“ అన్నా ! అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా.. లేక మూడు రాజధానులు చేస్తారా ! పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి భూమి కొన్నానన్నా. రేట్లు పడిపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఏం జరుగుతుందో కొంచెం చెప్పండన్నా !” ఉదయాన్నే ఈ ఫోన్ కాల్‌తో నిద్ర మత్తు వదిలింది. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూమి రేట్లు పడిపోతే కొంపాగోడు అమ్మినా అప్పులు తీరవని మిత్రుడు వాపోయాడు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని చుట్టూ దేశ విదేశాల్లో ఉన్న ఎందరో భూములు కొన్నారు. దాచుకున్న సొమ్ముకు అదనంగా అప్పులు చేశారు. మూడు రాజధానులంటే ఉలిక్కి పడుతున్నారు. అసలు అమరావతి రాజధానితో ప్రజలకు ఉన్న లింకు ఏపాటిదో పరిశీలిస్తే..
ఎప్పుడైతే చంద్రబాబు సర్కారు అమరావతి రాజధానికి అంకురార్పణ చేసిందో.. ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు సంచులతో దిగిపోయారు. తాహతుకు మించి రాజధాని పరిసరాల్లో అధిక ధరలకు భూమలు కొనుగోలు చేశారు. సహజంగా భూమిపై పెట్టుబడి పెడితే బంగారు బాతు గుడ్డు లాంటిదేననే విశ్వాసం. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా దీనికి సమ్మతించడంతో అప్పులు చేసి మరీ శక్తిమేరకు భూములు కొనుగోలు చేశారు. జై జగనంటూ రాజధాని పరిసర నియోజకవర్గాల్లో వైసీపీకి తిరుగులేని ఆధిక్యతనిచ్చారు.
మూడు రాజధానుల ఎత్తుగడ ఫలించేనా !
ఇప్పడు రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టడానికి వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెర పైకి తెచ్చింది. దీనిపై న్యాయస్థానాలు సైతం మొట్టికాయలు వేయడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. సంక్షేమ పథకాలతోనే మళ్లీ ఎన్నికలను గట్టెక్కవచ్చనే ఆలోచన మొదటికే మోసమైంది. విభజిత రాష్ట్రంలో ఆర్థిక సమస్యలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన ఫలితంగా వైసీపీ ప్రభుత్వం కింద మంటలు రేగాయి. వీటి నుంచి బయటపడే మార్గం లేక ప్రజల్లో ఏదో రకంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలని భావించినట్లుంది.
అనుకున్నదే తడవుగా అమరావతి రాజధాని పనులను ఆపేసింది. అది ఓ స్మశానమని ఆక్షేపించింది. పది లక్షల కోట్లు ఖర్చవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పులు.. ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు పెడితే మిగతా రాష్ట్రమంతా ఏం కావాలని జనాన్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టింది. హైదరాబాద్‌ను వదులుకున్నట్లే రేపు అమరావతిని వదిలేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అమరావతి రాజధాని కేవలం 29 గ్రామాలకే పరిమితమంటూ ఎన్నో ప్రచారాలను తెరపైకి తెచ్చింది. ఇవన్నీ ఎన్నికల ముందు తెలియదా ! ఆనాడు ఓట్ల కోసం తలూపి ఇప్పుడు కాదంటే ప్రజలు ఏమనుకుంటారనే ఇంగితాన్నీ వైసీపీ నేతలు మరిచారు.
రాజధాని రైతుల ఉద్యమం ప్రతిపక్ష టీడీపీకి ఊపిరి పోసింది
ఎప్పుడైతే ప్రతిపక్ష టీడీపీని దెబ్బ కొట్డడానికి మూడు రాజధానుల పల్లవి అందుకున్నారో.. రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్లు, వాటిని కొని పూలింగ్ కు ఇచ్చిన వ్యాపారుల అండతో ఆందోళన మొదలైంది. దాదాపు రెండేళ్లకు పైగా అనేక రూపాల్లో ఉద్యమిస్తున్నారు. అమరావతి నుంచి తిరుపతి పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రతీ జిల్లాలో యాత్రకు మంచి స్పందన లభించింది. రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసిన వాళ్లంతా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి నీరాజనాలు పలికారు. వాళ్లకు మద్దతుగా ఆయా గ్రామాల నుంచి ప్రజలు హారతులు పట్టారు.
ప్రస్తుతం అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్రకూ అంతే స్పందన వస్తోంది. దేశ విదేశాల్లో స్థిర పడిన కమ్మ సామాజిక వర్గం పెట్టుబడులన్నీ అమరావతి రాజధాని ప్రాంతంలోని భూముల్లో ఉన్నాయి. ప్రతీ జిల్లాలో కమ్మ సామాజిక వర్గం పెత్తనం చేసే చోటల్లా యాత్రకు సహకరిస్తున్నారు. ఈ యాత్రను వెనుక నుంచి నడిపిస్తోంది టీడీపీ అని ప్రభుత్వానికి తెలుసు. అయినా వైసీపీ సర్కారు పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మూడు రాజధానుల అంశాన్ని తీవ్రం చేస్తోంది. వికేంద్రీకరణ జేఏసీ పేరుతో 15న విశాఖలో గర్జనకు పిలుపునిచ్చింది.
ప్రజలను గందరగోళంలోకి నెడితే ప్రయోజనమేంటీ !
వికేంద్రీకరణ జేఏసీ డిమాండ్ మూడు రాజధానులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది. ప్రభుత్వంలో ఉన్నది వైసీపీ. జేఏసీ ఏర్పాటు చేసింది కూడా వైసీపీ నేతలే. మరి జేఏసీ కోరినట్లు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. కానీ పెట్టలేదు. హైకోర్టు ఈపాటికే కుదరదని తేల్చేసింది. ఇప్పుడు జేఏసీ హైకోర్టును డిమాండ్ చేస్తుందా.. జగన్ సర్కారునా.. లేక కేంద్రాన్ని అడుగుతుందా ! ఇన్ని గందరగోళాల్లోకి ప్రజలను నెట్టేస్తే.. అధికార పార్టీ ఆశించిన భావోద్వేగానికి ప్రజలు గురి కాకపోవచ్చు. అంతిమంగా ప్రజల స్పందన ఎలా ఉంటుందనేది ఈపాటికే వైసీపీ, టీడీపీకి అర్థమై ఉండొచ్చు.