కేసీఆర్ రేపు ప్రకటించే జాతీయ పార్టీపై ఏపీలో రకరకాల ఊహాగానాలకు తెరదీసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కేంద్రీకరిస్తారని కొన్ని విశ్లేషణలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ కొప్పుల వెలమ నాయకులతోపాటు గతంలో తనతోపాటు పనిచేసిన నేతలను సంప్రదిస్తున్నట్లు మరికొన్ని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈపాటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్‌ను కలిశారు. జాతీయ పార్టీ ఏర్పాటు గురించి చర్చించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బీ టీమ్స్‌గా ఉన్నాయనే ప్రచారాన్ని భుజానికెత్తుకునే కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ సర్కారు అప్పుల కోసం.. కేసుల మాఫీ కోసం కేంద్రంలోని బీజేపీ విధానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు కేసీఆర్ గతంలోనే వ్యాఖ్యానించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి కేంద్ర విద్యుత్ చట్టాన్ని అమలు చేస్తే రూ.2,500 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతిస్తుంది. దీని కోసం రైతుల మెడకు ఉరితాడు తగిలించలేనని కేసీఆర్ అనేక వేదికలపై పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీలో బీజేపీకి కేవలం వైసీపీనే కాదు. టీడీపీ కూడా సానుకూలంగా ఉంది. ఇక జనసేన ఈపాటికే బీజేపీ పొత్తులో ఉంది.
సామాన్యుడి నడ్డి విరిచేట్లు కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను 50 శాతం పెంచినా ఈ మూడు పార్టీలు కిమ్మనలేదు. కనీసంగానైనా వ్యతిరేకించలేదు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన అర్బన్ సంస్కరణల్లో భాగంగా ఆస్తి, చెత్తపై పన్నులు వేస్తున్నారు. కొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేక సతమతమవుతుంటే నిత్యావసరాలపై జీఎస్టీ పన్నుల స్లాబును పెంచేసింది. దీనిపై కూడా మూడు పార్టీలు నోరు మెదపలేదు.
విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెడితే ఇక్కడ వ్యతిరేకిస్తారు. ఢిల్లీలో సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఇలా మూడు పార్టీలు ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పోర్టులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ కుబేరులకు అప్పనంగా కట్టబెడుతున్నా వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి స్పందనే లేదు. చివరకు పోలవరంపై ఎన్ని కొర్రీలు వేస్తున్నా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ అంశాలన్నింటిపై ఎక్కుపెట్టి ఏపీలో బలపడాలని భావిస్తోంది.
దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజలను నిట్టనిలువునా చీల్చే ఎత్తుడలతో ఏపీలోని ముస్లిం మైనార్టీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈపాటికే అనేక క్రైస్తవ సంఘాలు ఈదఫా తాము వైసీపీకి మద్దతు ఇవ్వలేమని బ్రదర్ అనిల్ కుమార్‌కు స్పష్టం చేశాయి. ఈ అంశాలన్నీ కేసీఆర్ జాతీయ పార్టీకి కలిసొస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రొ బీజేపీ పార్టీలను టార్గెట్ చేసే ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.