ఒకప్పుడు నీకు చూపించాలి అనిపించే విషయాలు, తర్వాత అవసరం లేదనిపించాయి.
1
2
3
భాగం 1: పాత ఫోటోలు
రాత్రి పదకొండు దాటుతోంది. ఇంట్లో దాదాపు అందరూ తమ గదుల్లోకి వెళ్లిపోయారు. హాల్‌లో ఒక మూలన పల్లవి సోఫా మీద కూర్చుని ఉంది. పాత కాటన్ కుర్తా. జుట్టు పైకి చుట్టి క్లిప్ పెట్టుకుంది. చేతిలో phone. ఏదో చూస్తూ తనలో తానే నవ్వుకుంటోంది.
డైనింగ్ టేబుల్ దగ్గర laptop ముందు కూర్చున్న అభిజీత్ మాత్రం పాత files వెతుకుతున్నాడు. రేపటి class కోసం ఒక పాత సెమినార్ ఫోటో కావాలి. Folders వెతుకుతూ ఉండగా, ఫోన్ backupలో ఒక పాత ఫోటో కనిపించింది.
పల్లవి. చాలా సంవత్సరాల క్రితం. కొత్త చీర కట్టుకుని అద్దం ముందు తీసుకున్న selfie.
దాని కింద అతని message:
“ఇంత బాగుంటే నేను class ఎలా తీసుకోవాలి?”
అభిజీత్ చిన్నగా నవ్వాడు.
మరో ఫోటో. పల్లవి జుట్టు కత్తిరించుకున్న రోజు.
“ఇది unfair. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇలా experiments చేయకూడదు.”
మరో ఫోటో. supermarket నుంచి వింత మొహం పెట్టి పంపింది. అతని reply:
“ఇదే మొహంతో ఇంటికి వస్తే తలుపు తీయను.”
దాని తర్వాత మూడు నవ్వుల emojis. అభిజీత్ నవ్వుతూనే scroll చేశాడు. ఫోటోలు… ఫోటోలు… ఫోటోలు… ఏ కారణం లేకుండా పంపినవి కూడా ఉన్నాయి.
టీ కప్పు పట్టుకుని.
వంటగదిలో పిండి చెంప మీద అంటుకుని.
కారులో ఎదురుచూస్తూ.
ఒకసారి కేవలం తన కళ్ళు మాత్రమే కనిపించేలా తీసుకున్న ఫోటో.
ప్రతి ఫోటో కిందా అతని నుంచి ఏదో ఒక మాట.
“అందంగా ఉన్నావు.”
“త్వరగా ఇంటికి రా.”
“మిస్ యూ.”
“అది నా పల్లవి.”
కొన్ని చోట్ల కేవలం ❤️.
అభిజీత్ ముఖంలో ఉన్న నవ్వు నెమ్మదిగా తగ్గింది. Scroll చేస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్లాడు. ఫోటోలు తగ్గిపోయాయి. అతని replies కూడా మారిపోయాయి.
“బాగుంది.”
“Meetingలో ఉన్నా.”
👍
మరికొన్ని చోట్ల… ఏమీ లేదు.
అభిజీత్ చేతి వేళ్లు స్క్రీన్ మీద ఆగిపోయాయి. ఇంకాస్త ముందుకు వెళ్లాడు. ఒక దశ తర్వాత పల్లవి ఫోటోలు అసలు లేవు.
భాగం 2: ఒక క్లిక్
అభిజీత్ ఫోన్ నుంచి తలెత్తి ఎదురుగా చూశాడు. పల్లవి అదే సోఫా మీద కూర్చుని ఉంది. జుట్టు అస్తవ్యస్తంగా ఉంది. కళ్లజోడు కొంచెం ముక్కు మీదకి జారింది. ఏదో వీడియో చూసి నవ్వుతోంది. అభిజీత్ కొద్దిసేపు ఆమెనే చూస్తూ ఉన్నాడు. పల్లవి గమనించలేదు. అతను ఫోన్ తీసుకుని ఆమెకు తెలియకుండా ఒక ఫోటో తీశాడు.
క్లిక్.
పల్లవి వెంటనే తలెత్తింది.
పల్లవి:
“ఏంటి?”
అభిజీత్:
“ఫోటో తీశాను.”
పల్లవి కనుబొమ్మలు పైకి లేపింది.
పల్లవి:
“నాదా?”
అభిజీత్:
“హ్మ్.”
పల్లవి:
ఆమె తన దుస్తుల వైపు చూసుకుంది. జుట్టు సరిచేసుకుంటూ, “అయ్యో అభి… ఈ అవతారంలోనా? Delete చేయి.”
అభిజీత్:
ఆమెను చూస్తూనే “ఎందుకు?”
పల్లవి:
“ఎందుకేంటి? చూడటానికి ఎలా ఉన్నానో చూడు.”
కొద్దిసేపు నిశ్శబ్దం.
అభిజీత్:
“చూస్తున్నాను.”
ఆ మాటలో ఏదో తేడా ఉండటంతో పల్లవి అతని వైపు చూసింది.
అభిజీత్:
కొద్దిగా నవ్వి “బాగున్నావు.”
పల్లవి నవ్వేసింది.
పల్లవి:
“ప్రొఫెసర్ గారూ… వేళాపాళా లేదా మీ పరిహాసాలకి?”
అభిజీత్:
“లేదు. నిజంగానే.”
ఆమె నవ్వు కొంచెం తగ్గింది. అభిజీత్ laptop మూసేశాడు.
అభిజీత్:
“పల్లూ…”
పల్లవి:
“హ్మ్?”
అభిజీత్:
“నువ్వు నాకు ఫోటోలు పంపడం ఎప్పుడు మానేశావు?”
పల్లవి రవ్వంత ఆశ్చర్యంతో చూస్తూ “ఏంటి సడన్‌గా?”
అభిజీత్:
“పాత మెసేజులు చూస్తున్నాను.”
పల్లవి:
కొద్దిగా ఆలోచించి “తెలీదు,” అంది.
అభిజీత్:
“నాకు కూడా తెలీదు.”
మళ్లీ నిశ్శబ్దం. అభిజీత్ ఫోన్ తీసుకుని కొన్ని పాత మెసేజులు ఆమెకు చూపించాడు. పల్లవి చూసింది. ఒక ఫోటో. దాని కింద అతని పాత మెసేజ్. ఆమెకు చిరునవ్వు వచ్చింది.
పల్లవి:
“ఇన్ని డైలాగులు చెప్పేవాడివా నువ్వు?”
అభిజీత్:
“అలా ఉన్నట్టున్నా.”
ఇద్దరూ నవ్వారు. అభిజీత్ ఇంకొన్ని మెసేజులు scroll చేశాడు. తర్వాత వచ్చినవి...
“బాగుంది.”
“బిజీగా ఉన్నా.”
👍
పల్లవి నవ్వు ఆగిపోయింది. అభిజీత్ స్క్రీన్ ఆఫ్ చేశాడు.
అభిజీత్:
“నువ్వు ఫోటోలు పంపడం మానేశావని ఇప్పటివరకు నేను గమనించలేదు.”
పల్లవి:
వెంటనే ఏమీ అనలేదు. కొద్దిసేపటి తర్వాత, “అభి… అది అంత పెద్ద విషయం కాదు.”
అభిజీత్:
“అదే సమస్య అనుకుంటా.”
ఆమె అతని వైపు చూసింది.
అభిజీత్:
“పెద్ద విషయం కాకపోవడం.”
భాగం 3: సమాధానం
పల్లవి నిశ్శబ్దంగా ఉంది.
అభిజీత్:
“ఒకప్పుడు నువ్వు supermarket నుంచి కూడా ఫోటో పంపేదానివి.”
పల్లవి:
“నీ reaction కోసం.”
అభిజీత్ కళ్ళు ఆమె మీదే నిలిచిపోయాయి.
అభిజీత్:
“తర్వాత?”
పల్లవి:
భుజాలు కొద్దిగా ఎత్తి, “నీ reaction ఏముంటుందో ముందే తెలిసిపోయేది.”
ఆ మాట చాలా మామూలుగా చెప్పింది. కానీ అభిజీత్‌కు అది బలంగా తగిలింది.
పల్లవి:
“‘బాగుంది.’
‘తర్వాత చూస్తాను.’
ఒక్క థంబ్స్‌అప్…”
చిన్నగా నవ్వి, “అప్పుడు నేను కూడా అనుకున్నాను… సరే, ఎందుకు disturb చేయడం అని.”
అభిజీత్:
“హర్ట్ అయ్యావా?”
పల్లవి:
తల అడ్డంగా ఊపింది. కొద్దిసేపు ఆగి, “కానీ… ఒకప్పుడు నీకు చూపించాలి అనిపించే విషయాలు, తర్వాత అవసరం లేదనిపించాయి.”
అది విన్నాక అభిజీత్ ఏమీ మాట్లాడలేదు. పల్లవి అతని ముఖం చూసి నవ్వింది.
పల్లవి:
“ఏంటి ఇప్పుడు Maths problem solve చేస్తున్నట్టు మొహం పెట్టావు?”
అభిజీత్:
కూడా చిన్నగా నవ్వి “Mathsలో కనీసం mistake ఎక్కడ జరిగిందో కనిపెడతాం.”
పల్లవి:
“Marriageలో?”
అభిజీత్:
“చాలాసార్లు ఆన్సర్ వచ్చాకే mistake కనిపిస్తుంది.”
పల్లవి నవ్వింది. అభిజీత్ కొద్దిసేపు ఆమెను చూశాడు.
అభిజీత్:
“నిన్ను ప్రేమించడం మానలేదు పల్లూ.”
పల్లవి:
వెంటనే “నాకు తెలుసు,” అన్నది.
అభిజీత్:
తల ఊపుతూ “అదే.”
ఆమె ప్రశ్నార్థకంగా చూసింది.
అభిజీత్:
“నీకు తెలుసు కదా అని నేను చాలా comfortable అయిపోయాను.”
పల్లవి ముఖంలో నవ్వు నెమ్మదిగా మాయమైంది.
అభిజీత్:
“తెలుసుకోవడం వేరు... తెలియజేయడం వేరు.”
పల్లవి అతన్ని చూస్తూ ఉండిపోయింది. అభిజీత్ ఫోన్ మళ్లీ పైకి ఎత్తాడు.
పల్లవి:
“మళ్లీ ఫోటో?”
అభిజీత్:
“హ్మ్.”
పల్లవి:
“కనీసం జుట్టైనా సరిచేసుకోనివ్వు.”
అభిజీత్:
“వద్దు.”
పల్లవి:
“ఎందుకు?”
అభిజీత్:
అతను cameraలో ఆమెను చూస్తూ అన్నాడు. “నాకు కనిపిస్తున్న పల్లవి ఇదే కదా.”
పల్లవి ఒక్క క్షణం మౌనంగా అతన్ని చూసింది. తర్వాత నవ్వింది. ఆ పరిచయమైన నవ్వు. ఎన్నో సంవత్సరాల క్రితం ఫోటోల్లో ఉన్న అదే నవ్వు.
అభిజీత్ ఫోటో తీశాడు.
ప్రేమను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో... దాన్ని వ్యక్తపరచడం కూడా అంతే ముఖ్యం.
'తెలుసు కదా' అనే కంఫర్ట్ వస్తే, అది బంధానికి బలాన్ని కాదు... ఒక్కోసారి నిశ్శబ్దమైన దూరాన్ని కూడా ఇవ్వొచ్చు. తెలుసుకోవడం వేరు... తెలియజేయడం వేరు.