“ఈసారి దర్శిలో రాజకీయం రసవత్తరం కానుంది. సీఎం జగన్ ఎవరికి టిక్కెట్ ఇస్తారో ఇప్పుడిప్పుడే తేలకపోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలో ఉంటారో లేదో చెప్పలేం. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. అధికార పార్టీ తరపున దర్శి సీటు ఎవరికి దక్కుతుందో ఇప్పుడే చెప్పలేం సార్!” అంటూ దర్శికి చెందిన ఓ జర్నలిస్టు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం అధికార ప్రతిపక్షాలకు ఎప్పుడూ ఇరకాటమే. చివరి నిమిషం దాకా ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారో ఊహించడం కష్టం. ఇటీవల మాజీ ఎమ్మెల్యే దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణకు సీఎం హాజరయ్యారు. ఆ సమయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి కనిపించలేదు. ఆయనకు ఆహ్వానం అందలేదని తెలిసింది. ఎందువల్లని సీఎం కూడా వాకబు చేయలేదు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి ఆవేదనను పట్టించుకోని అధిష్టానం
కొద్ది రోజుల క్రితం జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. సీఎం బటన్ నొక్కి పథకాలు ఇస్తుంటే సీఎంకే పేరొస్తుంది. మరి ఎమ్మెల్యేలకు పేరెలా వస్తుందని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడితే సీఎంకు నచ్చదు. అందుకే ఆయన్ని బూచేపల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించకున్నా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల నాటికి మద్దిశెట్టి పార్టీలో ఉంటారా లేదో చెప్పలేమనే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక్కడ నుంచే పోటీ చేస్తానంటున్న మాజీమంత్రి శిద్దా
రానున్న ఎన్నికల్లో దర్శి నుంచే పోటీ చేస్తానని మాజీమంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన శిద్దా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటిదాకా జిల్లాలో ఎంతోమంది నేతలు మంత్రులుగా చేశారు. శిద్దా హయాంలో జరిగిన అభివృద్ధి ప్రత్యేకం. జిల్లాలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. మొగిలి గుండాల ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది శిద్దా చొరవ వల్లే. ఒంగోలు ఆర్టీసీ బస్టాండు ఈమాత్రమైనా కనిపిస్తుందంటే అది ఆయన దృష్టిసారించడం వల్లే సాధ్యమైంది.
సీఎం ఆశీస్సులున్నాయనే ధీమాలో బూచేపల్లి
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈ దఫా పోటీ చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి అనారోగ్యం, ఇతర కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన పోటీ చేయలేనని చెప్పేశారు. అప్పటికప్పుడు వైసీపీ మద్దిశెట్టిని రంగంలోకి దించింది. తదనంతరం శివప్రసాదరెడ్డి తల్లి వెంకాయమ్మకు జడ్పీ చైర్ పర్సన్‌గా ఇచ్చారు. దీంతోనే సరిపెడతారా లేక శివప్రసాదరెడ్డికి 2024 ఎన్నికల్లో అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడే తేలే విషయం కాదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి, మాజీ మంత్రి శిద్దా కృషి చేసినా టీడీపీ ఎలా గెల్చుకోవడానికి కారణం వీళ్ల మధ్య సఖ్యత లేకపోవడం వల్లేనని వైసీపీ భావించింది. అందువల్ల ఇక్కడ పార్టీ మూడు గ్రూపులైంది. ఈ లుకలుకలను సరిదిద్దడంతోపాటు టీడీపీని ఎదుర్కొనే ధీటైన అభ్యర్థికే పార్టీ అవకాశమిస్తుంది.చివరకు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు కొత్తవాళ్లకూ అవకాశం దక్కొచ్చు. ఎన్నికలు దగ్గరపడిన తర్వాతనే ఈ సీటు ఎవరిదనేది ఓ కొలిక్కి రావొచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.