సంక్రాంతి పర్వదినం. తెల్లవారుజామున మంచు ఇంకా దట్టంగా కురుస్తోంది. ఇంటి ముందు వాకిలిలో దీపాల కాంతుల్లో ముగ్గుల హడావిడి కనిపిస్తోంది.
(మేధా చేతిలో ముగ్గుపొడితో, నేల వైపు నిరాశగా చూస్తూ ఉంటుంది. పక్కనే ఫోన్లో యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంటుంది.)
మేధ: “అమ్మమ్మా! ఈ మెలికల ముగ్గు అస్సలు తిరగట్లేదు. ఆ యూట్యూబ్ వీడియోలో వాడు ఎంత ఈజీగా వేశాడో… ఇక్కడేమో చుక్కలు కలవవు, గీతలు కుదరవు!” శ్రీ: (మనుమరాలి ఆవేదన చూసి నవ్వుకుంటూ, దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి) ” మేధా! ముగ్గు అంటే కళ్ళతో చూసి గీసే గీత కాదు… మనసు లగ్నం చేసి దిద్దే రాత. మా రోజుల్లో అయితే, చుక్కలు పెట్టి, గీత తడబడకుండా పెద్ద పెద్ద రథం ముగ్గులు వేసేవాళ్ళం. అదొక ఏకాగ్రత!” జాహ్నవి: ” అమ్మ మమ్మల్ని కూడా కోడి కూయకముందే, నాలుగు గంటలకే లేపేసేది. కళ్ళాపి చల్లి, ఆ తడి ఆరకముందే బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళం. ఆ పిండి వాసన, ఆ చలి… అదో మధుర జ్ఞాపకం.” పల్లవి: “అవునక్కా! అప్పట్లో పక్కింటి వాళ్ళ ముగ్గు కంటే మనది పెద్దగా ఉండాలని ఎంత పోటీ పడేవాళ్ళమో! ఇప్పుడు ఈ కాంక్రీట్ అడవిలో, అపార్ట్‌మెంట్లలో ఆ జాగా ఎక్కడుంది? ఆ పోటీ ఎక్కడుంది?” అను: “అందుకేనేమో పల్లవి, ఇప్పుడు పిల్లలు డిజైన్ల విస్తీర్ణం కంటే రంగుల ఆకర్షణ మీద ఎక్కువ మోజు పడుతున్నారు. ముగ్గు చిన్నదైనా సరే, రంగులతో ఇంటికి నిండుగా కళ వస్తుందిలే.” ఆనంది: (చేతిలో స్టిక్కర్ ప్యాకెట్ చూపిస్తూ, ఉత్సాహంగా) “అమ్మా, నేను ఈ ముగ్గు మధ్యలో స్టిక్కర్ అతికించనా? ఈజీగా అయిపోతుంది, పైగా చూడటానికి నీట్‌గా ఉంటుంది కదా!” శృతి: (వారించి, గట్టిగా) “వద్దులేమ్మా… స్టిక్కర్లు కన్నా నువ్వు చేత్తో గీస్తేనే పండగలా ఉంటుంది. కాస్త వంకరగా వచ్చినా పర్లేదు, నువ్వే ప్రయత్నించు.” సిరి: (కళ్ళల్లో మెరుపుతో) “అత్తమ్మ చెప్పింది కరెక్ట్! నేను చిన్న ముగ్గు వేసాను, కానీ ఇందులో గ్లిట్టర్ చల్లాను. అమ్మమ్మ చూడు ఎంత మెరుస్తుందో!” శ్రీ: (సిరి వేసిన ముగ్గును చూసి, తల నిమురుతూ) “బాగుంది సిరి తల్లి! కాలం మారిపోతోంది అనడానికి ఇదే సాక్ష్యం. అప్పట్లో బియ్యం పిండి వేస్తే చీమలకు ఆహారమయ్యేది, పుణ్యం వచ్చేది… ఇప్పుడు కంటికి అందం మాత్రమే మిగులుతోంది. అయినా పర్లేదులే… మీ   ఉత్సాహమే అసలైన పండగ.” మేధ: (ఆశ్చర్యంగా) “ఓహో! అంటే ముగ్గు వెనుక ‘ఎకో-ఫ్రెండ్లీ’ కాన్సెప్ట్ ఉందన్నమాట అప్పట్లో!” జాహ్నవి: “కచ్చితంగా! సంక్రాంతి అంటేనే ప్రకృతికి దగ్గరగా ఉండటం. గొబ్బెమ్మలు పెట్టడం, బంతి పూలతో అలంకరించడం… అన్నీ మన మట్టి వాసనలే.” అను: “ఆనంది, సిరి, వెళ్లి గొబ్బెమ్మలు తీసుకురండి. ముగ్గు పూర్తవ్వాలంటే గొబ్బెమ్మలు సింహాసనం ఎక్కాల్సిందే.” పల్లవి: “శృతి, నువ్వు ఆ పసుపు కుంకుమ ఇటు ఇవ్వు. అమ్మా, నువ్వు వచ్చి తొలి గొబ్బెమ్మ పెట్టు, తర్వాత పిల్లలు పెడతారు.” శ్రీ: (గొబ్బెమ్మను చేతిలోకి తీసుకుని, కళ్ళకద్దుకుంటూ ఉద్వేగంగా) “పదండి… తరాలు మారినా, ముగ్గులు మారినా, మన లోగిలిలో పండగ శోభ మాత్రం ఎప్పటికీ ఇలాగే కళకళలాడుతూ ఉండాలి.”(శ్రీ గొబ్బెమ్మను ముగ్గు మధ్యలో ఉంచుతుండగా, మంచు తెరల మాటున సూర్యోదయం అవుతుంటుంది. అందరి ముఖాల్లోనూ సంతృప్తి, ఆనందం వెల్లివిరుస్తాయి.)