Edit Template

భోగి పళ్ళు

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

భోగి పళ్ళు

Sri, Medha, Jahnavi, Anandi, Pallavi, Surya, Jai, Manvi

ఇంట్లో భోగి పండుగ సందడి. టేబుల్ మీద భోగి పళ్ళ పళ్ళేలు, రేగుపళ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు సిద్ధంగా ఉన్నాయి. మాన్వికి తల దువ్వుతుంటారు. జై తన కొత్త బట్టలు సర్దుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంటాడు.

మేధ: (మాన్వి వంక ముచ్చటగా చూస్తూ) అమ్మమ్మా, మా చిన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే ముస్తాబు చేసేవారా? అమ్మమ్మ: చేయకేం? మీకందరికీ తలా ఓ గుప్పెడు పోశాం కదే. అదొక హడావిడి అప్పట్లో. ఆనంది: నాకైతే అస్సలు గుర్తులేదు. అప్పుడు మనకేం తెలుస్తుందిలే. సిరి: (కుతూహలంగా) అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారే అమ్మమ్మా? ఏదో ఆచారం అనో, అందరూ చేస్తున్నారనోనా? అమ్మమ్మ పళ్ళెం వంక ఒకసారి చూసి, చిరునవ్వు నవ్వింది. అమ్మమ్మ: ఏదో ఆచారం కోసం కాదులేవే… దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. చిన్నప్పుడు మిమ్మల్ని సాక్షాత్తు ఆ నారాయణుడిలా భావిస్తాం. జై: (అమాయకంగా మొహం పెట్టి) నేను నారాయణుడినా? అంటే దేవుడినా? అమ్మమ్మ: (నవ్వుతూ, ఎటకారంగా) మరీ సంబరపడిపోకు… ఈ ఒక్క రోజుకి మాత్రమే! అందరూ గొల్లున నవ్వుతారు. అమ్మమ్మ: (కొనసాగిస్తూ) నర-నారాయణులు అని ఇద్దరు, బదరీ వనంలో తపస్సు చేశారు. శివుడి కోసం ఇసుకతో లింగం చేసి పూజించారు. ఆ తపస్సుకి మెచ్చి దేవతలు బదరీ ఫలాలు (రేగుపళ్ళు) కురిపించారు. దానికి గుర్తుగానే పిల్లల తల మీద ఈ రేగుపళ్ళు పోస్తాం. అదొక శ్రీరామరక్ష అన్నమాట. సిరి: ఓహో… అంటే పిల్లల్లో నారాయణుడిని చూసుకుంటూ చేసే పండగన్నమాట. అమ్మమ్మ: అంతేగా. పెద్దల ఆశీర్వాదం, దేవుడి రక్ష. సూర్య: (మధ్యలో కలుగజేసుకుంటూ) దీని వెనుక సైన్స్ కూడా ఉందమ్మా, చెప్పమంటావా? అమ్మమ్మ: చెప్పురా శాస్త్రవేత్తా. సూర్య: పిల్లల తల మీద ‘బ్రహ్మరంధ్రం’ అని చాలా సున్నితమైన భాగం ఉంటుంది. చిన్నప్పుడు అది మరీ మెత్తగా ఉంటుంది. ఈ రేగుపళ్ళు పోయడం వల్ల అక్కడ చిన్నగా ఒత్తిడి (stimulation) తగిలి, రక్త ప్రసరణ (Blood flow) బాగుంటుంది. పైగా అందరూ చేరి ముట్టుకుని దీవించడం వల్ల పిల్లలకి అదొక మానసిక ధైర్యం. ఆనంది: అంటే ఆచారం ప్లస్ ఆరోగ్యం అన్నమాట. మేధ: భక్తికి భక్తి, సైన్సుకి సైన్సు. సిరి: (నవ్వుతూ) అందుకేనా ఏజ్ లిమిట్ పెట్టారు? సూర్య: కరెక్ట్. అందుకే తొమ్మిది నెలలు దాటాకే, తల కాస్త గట్టిపడ్డాకే పోస్తారు. పల్లవి చేతిలో లిస్ట్ పట్టుకుని హడావిడిగా వస్తుంది. పల్లవి: ఏవండీ… రేగుపళ్ళు ఒకసారి చెక్ చేశారా? చిల్లర నాణేలు సరిపోయాయా? జాహ్నవి: (వంటగదిలో నుంచి) పేరంటం కోసం పక్కింటి వాళ్ళని పిలిచారా లేదా? ఆనంది:చెప్పాం పిన్ని. మేధా, సిరి — మీ ఫ్రెండ్స్ కి చెప్పారా? సిరి: ఆ… పక్కింటి ఆంటీ కూడా వస్తామన్నారు. అమ్మమ్మ: (సంతృప్తిగా)హమ్మయ్య… ఇప్పుడే కళ వచ్చింది ఇంటికి. మాన్వి మళ్ళీ పళ్ళెం వంక చూస్తుంది. మాన్వి: అమ్మమ్మా… నేను నారాయణుడిని కదా, మరి నాకెందుకు భయం? అమ్మమ్మ: (మాన్వి బుగ్గ నిమురుతూ) భయం ఎందుకులే తల్లీ… ఇది భయం కాదు, దిష్టి తగలకుండా ఇచ్చే దీవెన! అందరూ నవ్వుతూ మాన్విని దగ్గరికి తీసుకుంటారు.

భోగి పళ్ళు

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']