కేసీఆర్ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిపై ఏపీలో ఎన్నో అపోహలు.. అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీని కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిష్కరించినట్లు కేసీఆర్ ఈపాటికే స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ఓ స్పష్టతనివ్వకుండా ఇక్కడ మద్దతు సాధించడం కష్టం. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీల్లో కాంగ్రెస్ లేకుండా ఊహించలేం. రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ బలోపేతమవుతున్న సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించడం అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పాత్రలా పోషించడానికేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేస్తుందని కేసీఆర్ వెల్లడించారు. మూడు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి భారీగా వలసలు వస్తాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఆయన ఊహించనట్లు జరగాలంటే పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల సొమ్ము చెల్లించాలి. గోదావరి, కృష్ణా జలాల వివాదాలపై విస్పష్టమైన ప్రకటన చేయాలి. ఉమ్మడి ఆస్తుల పంపకంపై క్లారిటీ ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయా పార్టీల్లోని అసంతృప్తి నేతలు బీఆర్ఎస్లో చేరే అవకాశాల్లేవు.
కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీ కొట్టగలరా !
ఇక జాతీయంగా బీజేపీని ఢీ కొడుతున్న వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. ఆ పార్టీ నేతలపై కేంద్ర పెద్దలు ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోంది. బీహార్లో నితీష్తోపాటు తేజస్వి యాదవ్ బీజేపీని ఎదుర్కోవడానికి సిద్దమయ్యారు. తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ అసలు బీజేపీకి స్థానమే లేకుండా చేశారు.
కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. పశ్చిమ బెంగాల్లో మమత, ఒడిశాలో నవీన్ పట్నాయక్, యూపీలో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రలో ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలకు కేసీఆర్ బీఆర్ఎస్ గండికొడుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బీఆర్ఎస్పై ఏపీ ప్రధాన పార్టీలు మౌనం
కేసీఆర్ జాతీయ పార్టీపై ఏపీలో వైసీపీ వ్యూహాత్మక మౌనం వహించింది. అది కేసీఆర్ సొంత వ్యవహారం. బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకోవడం ఆయన ఇష్టం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించారు. ఇక ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందనైతే ఓ చిర్నవ్వుతో సరిపెట్టారు. జనసేన నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఈ దఫా ఎన్నికల్లో గట్టెక్కించడానికేనన్నట్లు విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. కమలనాధులను వ్యతిరేకించే వారితో బీఆర్ఎస్ కలిసి పోరాడుతుందా లేక ఎంఐఎంలాంటి పాత్ర పోషిస్తుందా అనేది ఆ పార్టీ నిర్ణయాలను బట్టి ఉంటుంది.