‘‘పదిహేనేళ్ల క్రితం 2జీ స్పెక్ట్రమ్ వేలంలో రూ. 60 వేల కోట్లు పలికింది. కేంద్ర టెలికం శాఖ మంత్రి ప్రైవేటు ఆపరేటర్లకు లబ్ది చేకూర్చారని కేసులు పెట్టారు. ఇదో పెద్ద కుంభకోణం అన్నారు. డీఎంకే నేతలను జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు 5జీ స్పెక్ట్రం వేలంలో లక్షన్నర కోట్లకు ముఖేష్ అంబానీ సంస్థ జియో దక్కించుకుంది. భారత ప్రభుత్వం అంచనా ప్రకారం రూ.4.75 లక్షల కోట్లు పలకాలి. ఇంత తక్కువకు కేటాయించడం బహిరంగ లూటీ కాదా!”అంటూ విశ్లేషకులు బండారు రవికుమార్ విడుదల చేసిన వీడియో సారాంశం ఇది.
ముఖేష్ అంబానీ 5జీ స్పెక్ట్రమ్‌ను దీపావళి నాడు జాతికి అంకితమిస్తారట. తప్పెట్లు తాళాలు వాయిస్తూ ప్రధాని మోడీ తన మిత్రుడి దేశభక్తిని తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 5జీ స్పెక్ట్రమ్ వేలంలో భారత ప్రభుత్వం అక్షరాలా రూ.3.25 లక్షల కోట్లను నష్టపోయింది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ! గతంలో మాదిరి ఇప్పుడు సీబీఐ, ఈడీ ఈ భారీ బహిరంగ లూటీపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు ? దీన్ని దేశభక్తి అంటారా !
5జీ స్పెక్ట్రం సేవలను ప్రజలకు అందించేందుకు ముఖేష్ అంబానీ చేసిన కృషి ఏమైనా ఉందా ! బీఎస్ఎన్ఎల్ లక్షల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ వర్క్‌ను అంబానీ వాడుకుంటారు. భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపిన ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ సిగ్నల్స్ తీసుకుంటారు. ఇంకా ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో అంబానీ పాత్ర ఎక్కడైనా ఉందా ? అసలు వేలంలో దక్కించుకున్న రూ.లక్షా 50 వేల కోట్లలో ఆయన సొంత పెట్టుబడి ఎంత ! రుణాల రూపంలో తీసుకున్న బ్యాంకుల నుంచి తీసుకున్నదెంత ?
ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న స్మార్ట్ మొబైల్స్‌తో 5జీ స్పెక్ట్రం సేవలను పొందలేరు. దీనికి అనుగుణంగా రూపొందించిన మొబైల్స్‌నే వినియోగించాలి. అంటే దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 120 కోట్ల మొబైల్స్ వినియోగదారులు కొత్తవి కొనాల్సిందే. ఈ మొబైల్స్‌ను అంబానీయే గూగుల్‌తో కలిసి మార్కెట్లోకి విడుదల చేస్తారట.
ప్రస్తుతం ఉన్న మొబైల్ కంపెనీలన్నీ మూసెయ్యాల్సిందే. మరే కంపెనీ 5జీ స్పెక్ర్టం సేవలకు కనెక్ట్ అయ్యే మొబైల్స్ తయారు చేయడానికి వీల్లేదు. ఇంత దారుణంగా ప్రజల జేబులు కొట్టేస్తుంటే ఆహా ఓహో అంటూ ప్రభుత్వ పెద్దలు కీర్తించడం దారుణం. జనం కళ్లు తెరవకుంటే ఈ కుహనా దేశభక్తులు ప్రజల సార్వభౌమాధికారాన్నే కార్పొరేట్లకు అమ్మేస్తారు. తస్మాత్ జాగ్రత్త.