జయహో భారతం • మన ఘనత

భవిష్యత్తుకు నాంది

కల్పక్కం ఆవిష్కారం... దేశ భవిష్యత్తుకు ఒక కొత్త ఆశాకిరణం

రాత్రిపూట ఆఫీస్ రూమ్‌లో లాప్‌టాప్ ముందు పృథ్వి, తలుపు చాటుగా జై
నిశ్శబ్దమైన రాత్రి... లాప్‌టాప్ వెలుతురులో దేశపు భవిష్యత్తును చర్చిస్తున్న వేళ.
నిశ్శబ్దమైన రాత్రి సమయం...
పృథ్వి తన ఆఫీస్ రూమ్‌లో Laptop ముందు కూర్చుని, ఏదో లోతైన పనిలో నిమగ్నమై ఉన్నాడు.
జై తలుపు చాటుగా వచ్చి, తన పెద్దనాన్ననే కాసేపు ఆసక్తిగా గమనించసాగాడు.
జై: (మెల్లగా లోపలికి అడుగుపెడుతూ)
“పెద్దనాన్నా...” (అని ఆప్యాయంగా పిలిచాడు)
పృథ్వి: (Laptop స్క్రీన్ పైనుంచి చూపు తిప్పకుండానే)
“ఉమ్.. చెప్పు జై,”
జై:
“ఏంటి.. ఇంకా అంత సీరియస్‌గా Laptop లో ఏదో చేసుకుంటున్నావు? మర్చిపోయావా?”
పృథ్వి: (Laptop నుంచి తల పైకెత్తి చూసి)
“ఏంటిరా?” (అన్నాడు అయోమయంగా)
జై:
“ఈరోజు స్టోరీ టైమ్ కదా!”
పృథ్వి: (విషయం గుర్తొచ్చి, చిరునవ్వుతో)
“అయ్యో... అవును కదా! సరే, మరి ఏ కథ చెప్పుకుందాం?” (అన్నాడు Laptop స్క్రీన్ వైపు చూస్తూనే)

జై ఆసక్తిగా పృథ్వి వైపు చూశాడు. పృథ్వి Laptop మూసేసి జై వైపు పూర్తిగా తిరిగాడు.

పృథ్వి:
“కథ కాదు కానీ, ఇవాళ నీకో అద్భుతమైన విషయం చెప్తాను. కల్పక్కంలో జరిగిన ఒక గొప్ప ఆవిష్కారం గురించి.”
జై: (కళ్లు పెద్దవి చేసి)
“కల్పక్కమా? అంటే ఏంటి పెద్దనాన్నా?”
పృథ్వి:
“అది మన దేశంలో ఉన్న ఒక ఊరి పేరు. అక్కడ జరిగిన విషయం చెప్పే ముందు... అసలు నీకు ఎన్ని రకాల శక్తులు... అంటే ఎనర్జీల గురించి తెలుసు?”
జై కాస్త ఆలోచిస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.
జై: (ఉత్సాహంగా)
“నాకు తెలుసు! మన ఇంట్లో ఫ్యాన్, లైట్ తిరగడానికి వాడే కరెంట్... దాన్ని Electrical Energy అంటారు. సూర్యుడి నుంచి వచ్చే వేడిని పట్టుకునే Solar Energy తెలుసు... గాలి కొండల దగ్గర పెద్ద ఫ్యాన్లు తిరుగుతాయే... అది Wind Energy !”
పృథ్వి: (నవ్వి)
“వెరీ గుడ్! చాలా బాగా చెప్పావు. మరి 'Nuclear Energy' గురించి ఎప్పుడైనా విన్నావా?”
జై అయోమయంగా తల అడ్డంగా ఊపాడు.
పృథ్వి:
“అదొక అద్భుతమైన శక్తి. చాలా అంటే చాలా చిన్న పదార్థం నుంచి ఎంతో పెద్ద మొత్తంలో కరెంటుని తయారు చేయొచ్చు. మన దేశంలో ఈ కల్పక్కం అనే చోట అలాంటి కరెంటు తయారు చేసే పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. వాటిని 'Reactors' అంటారు.”

జై ఎంతో ఆశ్చర్యంగా వింటున్నాడు.

పృథ్వి:
“కానీ అందులో ఒక చిన్న సమస్య ఉంది. ఆ కరెంటు తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన Fuel కావాలి. అది మన దేశంలో చాలా తక్కువగా ఉంది. మరి దాన్ని వృథా చేయకుండా ఎలా వాడుకోవాలో మన Scientists ఎప్పటి నుంచో పరిశోధన చేస్తున్నారు.”
జై: (కుతూహలంగా)
“ఏం చేస్తున్నారు?”
పృథ్వి:
“వాళ్లు ‘Fast Breeder Reactor’ అనే ఒక కొత్త మిషన్‌ను తయారు చేశారు. మామూలుగా అయితే Reactor లో ఇంధనం మండిపోయి కరెంటు వస్తుంది, ఆ తర్వాత ఆ ఇంధనం అయిపోతుంది. కానీ ఈ కొత్త Reactor లో అలా జరగదు. ఇందులో కాలిపోయే ఇంధనం చుట్టూ వేరే మెటీరియల్‌ను ఉంచుతారు. అప్పుడు లోపల జరిగే Nuclear Reaction వల్ల, మనం ఇంధనాన్ని వాడే కొద్దీ... అందులోంచి మళ్లీ కొత్తగా ఇంధనం పుట్టుకొస్తుంది. దాన్నే Fissile Material అంటారు.”

జై కి Reaction... Fissile... Breeder... ఈ పెద్ద పెద్ద పదాలేవీ బుర్రకి ఎక్కలేదు.

జై: (అయోమయంగా తలగోక్కుంటూ)
“ఒక్క నిమిషం పెద్దనాన్నా... నువ్వేదో పెద్ద Science Class చెప్పినట్టు చెప్పావు. కరెంటు రావడం, అందులోంచే మళ్ళీ Fuel పుట్టడం... నాకైతే ఏమీ అర్థం కాలేదు.”
పృథ్వి: (చిన్నగా నవ్వి)
“సరే సరే... నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గర మంచి రకం విత్తనం ఒకటుందనుకో...”
జై మళ్ళీ ఆసక్తిగా తల ఊపాడు.
పృథ్వి:
“ఆ రైతు ఆ విత్తనంతో చక్కటి పంట పండిస్తాడు. కానీ అక్కడితో ఆగిపోడు. ఆ వచ్చిన పంటలోంచి మళ్లీ కొన్ని మంచి విత్తనాలను జాగ్రత్తగా దాచుకుని, వాటితో ఇంకో కొత్త పంట పండిస్తాడు. అవునా?”
జై:
“హ్మ్... అవును,”
పృథ్వి:
“మన దేశపు Scientists కూడా ఈ Nuclear Energy విషయంలో సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. మన దగ్గర ఉన్న కొంచెం ఇంధనాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడం వాళ్ల లక్ష్యం. అందుకే వాళ్లు తయారుచేసిన ఆ కొత్త మిషన్... ఆ ఉన్న కొంచెం ఇంధనాన్ని వాడుకుంటూ కరెంటు ఇస్తూనే... లోపల కొత్త ఇంధనాన్ని కూడా తయారు చేస్తుంది! అంటే పాత విత్తనంతో కొత్త విత్తనాలు వచ్చినట్టు అన్నమాట!”

జై ముఖంలో ఇప్పుడు మెల్లగా అర్థమవుతున్న భావన, ఆశ్చర్యం ఒకేసారి కనిపించాయి.

పృథ్వి:
“అంతే కాదు. ఈ మిషన్లు పనిచేస్తున్నప్పుడు లోపల చాలా వేడి పుడుతుంది కదా... ఆ వేడిని గాలికి వృథాగా పోనివ్వకుండా, దాన్ని ఉపయోగించి 'Hydrogen' అనే ఇంకో రకమైన ఇంధనాన్ని తయారు చేయడం కూడా మన వాళ్లు సాధించారు.”
జై: (ఉత్సాహంగా తల ఊపుతూ)
“ఓహో! అంటే... మన Scientists మనకున్న దాన్ని ఏమాత్రం వృథా చేయకుండా, ఇంకా బాగా ఉపయోగపడేలా కొత్తగా ఏదో సృష్టిస్తున్నారన్నమాట!”
పృథ్వి:
“అంతే కదా మరి!”
జై: (కాసేపు ఆలోచనలో పడి)
“పెద్దనాన్నా... ఇదంతా మన Scientists స్వయంగా చేశారా?”
పృథ్వి:
“అవును జై ! మన శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ఈ పరిశోధనల కోసం అహర్నిశలూ కష్టపడుతున్నారు. నిజానికి మనం మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు దీని మీద పని చేశాయి. చేస్తున్నాయి. ఎవరి ప్రయాణం వాళ్లది. కానీ, మనం మాత్రం ఎక్కడా ఆగకుండా మన పరిశోధనలను కొనసాగిస్తూ, ఇప్పుడు మరో అద్భుతమైన అడుగు ముందుకు వేశాం.”

ఆ మాటలకు జై కళ్లలో చెప్పలేనంత ఆనందం, ఉత్సాహం ఉప్పొంగాయి.

జై: (గట్టిగా)
“అయితే... నేను పెద్దయ్యాక ఖచ్చితంగా Scientist నే అవుతాను!”
పృథ్వి: (నవ్వుతూ, ఆటపట్టిస్తూ)
“అదేంటి? మొన్నెప్పుడో Doctor అవుతానని చెప్పావు కదా?”
జై: (ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా)
“నేను Doctor అవుతా... Scientist కూడా అవుతా.”
పృథ్వి ఆశ్చర్యంతో కూడిన నవ్వు నవ్వాడు.
జై: (చాలా దృఢమైన స్వరంతో)
Doctor అయ్యి అందరికీ మంచి వైద్యం చేస్తాను. Scientist అయ్యి... సరిగ్గా ఇలాంటి అద్భుతమైనదేదో నా దేశం కోసం కనిపెడతాను!”
పృథ్వి మురిపెంగా ఆ చిన్నారి వైపు చూసి నవ్వాడు. జై ఆత్మవిశ్వాసం చూసి అతనికి ముచ్చటేసింది.
జై:
“నేను ఖచ్చితంగా Scientist అవుతాను పెద్దనాన్నా,” (అన్నాడు మరోసారి తన కలను స్థిరపరుచుకుంటూ)
పృథ్వి: (ప్రేమగా తల నిమురుతూ)
“సరే సరే... అవన్నీ అవుదువు గానీ... ముందు వెళ్లి పడుకో. రేపు పొద్దున్నే స్కూల్‌కి వెళ్లాలి కదా, Scientist గారు!”
జై:
“హ్మ్!” (అని ఉత్సాహంగా తలూపి, తుర్రున బయటికి పరుగెత్తాడు)
పృథ్వి పెదవులపై ఆత్మీయమైన చిరునవ్వు అలానే నిలిచిపోయింది. మళ్ళీ తన దృష్టిని Laptop వైపు మళ్లించాడు.

దేశానికి వెలుగునిచ్చే అద్భుతమైన ఆవిష్కరణలు...
రేపటి భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చే చిన్నారి కలలు!