“పవన్ నిబద్దత.. నిజాయతీ కలిగిన నాయకుడు. నా తమ్ముడికి రాజకీయంగా సహకరించొచ్చు. పవన్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా!” అని మెగాస్టార్ చెప్పగానే సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. చిరంజీవి రాజకీయాల్లో చురుగ్గా లేరు. తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సమయంలో సహకరిస్తారని జనం ఊహించారు. చిరంజీవి మద్దతు పవన్‌కు బ్లాక్ బస్టర్ బొనంజా ఏమీ కాదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన వైఖరేంటనేదే ప్రధానం. అదే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం తెగనమ్మేందుకు సిద్దమైంది. అయినా పవన్ అమ్మకానికి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ఇదొక్కటే సరిపోదు. బీజేపీ దోస్తీతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న జనసేన స్టీల్ ప్లాంటు అమ్మకంపై ఎంత మాట్లాడినా.. ఏం చేసినా ఎవరూ విశ్వసించరు.
పోలవరంపై కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనమేంటీ !
పోలవరం ప్రాజెక్టు కింద పరిహారం, పునరావాసానికి సంబంధించి 5 శాతం కూడా పూర్తి కాలేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ అంశాలతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ అంచనా పైనా కొర్రీలు వేస్తోంది. దీనిపై కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిందించి ప్రయోజనం లేదు.
ఏపీ కౌల్దారీ చట్టం విధి విధానాలపై స్పష్టతనివ్వాలి
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది కౌలు రైతులున్నారు. అందులో 18 లక్షల మంది సెంటు భూమి సొంతం లేని ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలున్నారు. కేవలం గోదావరి జిల్లాల్లో 80 శాతం కౌలు రైతులతోనే వ్యవసాయం మనుగడ కొనసాగుతోంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు పవన్ లక్ష చొప్పున సాయం చేశారు. అది ఆయన మానవత్వానికి నిదర్శనం. ఇదొక్కటే చాలదు. కౌలు రైతులను చట్టపరంగా ఆదుకోవడానికి బలమైన కౌల్దారీ చట్టాన్ని తీసుకురావాలి. దాని విధి విధానాలపై ఇంతవరకు పవన్ స్పష్టతనివ్వలేదు.
ఉపాధి అవకాశాల పెంపుపై మీ విధానమేంటో చెప్పాలి కదా !
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఉపాధి అవకాశాల పెంపునకు అనుబంధ రంగాలే కీలకం. నిరుద్యోగితను తగ్గించడానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనే ప్రధానం. దీనికి సంబంధించి జనసేన ఎలాంటి కార్యాచరణను అమలు చేస్తుందనేది ఇంతవరకు చెప్పనే లేదు. యువతకు రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పారే తప్ప ఆ సొమ్ముతో వాళ్లేం చేయాలి.. ఎలా ఎదగాలి.. అందుకు ప్రభుత్వం చేపట్టే విధానమేంటనేది జనసేనాని వెల్లడించలేదు. ఉపాధి అవకాశాల పెంపునకు జనసేన ఏం చేస్తుందనేది ఇప్పటికీ ఎక్కడా చెప్పలేదు.
సీమ వెనుకబాటుతనాన్ని ఎలా పరిష్కరిస్తారు !
రాయలసీమలో వెనకబాటుతనానికి ప్రధాన కారణం భూమి కొద్ది మంది చేతుల్లో పోగుపడడమే. ప్రతీ కుటుంబానికీ భూవసతి కల్పించాలి. సాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఫ్యూడల్ శక్తుల పీచమణచడానికి ఏం చేయదల్చుకున్నారనేది ఇంతవరకు ఎక్కడా చెప్పిన దాఖలాల్లేవు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన భూ సంబంధాలపై జనసేన వైఖరేంటనేది వెల్లడించలేదు. కడప స్టీల్ ప్లాంటు విషయమై కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదు. ఈ అంశాలన్నింటిపై జనసేన పార్టీ విధానాన్ని స్పష్టం చేయాల్సిన అవసరముంది.
జనసేన పార్టీకి చిరంజీవి మద్దతునిచ్చినా చిటికెలో అధికారాన్ని కైవసం చేసుకునేంత ఏమీ లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన విధానమే పవన్‌కు అధికారం దఖలు పడుతుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఇప్పటికీ ఇంకా సినిమా గ్లామర్‌పైనే పవన్ నెట్టుకొస్తున్నారు. దాన్ని ఓట్ల రూపంలో పొందడం అంత తేలిక్కాదు. రాజకీయాలు వేరు.. సినిమా అభిమానం వేరు. పవన్ దీన్ని గమనించి సరిదిద్దుకుంటే.. ఏమో గుర్రం ఎగరవచ్చు.