తెలుగిల్లు ముచ్చట్లు • సంక్రాంతి జ్ఞాపకాలు

భోగి మంటల వెచ్చదనం...

అవి నేర్చుకోవడానికి పెట్టిన పాఠాలు కాదు... జీవించడానికి వేసిన బాటలు!

తెల్లవారుజామున భోగి మంటల జ్ఞాపకాలతో ఉన్న అమ్మమ్మ మరియు తాతయ్య
తెల్లవారుజాము మంచులో... భోగి మంటల జ్ఞాపకాలతో శ్రీ అమ్మమ్మ మరియు అనంత్ తాతయ్య.
భోగి మంటల జ్ఞాపకాలతో
శ్రీ అమ్మమ్మ , అనంత్ తాతయ్య early in the morning
అమ్మమ్మ:
(నేల వైపు చూస్తూ నిట్టూరుస్తూ)
ఈ మధ్య భోగి మంటల్ని చూస్తుంటే... ఏంటో, మంట చిన్నదైపోయిందేమో అనిపిస్తోంది.
తాతయ్య:
(కాఫీ సిప్ చేస్తూ, చిరునవ్వుతో)
మంట చిన్నది కాలేదు ఓసీ... మనం పెద్దవాళ్లం అయిపోయాం, అంతే.
అమ్మమ్మ:
(ఆయన వైపు చురుగ్గా చూస్తూ) అబ్బ, నా ఉద్దేశం అది కాదండీ!
మా చిన్నప్పుడు భోగి మంటంటే... ఆకాశాన్ని తాకుతున్నట్టు, ఆరు ఏడు అడుగుల ఎత్తులో ఉండేది.
తాతయ్య:
అవునులే... కానీ అది కేవలం మంట కాదు. అదొక యజ్ఞం.
ముందు రోజు గొయ్యి తవ్వడం, చుట్టూ పేడతో కళ్ళాపి చల్లడం... మంచు కురుస్తుండగా తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి దీపం పెట్టడం...
అమ్మమ్మ:
అప్పట్లో చలి కూడా ఎముకలు కొరికేసేలా ఉండేది కదా.
తాతయ్య:
ఉండేది. కానీ ఆ మంట చుట్టూ చేరి కూర్చుంటే... ఆ ఆత్మీయతల వెచ్చదనంలో చలి అసలు గుర్తుకే వచ్చేది కాదు.
అమ్మమ్మ:
(నవ్వుతూ) అందరూ కబుర్లు చెప్పుకుంటూ... ఒకపక్క మగవాళ్ళు, మరోపక్క పిల్లలు...
తాతయ్య:
పిల్లలు కాదు... పిడుగులు! దొడ్లో ఉన్న పాత మంచాలు, విరిగిన కుర్చీలు... 'తెల్లారేసరికి మాయం అయిపోయాయేంట్రా' అని ఇంట్లో వాళ్ళు తల పట్టుకునేవారు.
అమ్మమ్మ:
(మెల్లగా నవ్వుతూ) వట్టి ఆకతాయి పనులు.
తాతయ్య:
ఆకతాయి పనులే. కానీ అప్పట్లో 'వృథా' అనే మాటే లేదు. ఎండు పుల్ల, రాలిన ఆకు, పిడక... ప్రతీదీ పనికొచ్చేదే.
అమ్మమ్మ:
(ఆలోచనగా) ఇప్పుడు 'రీసైక్లింగ్' అని ఇంగ్లీషులో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. అప్పట్లో మనకది జీవన విధానం.
తాతయ్య:
(తల ఊపుతూ) అక్షరాలా నిజం. సంక్రాంతి అంటే నాకు అదే. కాలం మారడం కాదు... కాలంతో పాటు మనమూ, మన అలవాట్లు మారడం.
(ఇద్దరూ కాసేపు మౌనంగా భోగి మంట తాలూకు బూడిదను చూస్తుంటారు)
అమ్మమ్మ:
(ఆర్ద్రంగా) మనకి తెలియకుండానే... ఆ మంటల్లోంచి ఎంతో నేర్చుకున్నాం కదండీ.
తాతయ్య:
అవి నేర్చుకోవడానికి పెట్టిన పాఠాలు కాదు... జీవించడానికి వేసిన బాటలు.