు ఆసరాగా నిలిచారు. కాకినాడలోని ఉమా మనో వికాస కేంద్రంలో చేర్పించి ఎందరికో కృత్రిమ కాళ్లు, చేతులను ప్రసాదించి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
ఆత్మసంతృప్తి కోసమే.. అంతకుమించి గొప్ప లక్ష్యాలేమీ లేవు
ఇవన్నీ చేయడం వెనుక ఏదైనా లక్ష్యం ఉందా అని అడిగితే.. “ నేను శివ భక్తుడ్ని. శివతత్వాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలీదు. జన్ననిచ్చిన నేల తల్లి రుణం తీర్చుకోవాలనిపించింది. నేనేదో గొప్పలు చెప్పుకోవడానిక్కాదు. అందరూ ఇలాగే ఉండాలని కూడా చెప్పను. మనమంతా సంఘ జీవులం. కంటి ముందు కన్నీళ్లతో మనిషి కనిపిస్తే గుండె కోసినట్లనిపిస్తోంది. ఏదో నాకున్న దాంట్లో సాయం చేస్తున్నానంతే !” అంటూ చిర్నవ్వుతో చెప్పారు. హ్యాట్సాఫ్ యూ శ్రీహరి.