“టిడ్కో ఇళ్లు.. ఇళ్ల స్థలాల లబ్దిదారులు చాలా ఆందోళనలో ఉన్నారు. టీడీపీ వాళ్లు కోర్టులో వేసి నిలిపించేశారని మా నాయకులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరిస్తే కదా వాళ్లంతా ఓట్లేసేది. ఇంకా ప్రతిపక్షం చేసిందని ఎన్నాళ్లు చెబుతారు ! వాళ్ల హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ మాకు ఇబ్బందులు తెచ్చి పెట్టేట్లున్నాయి సార్ ! ” అంటూ ఒంగోలుకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త వాపోయాడు. ఇవన్నీ క్లియర్ చేస్తే మళ్లీ మా వాసన్న గెలుపునకు తిరుగులేదనే ధీమా వ్యక్తం చేశాడు.
సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో ప్రధానమైంది పేదల గృహ నిర్మాణం. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అడుగు ముందుకు పడడం లేదు. దాదాపు 24 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు యరజర్ల వద్ద లే అవుట్ వేశారు. కొండను చదును చేయడానికి రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. తీరా పట్టాలు పంపిణీ చేద్దామనుకునే సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. సదరు భూమిని గతంలో ఖుద్రేముఖ్ ఐరన్ వోర్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఇక్కడ ఐరన్ తవ్వకం లాభసాటి కాదని కంపెనీ వెనకడుగు వేసింది.
ఎంతకాలం టీడీపీనే బూచిగా చూపిస్తారు !
అప్పటి నుంచి లీజు రద్దు చేయలేదు. ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి భూమిలో లే అవుట్ వేసింది. దీనిపై మోహన్ రావు అనే టీడీపీ కార్యకర్త హైకోర్టులో పిటిషన్ వేయడంతో పట్టాల పంపిణీ నిల్చిపోయింది. ఇది పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం తప్పిదం. జిల్లా కలెక్టరు నుంచి కింది స్థాయి అధికారి దాకా ఏ ఒక్కరిపై చర్యల్లేవు. సీఎం జగన్ అసెంబ్లీలో టీడీపీ కార్యకర్త పేరు చెబుతూ ఆ పార్టీ తీరును ఎండగట్టారు. నేటికీ టీడీపీనే బద్నాం చేస్తున్నారు.
తర్వాత నాటి కలెక్టరు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అనుకూలమేనని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోయేది. ఆ పని ఇప్పటిదాకా చేయలేదు. ఈ వివాదం కోర్టు పెండింగ్‌లోనే ఉంది. ఎప్పటికి క్లియర్ అవుతుందో తెలియకున్నా లబ్దిదారుల్లో అసంతృప్తిని తగ్గించడానికి ఇంటి స్థలం మంజూరు పత్రాలు ఇచ్చారు. కోర్టు క్లియరెన్స్ వచ్చాక పట్టాలు ఇస్తామని సంతృప్తి పరిచారు. ఇప్పటికి రెండేళ్లు కావొస్తోంది. సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. పట్టాలు ఎప్పుడిస్తారో తెలీదు. ఈలోగా ఎన్నికలు రావొచ్చు.
పూర్తయిన టిడ్కో ఇళ్లూ ఇవ్వడం లేదు
అలాగే గత ప్రభుత్వ హయాంలో చింతల వద్ద మొదటి విడత సుమారు టిడ్కో 1500 ఇళ్లు నిర్మించారు. దాదాపుగా నిర్మాణం పూర్తయింది. అయినా ఇప్పటికీ లబ్దిదారులకు ఇవ్వలేదు. కొప్పోలు సమీపంలో రెండో విడత దాదాపు 2,500 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సగం పనులు పూర్తికాగానే ప్రభుత్వం మారిపోయింది. పనులు నిల్చిపోయాయి. వాటా డబ్బు చెల్లించిన లబ్దిదారులు అయోమయంలో పడిపోయారు.
గత ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్కారు ఓ సర్వే చేసింది. అర్బన్‌లో 45 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం ప్రజలకు సొంతిళ్లు లేవని తేల్చింది. అందుకే పెద్ద ఎత్తున కేంద్రం ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల ఏడాది వరకు తాత్సారం చేసి చివర్లో నిర్మాణాలు మొదలు పెట్టింది. దీంతో నాలుగు వేల మంది లబ్దిదారులు ఆక్రోశిస్తున్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని వాపోతున్నారు.
అధికార ప్రతిపక్ష అభ్యర్థుల తలరాతలు మార్చేది లబ్దిదారులే
కనీసం రానున్న ఎన్నికల్లోపు టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలి. కొత్తగా మంజూరు చేసిన వారికి కనీసం ఇళ్ల పట్టాలైనా ఇవ్వాలి. అధికార పార్టీ నేతల్లో ఆ చొరవ కనిపించడం లేదు. దీన్ని ఎన్నికల ఎత్తుడగా వాడుకుందామని భావిస్తే వైసీపీ లేదా టీడీపీ అభ్యర్థుల దారుణ ఓటమికి దారితీయొచ్చు. 24 వేల మందికి ఇళ్ల పట్టాలు దక్కకుండా టీడీపీ కోర్టుకెళ్లి అడ్డుకుందని వైసీపీ ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తే.. ఒంగోలులో పోటీ చేసే బాలినేని శ్రీనివాసరెడ్డి విజయదుందుభి మోగిస్తారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మరోచోట ఎందుకివ్వకూడదు ? టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఎందుకివ్వడం లేదంటూ టీడీపీ ప్రచారాన్ని నమ్మితే ఇక్కడ బరిలో నిలిచే దామచర్ల జనార్దన్ తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల లబ్దిదారుల ఓట్లే సుమారు లక్ష దాకా ఉంటాయి. వీళ్లే అధికార ప్రతిపక్షాల జాతకాలను తిరగరాస్తారు. ఈలోగా ఎమ్మెల్యే బాలినేని చొరవ చూపిస్తారా.. సమస్యను ఎన్నికల ఎత్తుగడగా వాడతారా అనేది వేచి చూడాల్సిందే.