భోగి పండుగ ఉదయం. చలిగాలులు వీస్తున్న వరండా.
దూరం నుండి ‘హరిలో రంగ హరి’ అంటూ హరిదాసు కీర్తన క్రమంగా దగ్గరవుతోంది.
(తంబుర శ్రుతి, గజ్జెల సవ్వడి లయబద్ధంగా వినిపిస్తుండగా…)
మాన్వి: “అమ్మమ్మా… ఈ పాట ఇంటిలో నుంచి వస్తున్నట్టు లేదే?” జై: “అవును, వీధిలో నుంచే వినిపిస్తోంది.” అమ్మమ్మ: (చిరునవ్వుతో) “అవును… హరిదాసు వచ్చాడు.” (అందరూ నిశ్శబ్దంగా మారారు. వంటింట్లో చప్పుళ్ళు కూడా తగ్గాయి.) ఆనంది: (మెల్లగా) “అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారేంటి?” అమ్మమ్మ: “ష్! సాక్షాత్తూ ఆ నారాయణుడి నామం వినబడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు, వినాలి అంతే.”(హరిదాసు గేటు దగ్గర నిల్చుని తన్మయత్వంతో పాడుతున్నాడు. లోపలికి రాలేదు, యాచించలేదు. కేవలం పాడుతున్నాడు.)
మేధ: (ఆసక్తిగా) “అమ్మమ్మా! మీ చిన్నప్పుడు కూడా ఇలానే వచ్చేవారా?” అమ్మమ్మ: (కళ్ళలో ఏదో తెలియని మెరుపుతో) “ఇలానే కాదు తల్లీ… అప్పట్లో ఆ అక్షయపాత్ర చప్పుడు వినబడితే చాలు, ఊరంతా లేచి నిలబడేది. హరిదాసు గజ్జెల సవ్వడి వినిపించిందంటే సంక్రాంతి మన వాకిట్లోకి వచ్చినట్టే.” మాన్వి: (గుసగుసగా) “అంటే… ఆయన మనీ కోసం పాడుతున్నారా?” అమ్మమ్మ: (సున్నితంగా వారస్తూ) “అలా అనకూడదమ్మా. అది భిక్ష కాదు… గొప్ప సంప్రదాయం. హరిదాసు తన పాటతో ఆ కృష్ణ పరమాత్ముడిని మన ఇంటికి పిలుస్తాడు. మనం ఆ అక్షయపాత్రలో వేసే గుప్పెడు బియ్యం నేరుగా ఆ దేవుడికే చేరుతాయని మన నమ్మకం.”(హరిదాసు పాత్రను కిందకి దించకుండానే బియ్యం స్వీకరిస్తాడు.)
(హరిదాసు ముందుకు కదులుతుండగా పాట సన్నగిల్లుతుంది.)
జై: “పాట వెళ్లిపోయింది.”
అమ్మమ్మ: “పాట వెళ్లిపోలేదురా కన్నా… మన పండుగని నిద్రలేపి వెళ్లింది. పదండి, ఇక పనులు మొదలుపెడదాం.”(వంటింట్లో మళ్ళీ సలసల శబ్దాలు, పండగ సందడి మొదలైంది.)