నాద ముద్రలు • వాద్యాల వెనుక కథలు

ఘటం పాడిన గీతిక

సంగీత సంస్కృతికి మట్టితో మలిచిన ఒక జీవంతమైన చరిత్ర

ఒకవైపు ఘటం, మరోవైపు వరండాలో మాట్లాడుకుంటున్న శ్రీ అమ్మమ్మ, సిరి, బాలా అమ్మమ్మ - వాటర్ కలర్ శైలి
చల్లని సాయంత్రపు గాలిలో... మట్టి వాద్యం వెనుక ఉన్న సంగీత చరిత్రను ఆవిష్కరిస్తున్న వేళ.
సాయంత్రం. వరండాలో చల్లని గాలి వీస్తోంది. తులసి కోట పక్కన కూర్చొని శ్రీ అమ్మమ్మ ఒక పుస్తకం చదువుతోంది. సంగీత సాధన ముగించుకుని సిరి తన వీణను లోపల పెట్టి బయటకు వచ్చింది.
సిరి:
"అమ్మమ్మా... ఏం పుస్తకం చదువుతున్నారు? చాలా లీనమై చదువుతున్నారు."
శ్రీ అమ్మమ్మ:
"ఇది చాలా ప్రత్యేకమైన పుస్తకం రా. నా స్నేహితురాలు బాలా అనువదిస్తున్న పుస్తకం. అసలు పేరు Song of the Clay Pot. తెలుగులో "ఘటం పాడిన గీతిక" అని పేరు పెట్టింది."
సిరి:
"ఘటం గురించిన పుస్తకమా? ఒక వాద్యం గురించి ఇంత పెద్ద పుస్తకమా?"
శ్రీ అమ్మమ్మ:
"అదే దీని ప్రత్యేకత. మనం కచేరీల్లో చూసే ఘటం వెనుక ఎంత గొప్ప చరిత్ర ఉందో ఈ పుస్తకం చెబుతుంది."

అంతలో గేటు దగ్గర నుంచి బాలా అమ్మమ్మ వచ్చింది.

శ్రీ అమ్మమ్మ:
"అరే బాలా... నీ గురించే ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. రా... సిరికి నీ పుస్తకం గురించి నువ్వే చెప్పు."
బాలా అమ్మమ్మ:
(నవ్వుతూ) "అలాగా? సరే... ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు సిరి?"
సిరి:
"ముందు ఈ పేరే చెప్పండి అమ్మమ్మా. ఘటం పాడిన గీతిక... చాలా అందంగా ఉంది."
బాలా అమ్మమ్మ:
"అసలు పుస్తకం పేరు Song of the Clay Pot. దాన్ని తెలుగులోకి అనువదిస్తుంటే, "ఘటం పాడిన గీతిక" అనే పేరు పెట్టాను. ఘటం కూడా పాడుతుందా అనిపిస్తుంది కదా! కానీ దానిలోంచి వచ్చే మధురమైన నాదమే ఆ గీతిక."
సిరి:
"ఈ పుస్తకంలో ఏముంటుంది?"
బాలా అమ్మమ్మ:
"ఘటం చరిత్ర... దాని పరిణామం... దాన్ని తయారు చేసే కళాకారులు... సంగీతంలో దాని స్థానం... ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. తెలుసా... ఒకప్పుడు వీణ కచేరీల్లో మృదంగం కూడా ఉండేది కాదు."
సిరి:
"ఏంటి? మృదంగం లేకుండానా?"
బాలా అమ్మమ్మ:
"అవును. ముఖ్యంగా వీణకు ఘటమే తోడుగా ఉండేది. కొన్ని కచేరీల్లో వీణతో పాటు ఘటం మాత్రమే వాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి."
సిరి:
"అలా ఎందుకు?"
బాలా అమ్మమ్మ:
"వీణ నాదం చాలా మృదువుగా ఉంటుంది. మృదంగం కొన్నిసార్లు గట్టిగా వినిపిస్తుంది. మంచి విద్వాంసులు అయితే మృదంగాన్ని కూడా ఎంతో మృదువుగా వాయిస్తారు. కానీ సాధారణంగా ఘటం ఇచ్చే నాదం వీణకు చాలా సహజంగా, మధురంగా సరిపోతుంది. ఎలాగైతే నాగస్వరానికి తవిల్ సరిపోతుందో... అలాగే వీణకు ఘటం."
సిరి:
"అయితే తర్వాత ఘటం ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది?"
బాలా అమ్మమ్మ:
"కాలం మారింది. కచేరీల రూపం మారింది. మృదంగం ప్రధాన లయ వాద్యంగా మారింది. ఘటాన్ని "ఉప పక్క వాద్యం" అని పిలవడం మొదలుపెట్టారు. అలా పిలవడం వల్ల దానికి రెండో స్థానమనే భావన ఏర్పడింది. నిజానికి ఘటానికి తనకంటూ స్వతంత్ర స్థానం ఉంది."
సిరి:
"ఘటాలు ఎక్కడ తయారు చేస్తారు?"
బాలా అమ్మమ్మ:
"ఒకప్పుడు కర్ణాటకలో దేవనహళ్లి, తమిళనాడులో మన్మదురై ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఘటాలు తయారయ్యేవి. ఇప్పుడు దేవనహళ్లి అంటే మనకు విమానాశ్రయం గుర్తుకొస్తుంది. కానీ ఒకప్పుడు అక్కడే ఘటం తయారు చేసే కుటుంబాలు ఉండేవి. తర్వాత వాళ్లు చాలామంది తమిళనాడుకు వెళ్లిపోయారు."
సిరి:
"మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయరా?"
బాలా అమ్మమ్మ:
"దాదాపు లేరు. మనకు ఘటం కావాలంటే ఇప్పటికీ ఎక్కువగా తమిళనాడి నుంచే తెప్పించుకోవాలి. వీణలు మాత్రం బొబ్బిలి, నూజివీడు, విజయనగరం ప్రాంతాల్లో తయారవుతున్నాయి. కానీ లయ వాద్యాల తయారీలో మనం వెనుకబడ్డాం."

కొద్దిసేపు ఆగి సిరి మరో ప్రశ్న అడిగింది.

సిరి:
"అమ్మమ్మా... అసలు ఘటం ఎక్కడ పుట్టింది?"
బాలా అమ్మమ్మ:
"దాని వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. పదమూడో శతాబ్దంలో కశ్మీర్‌లో సారంగదేవుడు అనే గొప్ప సంగీత పండితుడు ఉండేవాడు. ఆయనే తర్వాత సంగీత రత్నాకరం రచించాడు. ఆ కాలంలో కశ్మీర్‌లో ఒక విచిత్రమైన అలవాటు ఉండేదట. ఎవరైనా బట్టతల కనిపిస్తే, దానిమీద మధ్యల వాయించినట్టు తాళం వేస్తూ సరదాగా పాటలు పాడేవారట."
సిరి:
(నవ్వుతూ) "నిజంగానా?"
బాలా అమ్మమ్మ:
"అవును. కానీ ఒక వ్యక్తికి అది చాలా ఇబ్బందిగా అనిపించింది. రాజు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రాజు ఆలోచించాడు. ఒకవైపు ప్రజల ఆనందం... మరోవైపు ఒక వ్యక్తి ఇబ్బంది. అప్పుడు సంగీత విద్వాంసులను పిలిచి,"
"తలలాగే గుండ్రంగా ఉండి, మంచి నాదం వచ్చే ఒక వాద్యాన్ని తయారు చేయండి"
"అని చెప్పాడు. అప్పుడు వాళ్లు మంచి నీళ్ల కుండను ఆధారంగా తీసుకుని ప్రత్యేకమైన మట్టి వాద్యాన్ని తయారు చేశారు. దానికి అక్కడ "నూట్" (Noote) అని పేరు. ఆ తర్వాత అది కశ్మీరీ జానపద సంగీతంలో భాగమైంది."
సిరి:
"అయితే "ఘటం" అనే పేరు ఎలా వచ్చింది?"
బాలా అమ్మమ్మ:
"తర్వాత జరిగిన దండయాత్రల సమయంలో సారంగదేవుడితో పాటు చాలామంది దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆ వాద్యం కూడా ఇక్కడికి వచ్చింది. మన భాషలో కుండను "ఘటం" అంటాం. సంస్కృతంలో కూడా అదే పదం ఉంది. అలా "నూట్" అనే పేరు క్రమంగా "ఘటం"గా మారిపోయింది."
సిరి:
"ఇప్పుడు ప్రతి ఘటం ఒకేలా ఉంటుందా?"
బాలా అమ్మమ్మ:
"కాదు. మొదట్లో ఘటానికి ప్రత్యేకమైన శృతి ఉండేది కాదు. ఏ మట్టి కుండ దొరికితే దానిపైనే వాయించేవారు. ఉంగరం లేదా నాణెంతో కొడితే వచ్చే నాదాన్ని ఉపయోగించేవారు. కానీ గత యాభై, అరవై ఏళ్లలో పెద్ద మార్పు వచ్చింది. మన్మదురై, దేవనహళ్లి ప్రాంతాల్లోని కుమ్మరులు, సంగీత విద్వాంసులు కలిసి పరిశోధనలు చేశారు. ఇప్పుడు ప్రతి శృతికి ప్రత్యేకంగా ఘటాలు తయారవుతున్నాయి."
సిరి:
"అంటే గాయకుడు ఏ శృతిలో పాడతాడో దానికి తగ్గ ఘటాన్ని ఎంచుకుంటారా?"
బాలా అమ్మమ్మ:
"అవును. అందుకే ఇప్పుడు కచేరీ మొదలయ్యే ముందు ఘట విద్వాంసుడు ముందుగా, "సార్... ఏ శృతి?" అని అడుగుతాడు. గాయకుడు B, C, 5, 5½, 6... ఏ శృతి చెబితే, దానికి సరిపోయే ఘటాన్నే తీసుకుంటాడు. పాత రోజుల్లో అయితే సరిపోయే శృతి కోసం కుండలో ఎక్కడ కొడితే ఆ స్వరం వస్తుందో వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు."
సిరి:
"అమ్మమ్మా... నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మనకు కనిపించేది ఒక సాధారణ మట్టి కుండ మాత్రమే. కానీ దాని వెనుక చరిత్ర ఉంది... కళ ఉంది... శాస్త్రం ఉంది... ఎంతోమంది కళాకారుల జీవితం ఉంది."
బాలా అమ్మమ్మ:
"అదే ఈ పుస్తకం చెప్పాలనుకుంటోంది సిరి. ఘటం కేవలం ఒక వాద్యం కాదు... మన సంగీత సంస్కృతికి మట్టితో మలిచిన ఒక జీవంతమైన చరిత్ర."

శ్రీ అమ్మమ్మ చిరునవ్వుతో పుస్తకాన్ని మూసింది.

శ్రీ అమ్మమ్మ:
"అందుకే బాలా ఈ పుస్తకానికి "ఘటం పాడిన గీతిక" అనే పేరు పెట్టింది. వినడం తెలిసినవాళ్లకు... ఘటం నిజంగానే పాడుతుంది."

వినడం తెలిసినవాళ్లకు...
ఘటం నిజంగానే పాడుతుంది.