“ఈరోజుల్లో అంత పిచ్చోళ్లు ఎవరున్నారు సార్ ! ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయలేదు. విశాఖ ఉక్కు కోసం చేయలేదు. రైల్వే జోన్ కోసం చేయలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కోసం కూడా రాజీనామా చేయలేదు. ఇప్పుడేదో విశాఖలో కార్యనిర్వాహక రాజధానితో అభివృద్ధి జరిగిపోతుందనే భ్రమలు సృష్టించాలనుకుంటున్నారు. రాజీనామాలు చేయడంలో చిత్తశుద్ది ఏదీ ? వికేంద్రీకరణ జేఏసీకి సమర్పించి ప్రయోజనమేంటీ ! ” అంటూ విశాఖ కార్పొరేటర్ డాక్టర్ బీ గంగారామ్ వ్యక్తం చేశారు.
రాజధాని వికేంద్రీకరణ జేఏసీని వైసీపీ ఏర్పాటు చేసింది. దానికో కార్యాచరణను నిర్దేశించింది. నిన్నంతా ర్యాలీలు చేశారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా పత్రాన్ని జేఏసీకి అందించారు. భీమిలి ఎమ్మల్యే ముత్తంశెట్టి కూడా రాజీనామా చేస్తామన్నారు. ఇంకా అటు ధర్మాన ప్రసాదరావు, ఇటు గ్రంధి శ్రీనివాస్ కూడా రాజీనామాలకు వెనుకాడేది లేదని ప్రకటించారు. వికేంద్రీకరణ సెంటిమెంటు రగిల్చి విపక్షాలకు వాయిస్ లేకుండా చేయాలనేది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.
అసెంబ్లీలో బిల్లు ఎందుకు పెట్టలేదు !
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఎందుకు పెట్టలేదో వెల్లడించలేదు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా వికేంద్రీకరణ జేఏసీ ఆందోళన చేస్తుంది ? బిల్లు పెట్టని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానా.. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చేస్తుందా ! రాష్ట్ర విభజన గెజిట్లో మార్పు చేయాలని కోరుతూ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుందా! లేక అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా జేఏసీ పనిచేస్తుందా అనే బోలెడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనేది కూడా స్పష్టత లేదు. అధికార వైసీపీ వీటిని నివృత్తి చేయకుండా ఉత్తరాంధ్రలో భావోద్వేగాలు ఎలా పుట్టుకొస్తాయో మరి.
మూడు రాజధానులపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశించింది. దానిపై సుప్రీం కోర్టుకు వెళ్తే హైకోర్టులోనే తేల్చుకోవాలని వక్కాణించింది. హైకోర్టు తీర్పునకు ముందే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. లోపాలను సరిదిద్ది మళ్లీ బిల్లు పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. బిల్లు పెట్టనే లేదు.
జనసేనాని స్పందనలో మార్పు ఉంటుందా !
ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా మూడు రాజధానుల అంశంపై ఆ పార్టీ వర్గాలు స్పందించలేదు. అనుకూలమంటారా లేదా వ్యతిరేకిస్తున్నామంటారా లేక వ్యూహాత్మక మౌనం వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. వైసీపీ ఎత్తుగడకు పవన్ పై ఎత్తులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈపాటికే టీడీపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీతో సహా అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. ఉత్తరాంధ్రలో ప్రభావం చూపే జనసేన గత నిర్ణయానికే కట్టుబడుతుందా.. భిన్నంగా స్పందిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.